ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారు

– ఈ నెల 19 నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు

అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 23వ తేదీ వరకు సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఏపీ అసెంబ్లీలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రం నుంచి ఎలక్టోరల్ కాలేజ్ లో సభ్యులుగా ఉన్న ఎంపీలు – ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇప్పటికే అధికార వైసీపీ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపదీ ముర్ముకు తమ మద్దతు ప్రకటించింది. టీడీపీ సైతం ముర్ముకే మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కానీ, ఇప్పటి వరకు టీడీపీ ఈ విషయం పైన అధికారికంగా తమ నిర్ణయం వెల్లడించ లేదు. ఈ నెల 19న బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. అందులో సభను ఎప్పటి వరకు నిర్వహించేదీ.. షెడ్యూల్ పైన నిర్ణయం తీసుకోనున్నారు. అదే రోజున శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎంపిక కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. కొత్త డిప్యూటీ స్పీకర్ గా ఇప్పటికే విజయనగరం ఎమ్మెల్యే కొలగొట్ల వీరభద్ర స్వామిని ఖరారు చేశారు.

మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా వైశ్య వర్గానికి మంత్రి పదవి లేకపోవటంతో..డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కోన రఘుపతి స్థానంలో కొలగొట్లను ఎంపిక చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 18న అసెంబ్లీకి రానున్నారు. గత కొద్ది నెలల క్రితం తన సతీమణిని వైసీపీ సభ్యులు అవమానించారని.. కన్నీటి పర్యంతమైన చంద్రబాబు ఇక, తాను తిరిగి సీఎంగానే సభలోకి అడుగు పెడతానని శపథం చేసారు. అయితే, ఆయన సభకు గైర్హాజరు కావాలని నిర్ణయించినా.. ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

ఈ నెల 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అసెంబ్లీకి రానున్నారు. సభకు మాత్రం హాజరు అయ్యే అవకాశం లేదు. ఇక, ప్రభుత్వం ఈ మూడేళ్ల కాలంలో అమలు చేసిన పథకాలు.. ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాల పైన చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా.. మూడేళ్ల ప్రగతి పైన శాసన సభా వేదికగా ప్రకటన చేసేందుకు సిద్దం అవుతోంది. ప్రతిపక్షాలు సైతం రాష్ట్రంలో శాంతి భద్రతలు.. ఉద్యోగాల భర్తీ .. అధిక ధరల పైన నిలదీసేందుకు సిద్దం అవుతున్నారు.

Leave a Reply