1947 ఆగస్టు 14న అఖండ భారత్ మత ప్రాతిపదికన చీలిపోయింది. తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ గా దేశం వేరుపడింది. అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్రం ( నిజాం పాలిత ప్రాంతం) మద్యపాకిస్తాన్ గా ఏర్పడేందుకు అంతా సిద్ధమైంది. ఈ తరుణంలో దేశానికి నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ రాష్ట్రం నేటి సంపూర్ణ తెలంగాణ ప్రాంతం మరియు మహారాష్ట్ర (ఔరంగాబాద్, బీడ్, నాందేడ్, పర్బాని, జిల్లాలు), కర్ణాటక (బీదర్, కల్బుర్గి, రాయచూర్, యాద్గిర్, బళ్లారి, విజయనగర, కొప్పల్ జిల్లాలు) రాష్ట్రాల్లోని కొంత ప్రాంతం కలిసి నిజాం అధీనంలో ఉండేది. అయితే అప్పటికే నిజాం ప్రభువు తన ప్రాంతాన్ని పాకిస్తాన్ లో విలీనం చేయాలని, లేదా స్వతంత్ర దేశంగా ప్రకటించాలని ఐక్యత రాజ్య సమితికి లేక కూడా రాశాడు. ఈ సందర్భంలో అప్పటి హోమ్ శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో నిర్వహించి తెలంగాణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని భారత్ లో విలీనం చేసుకున్నాడు.
అయితే 15 ఆగస్టు 2022 నాటికి భారతదేశం స్వాతంత్రం పొంది 75 సంవత్సరాలు నిండిన సందర్భంలో ఆజాదీక అమృత్ మహోత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించింది. కానీ తెలంగాణ ప్రాంతానికి మాత్రం స్వాతంత్రం లభించి అప్పటికి 74 సంవత్సరాలు అయింది. ఎందుకు అంటే ఈ ప్రాంతాన్ని తనకబంద హస్తాల చేతిలో ఉంచుకొని స్వతంత్ర దేశంగా ప్రకటించాలని లేదా పాకిస్తాన్ లో విలీనం చేయాలని నిర్ణయించుకున్న నిజాం రాజు నిర్ణయం కారణంగా 13 నెల రెండు రోజుల ఆలస్యం గా తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది. దీంతో 2023 సెప్టెంబర్ 17 తో తెలంగాణకు స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా ఏడాది పాటు నిజాం పాలిత తెలంగాణ ప్రాంతం మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలు నేటితో 75 ఏళ్ల స్వాతంత్ర వేడుకలు నిర్వహించుకోవడం శుభ పరిణామం.
తెలంగాణ విమోచన దినం నిర్వహిస్తే ఎక్కడ తమ ఓట్లు పోతాయనే భయం వీడి.. నేడు విమోచన దినం నిర్వహించకపోతే తాము ఎక్కడ వెనుకబడిపోతామోనన్న ఆలోచనలో పడ్డారు రాజకీయ నేతలు. అన్ని పార్టీలు పోటీపడి విమోచన దినోత్సవాన్ని( తెలంగాణ స్వాతంత్ర దినోత్సవ) నిర్వహించుకోవడం విశేషం.
ఏది ఏమైనా, ఇందులో రాజకీయ లబ్ధి దాగి ఉన్నా కూడా సెప్టెంబర్ 17న విమోచన.. విలీనం.. విముక్తి.. ఇలా అనేక బావ సారూప్య పదాలు ఎన్ని ఉన్నా మొత్తానికి తెలంగాణ స్వాతంత్ర దినం మాత్రం 17 సెప్టెంబర్ అనేది సత్యం. ఈ సత్యాన్ని అంగీకరించేందుకు 75 సంవత్సరాలు పట్టడం ఒకింత బాధ కలిగినా.. వజ్రోత్సవాల సందర్భంగా అన్ని పార్టీలు గుర్తించడం సంతోషకరం. ఈ విషయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వ్యతిరేకించే ఎంఐఎం పార్టీ ఒక అడుగు ముందుకు వేసి “నేషనల్ ఇంటిగ్రిటీ డే” గా సంబరాలు నిర్వహించుకోవాలని దారుసలంలో తీర్మానాలు చేయడం విశేషం. స్వయంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం.. వెనువెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అంగీకరించడం జరిగిపోయింది. కాంగ్రెస్ కూడా విషయంలో తన స్పష్టమైన వైఖరిని తెలియజేసింది. హైదరాబాద్ స్వాతంత్ర దినోత్సవం పేరుతో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది.
“నైజాం విముక్తా అమృత మహోత్సవ్” పేరుతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ నరసింహారెడ్డి అధ్యక్షుడిగా ఏడాది పాటు తెలంగాణ చరిత్రను ప్రతి పౌరుడికి తెలియజేసేందుకు కార్యక్రమాల రూపొందించారు. భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే దాదాపు మూడు దశాబ్దాలుగా తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని ఆయా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి ఉద్యమించిన విషయం మనందరికీ తెలిసిందే.
ఈ సారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి సారధ్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం.. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే ఈ కార్యక్రమానికి భారత హోం మంత్రి శ్రీ అమిత్ షా గారితోపాటు నిజాం పాలిత ప్రాంతాలైన తెలంగాణ (కల్వకుంట్ల చంద్రశేఖర రావు), మహారాష్ట్ర (ఏక్ నాథ్ షిండే), కర్ణాటక (బసవరాజ బొమ్మై)ముఖ్యమంత్రులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం శుభ పరిణామం.
అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయత సమైక్యత దినోత్సవం గా నామకరణం చేసి అధికారికంగా మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు.. విద్యాసంస్థల్లో జాతీయ జెండాలను ఎగురవేయాలని పిలుపునివ్వడం సంతోషకరం.
ఎంఐఎం కూడా తమ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు నాయకులతో కలిసి హైదరాబాదులో భారీ తిరంగా ర్యాలీ నిర్వహిస్తామని చెప్పడం విశేషం. ఈ పరిణామాలు అన్నింటిని కూడా స్వాగతించాల్సిందే.
ఇన్నాళ్లు తెలంగాణ స్వతంత్ర దినోత్సవం విషయంలో ఒకరు ఎడ్డం అంటే.. మరొకరు తెడ్డం అనే స్థితి నుంచి నేడు అందరూ ఒకే తాటిపైకి రావడం సంతోషకరం. ఈ ఐక్యత సాధించడానికి 75 సంవత్సరాల కాలం పట్టింది.
నాటి ఘటనలు గుర్తు చేసుకుంటే ఓ వర్గం చిన్న బుచ్చుకుంటుందని, వారి ఓట్లు దూరమవుతాయని కొన్ని పార్టీలు తెలంగాణ స్వాతంత్ర దినాన్ని అధికారికంగా నిర్వహించలేకపోయాయి. అటు లెఫ్ట్ ఇటు రైట్ భావజాలం గల పార్టీలు తెలంగాణ ఆజాదీక అమృత్ మహోత్సవంలో తమ తమ కార్యాచరణతో ముందుకు సాగుతూ ఉండటం ఆహ్వానించ దగ్గ పరిణామం. రాజ్ భవన్ తో పాటు ప్రగతి భవన్ దాకా తెలంగాణ స్వాతంత్ర పండుగను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో ఏడాది పాటు తెలంగాణ ఆజాదీక అమృత్ మహోత్సవ భాగంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు యుజిసి ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ స్వాతంత్ర సంబరాలు నిర్వహించేందుకు యుజిసి కార్యదర్శి ప్రొఫెసర్ రజనీష్ జైన్ అన్ని వర్సిటీల వైస్ ఛాన్స్లర్లు, కాలేజీల ప్రిన్సిపాల్ లకు లేఖలు రాయడం.. అన్ని విద్యాలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్, పాటలు, ఆటలు, వివిధ పోటీలు నిర్వహించి విద్యార్థిలోకానికి తెలంగాణ చరిత్రను వాస్తవాన్ని తెలియజేసే కార్యక్రమాలు రూపొందించడం గొప్ప పరిణామం.
ముఖ్యంగా “రజాకారులు అందరూ పాకిస్తాన్ కు వెళ్లిపోయారని, దేశద్రోహులంతా దేశం విడిచిపోయారని.. దేశభక్తి గల వారు మాత్రమే భారత్ లో మిగిలారు” అని ఎంఐ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడడం ఈ వేడుకలకు మరింత బలాన్ని చేకూర్చాయి.” సెప్టెంబర్ 17ను ఖచ్చితంగా గౌరవిస్తాం.. జాతీయ సమైక్యత దినం రోజు ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో అధికారికంగా పాల్గొంటాం” అంటూ ఆయన పిలుపునివ్వడం సంతోషకరం.
విముక్తి.. విమోచన.. విలీనం ఇలా ఆయా సిద్ధాంత సారూప్యంగాల పార్టీలు తెలంగాణ విమోచనాన్ని తమకు తోచిన విధంగా పిలిచాయి. ఎవరు ఏ పేరుతో పిలిచినా.. అంతిమంగా సెప్టెంబర్ 17 అనేది తెలంగాణ స్వాతంత్ర దినం. ఏ పేరు పలికినా భావం మాత్రం స్వాతంత్రం అని చెప్పడం మాత్రం గర్వకారణం. ఏడాది పాటు తెలంగాణ స్వాతంత్రం కోసం పోరాడిన అమరులను స్మరించుకుందాం.. వారి ఆశయ సాధనకు కృషి చేద్దాం.