మధ్య నిషేధమని చెప్పి… 40 వేల కోట్ల ప్రజాధనం లూటి

ఎంపీ రఘురామకృష్ణంరాజు

రాష్ట్రంలో మధ్య నిషేధం అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు 40 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తమ ప్రభుత్వం లూటీ చేస్తోందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మూడేళ్లలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ ( డి బి టీ ) విధానం ద్వారా 1.20 నుంచి 1.30 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు అందజేశామని చెబుతున్న ప్రభుత్వం, ఈ మూడున్నర ఇళ్లలో 1.35 లక్షల కోట్ల రూపాయలను మద్యం ద్వారా అర్జించిందన్నారు. మధ్య నిషేధం పేరిట ప్రజలను నమ్మించి మద్యం రూపంలోనే లక్షల కోట్ల రూపాయలను ఈ మూడున్నర ఏళ్ళ వ్యవధిలో లాగేసుకోవడం న్యాయమా అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… జనం తాగుడు మానాలని, ఇంటింటా ప్రేమలు నిండాలని ఆశిస్తున్నట్లుగా ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారని గుర్తు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిషేధం కాదు… నియంత్రణ అని పేర్కొన్నారని… అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మధ్యాభిషేకం జరుగుతుందన్నారు. ప్రేమాభిషేకం సినిమాలో కథానాయకుడైన నాగేశ్వరరావు శ్రీదేవికి ప్రేమాభిషేకం చేస్తే, రాష్ట్రంలో కథానాయకుడైన జగన్మోహన్ రెడ్డి, ప్రజలైన శ్రీదేవి పై మద్యాన్ని కురిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. గత ఏడాది ఏడు మాసాల్లో 1.87 కోట్ల కేసుల మద్యం తాగారని, మధ్య నియంత్రణ ఖచ్చితంగా అమలు అవుతున్న ప్రస్తుత తరుణంలో గడిచిన ఏడు మాసాలలో 2.36 కోట్ల కేసులు తాగారని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లక్ష్యాన్ని నిర్దేశించిన తర్వాత మరో 90 లక్షల కేసులు ఎక్కువ తాగించడం ఖాయమన్నారు. ఇది మధ్య నియంత్రణ అంటారా?, మద్యభిషేక మంటారా?? విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. మధ్య నియంత్రణలో భాగంగా సమాజానికి ఎంతో సేవ చేయాలనుకున్న సంఘసంస్కర్త జగన్మోహన్ రెడ్డి చనిపోయిన తర్వాత కూడా ప్రజల హృదయాల్లో ఉండాలని అనుకున్నారన్నారు. కానీ ఆయన చేస్తున్న చేష్టలు బతికి ఉండగానే ప్రజల హృదయాలలో నుంచి తుడిచి వేసేలా ఉన్నాయన్నారు. ఆశయం గొప్పదైతే సరిపోదని, ఆచరణలో కూడా ఉండాలన్నారు. రాష్ట్రంలో తాగుబోతుల ఆగడాలు తీవ్రంగా ఉన్నాయన్న ఆయన, ఈ సందర్భంగా సత్తెనపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో మందుబాబులు సృష్టించిన ఆగడాలకు సంబంధించిన ఒక వీడియోను మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు.

మందుబాబులు మద్యం సీసాలను రోడ్ల పక్కన, పొలాలలో పడేస్తున్నారని దీనితో వ్యవసాయ కూలీలు పగిలిన ఖాళీ సీసాలు గుచ్చుకొని గాయపడుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల క్రితం చేసిన సంకల్పయాత్రలో చెప్పింది ఏమిటని?, ప్రస్తుతం చేస్తున్నది ఏమిటని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఇదే విషయం గురించి జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే, అక్క చెల్లెమ్మలకు ఎంతో చేయాలని ఉందని, తనకు దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై ఐపీసీ 153 a సెక్షన్ కింద కేసులు నమోదు చేసి, ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని, రెండు జాతుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికిచూస్తున్నారన్న నెపముతో కేసులు నమోదు చేస్తున్నారన్నారు.

హవ్వ… సుబ్బారావు పై 153a కేసా?
సీనియర్ జర్నలిస్ట్ కాటా సుబ్బారావు, కుండబద్దల సుబ్బారావు పై ఐపీసీ 153a సెక్షన్ కింద కేసు నమోదు చేయడం పట్ల రఘురామకృష్ణం రాజు తీవ్రంగా ఆక్షేపించారు. ఏ రాజకీయ పార్టీకి చెందిన కోట సుబ్బారావు పై కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తాము నాలుగు మంచి మాటలు చెబితే తనని పోలీస్ కస్టడీలో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారని, ప్రస్తుతం కిడ్నీ బాధితుడైన కాటా సుబ్బారావు పై కేసులు నమోదు చేయడం హస్యాస్పదంగా ఉంటుందన్నారు. ఎన్నికల ముందు మనం ఇచ్చిన హామీల గురించే ప్రశ్నిస్తున్నామన్న ఆయన, రాష్ట్రంలో 175 స్థానాలను గెలుచుకుంటామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది అంతటి బలహీన ప్రభుత్వమా? అంటూ ప్రశ్నించారు. కుప్పంలో చంద్రబాబు నాయుడుని కూడా ఓడిస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రఘురామ కృష్ణంరాజు, సుబ్బారావులపై కేసులు ఎందుకు అంటూ నిలదీశారు. కొన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి డిబిటి ద్వారా ప్రజలకు అందజేస్తున్న, తాము చెప్పే నాలుగు మాటలకే ఈ ప్రభుత్వం కూలిపోతుందా అంటూ అపహాస్యం చేశారు. విశాఖపట్నం పై ఎంతో ప్రేమ ఉందని చెబుతూనే కలెక్టరేట్, తాలూకా ఆఫీసులను తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు.

సజ్జల నుంచి మొదలుకొని కొమ్మినేని వరకు…
సాక్షి దినపత్రికలో పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి మొదలుకొని కొమ్మినేని శ్రీనివాసరావు వరకు ప్రభుత్వ సలహాదారులుగా నియమించి, ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలను చెల్లిస్తున్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు. సాక్షి దినపత్రికలో పనిచేసిన వంద నుంచి 200 మంది ఉద్యోగుల వరకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలను చెల్లిస్తున్నారని తెలిపారు. అలాగే డిజిటల్ కార్పొరేషన్ లో పనిచేసేవారు, మంత్రుల వద్ద పీఏలుగా పని చేసేవారు సాక్షి దినపత్రిక ఉద్యోగులేనని అన్నారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 200 కోట్ల రూపాయల మేర జీతాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెల్లిస్తుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. సాక్షి దినపత్రిక 200 కోట్ల రూపాయలకు ఎక్కువగానే చెల్లిస్తున్నారన్న ఆయన, రాష్ట్రంలో నడుస్తున్నది సాక్షి ప్రభుత్వమేనని అన్నారు. ఈ సంవత్సరములోనైనా పనికిరాని ప్రభుత్వ సలహాదారులను తొలగిస్తే మంచిదన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాలంటీర్ల ప్రమేయం లేకుండా చర్యలు తీసుకోవాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. ఎయిడెడ్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ కాలాన్ని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ప్రస్తుతం ఎయిడెడ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదన్నారు. ఎయిర్టెల్ ఉద్యోగులు పదవీ విరమణను చేయడానికి సిద్ధంగా ఉన్నారని, వారికి అందాల్సిన బెనిఫిట్స్, పనిచేసిన కాలానికి జీతభత్యాలను చెల్లించాలని డిమాండ్ చేశారు.

నా టెలిఫోన్ ట్యాప్
తన టెలిఫోన్ ను ట్యాప్ చేశారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈ విషయాన్ని హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శికి, ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు.. తన ఫోన్ ను ట్యాప్ చేసి ఎవరు వింటున్నారు… ఎవరి ఆఫీసులో కూర్చుని వింటున్నారన్నది తనకు తెలుసునని, ఆ మాత్రం ఇంటలిజెన్స్ నివేదిక తనకు ఉన్నదన్నారు.

తెలంగాణ హైకోర్టులో శ్రీలక్ష్మికి ఊరట
తెలంగాణ హైకోర్టు ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిని నిర్దోషిగా ప్రకటించిందన్న రఘురామకృష్ణం రాజు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా కడిగిన ముత్యం లా…స్వాతిముత్యంలా నిర్దోషిగా బయటపడాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అక్రమాస్తుల కేసులో అవియోగాలు ఎదుర్కొంటున్న ఒక్కొక్కరు తెలంగాణ హైకోర్టు నుంచి నిర్దోషులుగా క్లీన్ చీట్ పొందుతున్నారన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఇతర కోర్టులను ఆశ్రయించే అవసరం లేకుండా నిర్దోషిగా బయటపడతారే మోనని అన్నారు.

Leave a Reply