– దాని విలువ ఎన్ని కోట్లో తెలుసా?
– రైతు తలరాతను మార్చిన తొలకరి
శ్రీకృష్ణదేవరాయుల కాలంలో వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారు. మరి.. రాయలు ఏలిన రతనాల సీమలో ఇంకా వజ్రాలు దాగున్నాయా? యస్.. ఉన్నాయంటున్నారు అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలు. రెండు జిల్లాల సరిహద్దుల్లో విలువైన వజ్రాలు దాగున్నాయని చెబుతున్నారు. వర్షం వస్తే ఇక్కడి నేలలపై పంటలు పండుతాయో లేదోగానీ.. వజ్రాలు మాత్రం పండుతాయని నమ్మకం. అందుకే వాన పడినప్పుడల్లా ఇక్కడి ప్రజలు వజ్రాన్వేషణలో ఉంటారు. తాజాగా కురిసిన భారీ వర్షంతో కర్నూలు జిల్లాలో వజ్రాల వేట ఊపందుకుంది.
తొలకరి వాన వచ్చేసింది.. ప్రాణదాతగా దూసుకువచ్చింది. నింగి నుంచి నేల దాకా ఇక ఆనందాల ఏరువాకే..! సాధారణంగా తొలకరి వర్షాలు పడితే ఏం చేస్తారు.. వ్యవసాయం చేసుకోవడానికి పొలం దున్ని.. విత్తనాలు వేయడానికి రైతన్నలు రెడీ అవుతారు.. కానీ.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షం పడితే చాలు.. అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతారు. చిన్నా పెద్దా తేడా లేకుండా.. అందరూ పొలాల బాట పడతారు. అయితే.. వ్యవసాయం చేయడానికి మాత్రం కాదు.. కోటీశ్వరులయ్యేందుకు.. ఆ సీమ నేలలో అన్వేషణ కొనసాగిస్తారు. తొలకరి జల్లులు… ఆ అదృష్టపు మొలకలు ఓ అదృష్టవంతుడిని జీవన రేఖను మార్చేసింది.
రాయలసీమ నేలల్లో వజ్రాల గనులు ఉన్నాయన్నది ఎప్పటి నుంచో ప్రచారం. మద్దికెర ప్రాంతంలో వజ్రాల వేట తరచూ మనం వినేదే. ఆ నేలల్లో వజ్రాల వేట కోసం వేరేవేరే జిల్లాల నుంచి జనం వస్తుంటారు. విలువైన రాయిలా అనిపిస్తే చాలా పరుగున వజ్రాల వ్యాపారుల దగ్గరకు వెళ్తారు. కొనేందుకు అక్కడ వ్యాపారుల మధ్య కూడా పోటీ ఉంటుంది. అలాంటి మద్దెకర మండలంలోని బసినేపల్లిలో ఓ రైతుకు వజ్రం కళ్లబడింది. ఆ వజ్రాన్ని అక్కడే అమ్మకానికి పెట్టాడు. అక్కడే వేచి చూస్తున్న వ్యాపారికి అమ్మకానికి పెడితే.. దాన్ని రూ. 2కోట్లు పలికినట్లుగా ప్రచారం సాగుతోంది. ఆ నోట.. ఈ నోట పాకడం.. ఇప్పుడు జనమంతా పొలాల్లో వెదుకులాట ప్రారంభించారు.
వర్షాలు పడ్డప్పడు వెదికితే వజ్రాలు దొరుకుతాయని.. స్థానికులు ఏటా ఈ సమయంలో వెదుకులాడుతుంటారు. తమకు కూడా వజ్రం దొరకకపోతుందా.. తాము శ్రీమంతులం కాకపోతామా అని వెదుగుతున్నామని చెప్తున్నారు స్థానికులు.