Suryaa.co.in

Features

మహాశివరాత్రి శుభసందర్భంగా మహాస్మశానంలో మూడురోజులు

( కామర్సు బాలసుబ్రహ్మణ్యం, ఢిల్లీ)

మహాశివరాత్రికి కాశీ వెళ్ళాలని అనిపించటం సామాన్యమే. నాకూ అనిపించి ticket reservation చేయించాను. Waiting list లో book అయింది, తరువాత confirm అయింది కూడా. ఈలోపల కొందరు మిత్రులు కుడా కలిసి వస్తే నాకు బాగుండుననిపించింది. మిత్రులకూ అనిపించింది. ఎల్లుండి మహాశివరాత్రి అంటే ఇవాళ కాశీకి ఎలా ప్రయాణం చేయాలా అని ఆలోచించేవాళ్ళని mavericks అనచ్చేమో. నేనంతే. ఈ మిత్రులూ అంతే. అంతే – Feb 27 న మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి కాశీకి కారులో బయలుదేరాము! అయిదుగురం. Best plan is no plan – అని అనుకునే వాళ్ళం.

చక్కగా కబుర్లు కథలు చలోక్తులు నవ్వులు చిరుతిళ్ళు మధ్యమధ్యలో టీ లు ఎన్నెన్నో విషయాల మీద చర్చోపచర్చలు.. ఇలా సాగిన మా ప్రయాణంలో ఓ ఇద్దరికి ఇదే మొదటి కాశీ ప్రయాణం. మొత్తానికి అనూహ్యంగా ఈ ప్రయాణం ఇలా ప్రారంభమవటం అందరికీ ఆశ్చర్యమే.ఇంతే ఆశ్చర్యకరంగా నా చిరకాల స్నేహితులు మోపిదేవి వాస్తవ్యులు శ్రీ చిరువోలు బుచ్చిరాజుగారు, బెంగళూరు వాస్తవ్యులు శ్రీ వాసిరెడ్డి చైతన్య గారు నేరుగా కాశీ చేరుకునే విధంగా బయలుదేరారు.

కారులో బయలుదేరిన అయిదుగురం దారిలో నాగపూర్ దగ్గర ఆగాలనుకున్నా, ఇంకో వంద కిలోమీటర్లు ప్రయాణించి సివాన్ దగ్గర శర్మ రిసార్ట్ అనే చోట ఆగాము. తరువాతి రోజు ఉదయమే బయలుదేరి జబల్పూర్ దగ్గర భేడాఘాట్ అనేచోట నర్మదాతీరంలో చౌసఠ్ యోగినీ దేవాలయానికి వెళ్ళాము. ఓ 100
balu2
మెట్లు ఎక్కితే కొండ మీద శివకళ్యాణ విగ్రహం, ఇతర దేవీ దేవతల సన్నిధులు కలిగిన దేవాలయం మధ్యలో ఉండగా 125 అడుగుల వ్యాసం కల వృత్తాకార ప్రాకారంలో చతుష్షష్టి యోగినులు ఇతర దేవతామూర్తులతో అలరారే మహత్తరమైన శక్తిక్షేత్రం అది. రెండు సహస్రాబ్ధాల కంటే పురాతన చరిత్ర కల ఈ దేవాలయాన్ని, యోగినీ దేవతల విగ్రహాలను, ముష్కరులు ద్వంసం చేశారు. వృత్తాకార దేవాలయాలలో అతి పెద్దది ఇది. ఢిల్లీలో రాష్ట్రపతి భవనం, పార్లమెంట్ భవనం నిర్మించటానికి దీనిని నమూనాగా వాడారని చెప్తారు.

28వ తేదీ సాయంత్రం కాశీ చేరగలమనుకుంటే ఈ దేవాలయ సందర్శన వల్ల రాత్రయింది. గంగ ఒడ్డున గంగ కనపడేలా ఉండే గదులకోసం ముందుగా నేను నా మిత్రులు చేసుకున్న hotel reservation ఏదో government వారి అవసరం దృష్ట్యా cancel అయ్యాయి. అందువల్ల కేదార్ ఘాట్, పాండే హవేలీ ప్రాంతంలో అందరం ఒకే చోట ఉండటం జరిగింది.

ఈ కాశీ యాత్రలో ప్రారంభం నుంచి ప్రతి విషయమూ ఏదో అద్వితీయమైన ప్రణాళికలో భాగంగా జరిగినట్టు అనూహ్యంగానూ ఆనందకరంగానూ జరిగాయి. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విలక్షణమైన వ్యక్తిత్వ వ్యక్తిగత విశేషాలు కలవారే. శృంగేరీ శారదాపీఠ ఆంతరంగిక సేవానిరతుడు శ్రీ కుప్పా శ్యామసుందర శర్మ ఒకరు. మరొకరు కురిచేటి నరేష్, గతంలో శ్రీ సత్యసాయిబాబా వారిని అతి దగ్గరగా సేవించినవారు. ఇంకొకరు పెదముత్తేవి శ్రీ లక్ష్మణ యతీంద్రుల ఆప్త శిష్యులు హైదరాబాద్ వాస్తవ్యులు, హై కోర్ట్ న్యాయవాది శ్రీ నందివాడ రఘువీర్ గారు. వీరందరినీ నన్నూ కలుపుతూ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి అనుంగు శిష్యుడు చిరంజీవి అనంతాత్మకుల వెంకట నరసింగరావు.

వీరందరికీ ఈ నాలుగు రోజుల సమయావకాశం దొరకటం, నాకు, నా ఇతర మిత్రులకు కుడా కుదరటం, ఈ యాత్రను ప్రతిపాదించగానే ప్రతి ఒక్కరికీ కాశీలో అన్నపూర్ణ, విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో ఈ మహాశివరాత్రి సమయం గడపాలనే బలమైన కోరిక కలగటం – ఏదో యాదృచ్ఛికంగా కనపడే ఈశ్వర కృపా లీలా విశేషమేనేమో!

ఎన్ని సార్లు వెళ్ళినా కాశీ యాత్ర ప్రతిసారీ ఓ గొప్ప వినూతనమైన అనుభూతిని కలిగిస్తుంది. మొదటిసారి కాశీ వచ్చిన మిత్రుల పులకింతకు అంతులేదు! 1250 కిలోమీటర్లు, 21 గంటల ప్రయాణం (విరామ సమయాలతో కలిపి 32 గంటలు) తరువాత కాశీ చేరినా – అలసట కంటే ఆ మహాదేవుని ఒడిలోకి చేరామన్న ఆనందమే ఎక్కువ అయింది అందరికీ.

మహాశివరాత్రి కోలాహలం, కాశీ పట్నంలోని వీధుల ఇరుకు వల్ల car ని దూరంగా parking area లో పెట్టి సామాన్లతో మా బసకు వెళ్ళాలని ముందస్తు నిర్ణయం.
కేదారేశ్వర దేవాలయ మార్గానికి దగ్గరగా car దిగి వారాణసీ క్షేత్ర పవిత్ర భూమికి ప్రణమిల్లి.. మొట్టమొదటగా చింతామణి గణపతి దేవాలయ సమీపంలో బసచేసి ఉన్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారిని సందర్శించాము. అంత ప్రయాణం చేసి వచ్చిన మాకూ అలసట తెలియలేదు, రోజంతా కార్యక్రమాలలో తీరికలేకుండా గడిపిన శ్రీ సామవేదం వారికీ మమ్మల్ని పలకరించటానికి ఏమాత్రం విసుగు లేదు!తరువాత మా బసకు చేరి విశ్రాంతి తీసుకున్నాము.

మరుసటిరోజు మహాశివరాత్రి!
భక్తియోగపదన్యాసి వారణాసిలో మహాశివరాత్రి వైభవం అనుభవైకవేద్యం. సాయంత్రం నిమిష నిమిషానికి పెరుగుతున్న భక్తజన సందోహంతో ఎపుడెపుడా అని ఎదురుచూసిన ఆనందకానన సంస్థితుడు కాశీ విశ్వనాథుడి జ్యోతిర్లింగ రూప దర్శనం జన్మజన్మల సుకృత ఫలం. ఆ పరమశివలింగ స్పర్శతో పురాకృత పాపాలన్నీ పటాపంచలయ్యాయి పుణ్యాలన్నీ స్వామికి నీరాజనాలయ్యాయి అన్న భావన మనసంతా నిండి పొంగి పొరలి ఆనందబాష్పాల వర్షం!

ఆ ఆనందానుభవంలో స్వామికి చతుర్యామ పూజలు జరుగుతుండగా దేవాలయ ఆవరణలో నమకచమకాల పారాయణలు చేస్తూ హరహరమహాదేవ అని నినదిస్తూ లింగోద్భవ కాలంలో మాలాగే అశేష భక్తజనులూ అనుభవిస్తున్న శివానందాతిరేకాన్ని చూస్తూంటే జన్మకి పరమార్థం దొరికిందనటానికి ఈ శివరాత్రి చాలు కదా అని అనిపించింది!

baluమణికర్ణికా స్నానానికి వెళ్తుంటే మహాస్మశానంలో సంసారయాత్రలో అలసి సొలసి నీవేతప్ప ఇతఃపరంబెరుగమని శరణాగతి చేసి కాశీలో మరణించినవారికి నిరంతర లీలగా కాశీవిశ్వనాథుడు సపరివారంగా సేదతీర్చి అనుగ్రహించే తారకమంత్రోపదేశానికి సంసిద్ధులై ఆ మహాదేవుని దర్శనంకోసం పడే ఆత్రుతతో సహా అన్నీ విడచి సమాధిగతులైనవారి భౌతిక అవశేషాల దర్శనం పుణ్యమో, పాపమో – శివా నీ దయ!!

మణికర్ణికలో మధ్యాహ్న స్నానానంతరం – ఇక్కడ స్నానం చేసినవాడికి సద్గతిని నేనిస్తానంటే నేనిస్తానని శివకేశవులు వాదులాడుకుంటారని శంకరాచార్య విరచిత మణికర్ణికాష్టకంలో పఠించి పులకించి.. కాశీయాత్రలో దర్శించుకోవలసిన దైవసన్నిధానాలను మరోసారి గుర్తు చేసుకున్నాము.

*విశ్వేశం మాధవం ఢుండిం దండాపాణిం చ భైరవం ౹
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికామ్ ౹౹*

సాయంత్రం గంగా ఆరతి దర్శనం. గంగమ్మకి ప్రతి సాయంత్రం భవ్య ధూప దీప నైవేద్య ఆరతులు – అలుపు విరామం ఎరుగక ఆర్తుల పాపాలను అనుక్షణం ప్రక్షాళన చేసే ఆ తల్లి తీరికగా అందుకుంటుందనా, మన భక్తిని వ్యక్తపరచి మనమే ఆనందించటానికి కానీ!! ఒడ్డున విశ్వనాథుడిని దర్శించి ఆయన పాదసీమలో సంసారయాత్రా శ్రమను తీర్చుకోవాలని ఎందరెందరో యుగయుగాలుగా ఇక్కడికి వస్తూ తమలాంటి ఇతరులకు తమకు చేతనైన సహాయం చేయాలనే భారతీయ ఆర్షధర్మాన్ని అనుష్ఠిస్తూనే ఉన్నారు.

అడిగితే దారి చెప్పేవారు, అన్నదానాలు చేసేవాళ్ళు, యోగాభ్యాసాలు చేయించే ఆచార్యులు, మంత్రోపదేశాలు చేసే గురువులు.. వేదవ్యాసులు, మాంధాత, సత్యహరిశ్చంద్రాది మహాపురుషులు, మహా చక్రవర్తులు, వశిష్ఠ వామదేవ అగస్త్యాది తపశ్చక్రవర్తులు, ఇలా కాశీ చరిత్రను చూసుకుంటూ పోతే సృష్టికి దేశకాలాదుల పుట్టుకకు కుడా కాశీ క్షేత్రం సాక్షి అని తెలుస్తుంది. గంగాతీరంలో ఎందరో మహారాజులు సత్పురుషులు నిర్మించిన అనేక భవనాలు, ఆశ్రమాలు, కోటలు, స్నానఘట్టాలు, మెట్లు – ‘గౌరీ సమాన’ అని ఈశ్వరుడే శ్లాఘించిన కాశీ క్షేత్రానికి వన్నె తెచ్చాయి. ఆ మెట్లమీద కూచుని, లేదా గంగలో తేలియాడే పడవలలో నుంచి కైమోడ్పులతో గంగ ఆరతిని దర్శించటం అనుభవైకవేద్యమే కానీ మాటలకందని ఆనందం.

ఆ ఆనందం అతిశయమవగా తామూ ఆ తల్లికి నీరాజనాలు అర్పించాలనే కోరికతో అనేకమంది విడవగా నీటిపై తేలుతూ కనపడే వేలాది దీపాలా అవి – మనందరినీ ఆ తల్లి మెరిసే వేలవేల కళ్ళతో మురిపెంగా చూస్తున్న కారుణ్యదృక్కులు!
ఇలా అనుక్షణం చేయి పట్టి నడిపిస్తూ మన ఊహలకు అందని అద్భుతాలే భగవదనుగ్రహానికి ఆనవాళ్ళు అని, ఆ అద్భుతాలను చూపించటానికే ఈ యాత్రను ఆ విశ్వనాథుడు చేయించాడనీ తెలుపుతూ బిందుమాధవ, కాలభైరవ, దండాపాణి దర్శనాలు కుడా జరిగాయి. అదే విధంగా ఢుండి గణపతి, కాశీ అన్నపూర్ణ, కాశీ విశాలాక్షి, తిలభండేశ్వర, కేదారనాథ, దర్శనాలు కుడానూ!
కాశీ దివ్యం భవ్యం భవభయవినాశకం.. కాశీ అంటే అందం, కాశీ అంటే ఆనందం, కాశీ ప్రతి ఒక్కరి అంతరంగం.

*కాశ్యాం హి కాశ్యతే కాశీ కాశీ సర్వప్రకాశికా ౹
సా కాశీ విదితా యేన తేన ప్రాప్తా హి కాశికా ౹౹*

సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు – అని అంటే సరిపోతుందా? కాశీలో నిజమే అంటాం, అనుకుంటాం, అనుభవిస్తాం. కాశీలో అంటే అంతా నిజమే! ఎందుకంటే – ప్రతి ఒక్కరి అనుభూతి: కాశీయే నేను నేనే కాశీ, అని. అందుకేనేమో గుర్వనుగ్రహ ప్రసాదంగా మొదలైన ఈ యాత్రలో కాశీ చేరగానే దర్శనం ఇచ్చి ఆత్మీయంగా పలకరించి మధ్యమధ్యలో కుడా కనపడి మనోహర లాస్యం సుమధుర సంభాషణం చేసిన గురుతుల్యులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు నా తిరుగు ప్రయాణానికి airport చేరాక, వారూ తిరుగు ప్రయాణంలో అక్కడే ఉండటంతో ఏకాంతంగా 20 నిమిషాల సంభాషణ చేసే అవకాశాన్ని ఇచ్చారు!

ఇలా మా ఈ అత్యద్భుతమైన కాశీ యాత్ర ప్రారంభం, ముగింపు కుడా గురుస్వరూపులైన శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి సందర్శన సంభాషణ ఆశీర్వాద అనుగ్రహంతో ఒక పరమానంద శివానుగ్రహ లీలగా జరిగింది.
శివాయ గురవే నమః

LEAVE A RESPONSE