జగన్ రెడ్డి పాలనకు నాలుగున్నరేళ్లు అవుతోంది. నాలుగురున్నరేళ్ల కింద రాష్ట్రం ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉంది..? ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. నలభై ఏళ్లు వెనుకబడిపోయామని అర్థమవుతుంది. సామాజికంగా, ఆర్థికంగా ప్రజలు ఎంత నష్టపోయారో ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతుంది.
కానీ రాష్ట్రానికి జరిగిన నష్టం మాత్రం కళ్లముందే కనిపిస్తోంది. విధ్వంసం అయిన ప్రజల కలలు.. చిదిమేసిన స్వప్నాలు గుండెలు మండిపోయేలా చేస్తున్నాయి. అన్నీ అంతే.. కానీ ఏపీని ప్రతిష్టాత్మకంగా నిలబెట్టే రెండు ప్రాజెక్టుల పరిస్థితి చూస్తే కడుపుకు అన్నం తినబద్ది కాదు. అలాంటి పాలకుడి కింద బతుకుతున్నందుకు విరక్తి పుడుతోంది.
పోలవరం .. జీవనాడి .. రివర్స్ పేరుతో నాశనం చేసేశారు
పోలవరం ప్రాజెక్ట్ అనేది దశాబ్దాల కల. ఇంకా చెప్పాలంటే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ప్రయత్నాలు చేస్తున్న ప్రాజెక్టు. రాష్ట్ర విభజనలో .. హైదరాబాద్ ను వదిలిస్తే.. నికరంగా వచ్చిన లబ్ది ఇదొక్కటే. చకచకా కట్టేసుకుని అదైనా రాష్ట్రానికి ఆస్తిలా చేసుకోవాల్సింది. ఐదేళ్లలో ఒక ప్రభుత్వం శక్తికి మించి పని చేసింది. కానీ జగన్ రెడ్డి వచ్చి ఏం చేశారు..?
ఉన్న దాన్ని రివర్స్ చేశారు. డబ్బే లక్ష్యంగా కాంట్రాక్టర్లను మార్చి వారు పనులు చేయలేక.. చేసిన పనులు దెబ్బతినే పరిస్థితికి తెచ్చారు. ఇదిగో ఏడాదిలో కట్టేస్తాం.. అదిగో కట్టేస్తామని చిటికెలు వేసిన పాలకులు ఇప్పుడు.. కట్టలేం.. ఏం చేసుకుంటారో చేసుకోండి అనే స్థితికి వచ్చారు. ఇలా చేయడం వల్ల వారిదేం పోయింది..? వారి కమిషన్లు వారికి వచ్చాయి.. నష్టం ఎవరికి..?
అమరావతిని చంపేసి ఏం సాధించారు?
అమరావతి రాష్ట్ర రాజధాని. అది అభివృద్ధి చెందితే ఓ కులం అభివృద్ధి కాదు. ఓ వర్గం అభివృద్ధి కాదు. అది రాష్ట్ర సంపద. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అభివృద్ధి చెందితే ఒక్క కులం అభివృద్ధి చెందిందా..? అన్ని రాష్ట్రాలూ ఆ నగరాల ఆధారంగా ప్రజలకు మేలు చేస్తున్నాయి.
కానీ మన కంట్లో మన వేలు పెట్టేపాలకుడిని నమ్మి ప్రజలు నిండా మోసపోయారు. పది లక్షల కోట్ల ఆస్తిని నాశనం చేశామని.. వైసీపీ పాలకులు వికటట్టాహాసంగా చెబుతున్నరంటే.. ఏమనుకోవాలి. ఆ ఆస్తి ఎవరిది ? ప్రజలది కాదా..? నష్టం జరిగింది ప్రజలకే కాదా..? విశాఖ రాజధానిపేరుతో వైసీపీ నేతలు చేయాల్సిన దోపిడీ అంతా చేసుకుని బాగుపడ్డారు.
నష్టపోయింది ప్రజలు, రాష్ట్రం!
తమకు పదివేలిచ్చారు.. ఏం నష్టం జరిగిందని కొంత మంది అనుకుంటూ ఉంటారు. వారి ఆలోచన స్థాయిల్ని అక్కడ ఉంచడం ద్వారానే ప్రభుత్వం, వైసీపీ ఇక్కడ చేస్తోంది. ఆ పది వేలకు ఇరవై వేలు వసూలు చేశారనే సంగతి ఏ ఒక్క వ్యక్తికి తెలియడం లేదు. కానీ.. ఎవరి మీదనో ద్వేషం నింపి.. వారిని నాశనం చేయడమే మీకు చేస్తున్న మేలు అనే సైకోతత్వాన్ని పెంచి.. పాలకులు పబ్పం గడుపుకుంటున్నారు. కానీ ఇప్పుడు దాన్నిబద్దలు కొట్టే సమయం వచ్చింది.
– చైతన్య