Suryaa.co.in

Telangana

కేసిఆర్ ఆదేశాల ప్రకారం శరవేగంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ పనులు

– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: హుస్సేన్ సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు సోమవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న విగ్రహం ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయించిన నేపథ్యంలో ఆయన సూచనల మేరకు పనుల పురోగతిని పరిశీలించారు.నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరిగి పనులు పరిశీలించిన అనంతరం అక్కడే అధికారులు, వర్క్ ఏజెన్సీతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…”భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు అంటే కేసిఆర్ గారికి ప్రత్యేకమైన ప్రేమ. వారు రాజ్యాంగంలో పొందుపర్చిన ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని తరుచూ ఆయన్ను కీర్తిస్తుంటారు. ఆయన ఆశయాలు,ఆలోచనలు భవిష్యత్ తరాలు నిత్యం స్మరించుకునేలా, ఒక దిక్సూచిలా ఉండేలా హుస్సేన్ సాగర్ తీరాన అత్యంత ప్రతిష్టాత్మకంగా 125 అడుగుల విగ్రహం నిర్మిస్తున్నరు. ఏప్రిల్ 14న అట్టహాసంగా విగ్రహం ప్రారంభోత్సవం చేసుకోవాలని కేసిఆర్ ఇప్పటికే నిర్ణయించారు.

ఈ విగ్రహ ప్రారంభోత్సవానికి దేశంలోని పలువురు ప్రముఖులు రానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గౌరవం మరింత పెరిగేలా నిర్మాణం రూపుదిద్దుకోవాలి. విగ్రహ నిర్మాణ పనులు వేగంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి. ప్రధాన విగ్రహం,ల్యాండ్ స్కేప్ ఏరియా, రాక్ గార్డెన్,లాన్స్ లో ప్లాంటేషన్,పార్లమెంట్ ఆకృతి వచ్చే స్థంబాల సాండ్ స్టోన్ వర్క్స్, వాటర్ ఫౌంటైన్,వి.ఐ.పి మరియు విజిటర్స్ పార్కింగ్ ఏరియా, మెయిన్ ఎంట్రన్స్ క్లాడింగ్ వర్క్స్,గ్రానైట్ ఫ్లోరింగ్,అధునాతన ఆడియో,వీడియో రూం ఇలా అన్ని రకాల పనులకు పర్ట్ చార్ట్ రూపొందించుకొని దాని ప్రకారం పనులు వేగంగా జరగాలి.

అందుకు సరిపడా మ్యాన్ పవర్ పెంచాలి. తక్షణమే ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి అందులో వర్క్ ప్రోగ్రెస్ ఎప్పటికప్పడు అప్డేట్ చేయాలి. నేనే స్వయంగా ప్రతిరోజూ రోజువారీ పనులు మానిటరింగ్ చేస్తా. కోట్ల మంది భారతీయుల హృదయాలకు హత్తుకునే నిర్మాణం కాబట్టి ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేయాలి. ఏప్రిల్ 5 లోపు అన్ని రకాల పనులు పూర్తి కావాలి ” అని మంత్రి అదికారులకు,వర్క్స్ ఏజెన్సీకి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఆర్ అండ్ బి ఈఎన్సి గణపతి రెడ్డి, ఎస్.ఈలు హఫీజుద్దిన్,లింగా రెడ్డి,ఈ.ఈ రవీంద్ర మోహన్,పలువురు అధికారులు, కెపిసి నిర్మాణ సంస్థ ప్రతినిధులు అనిల్, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE