– రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి
సాగునీటి రంగంలో రాయలసీమ పట్ల పాలకుల వివక్ష పై అవగాహన, వివక్షను రూపుమాపడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై రాయలసీమ ప్రజలకు బహిరంగ లేఖ వ్రాసిన రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి. లేఖ పూర్తిగా ….
రాయలసీమ ప్రజలకు బహిరంగ లేఖ
జులై 16, 2023
రాయలసీమ ప్రజలారా,
విషయం: రాయలసీమ సాగునీటి అంశాల పట్ల పాలకుల వివక్షపై అవగాహన, వివక్షను రూపుమాపడానికి చేపట్టాల్సిన కార్యక్రమం గురించి.
సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల అవసరాలను తీర్చడంలో పాలకులు యదావిధిగా ప్రత్యేక శ్రద్ద కనపరస్తునే ఉంటారు. అందుకు ప్రస్తుత ఉదాహరణే మృగశిర కార్తి వచ్చీ రాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి జూన్ 7, 2023 కృష్ణా డెల్టాకు నీళ్ళు విడుదల చేయడం.
అదే సందర్భంలో సామాజికంగా, అర్థికంగా వెనుకబడిన రాయలసీమలో వర్షాధారిత పంటలు వేసుకోండి, కృష్ణా, తుంగభద్ర జలాలపై ఆశలు పెట్టుకోవద్దని నిన్నటి రోజున అధికారులు ప్రకటించడంలో, ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. సాగునీటి పరిస్తితిలను బట్టి రాయలసీమ ఈ వివక్షను కొంచెం అటు ఇటుగా ప్రతినిత్యం అనుభవిస్తూనే ఉంది.
కృష్ణా డెల్టా ప్రాంతంలో నీటి విడుదల, నీటి నిలుపుదల తేదీలను ప్రకటించి అక్కడి రైతాంగానికి సాగునీటి లభ్యతపై ప్రతి సంవత్సరం భద్రత కలిగిస్తారు. నదిలో నీరు ఉంటే మీకు నీరిస్తాం అని ప్రకటించి ఏరోజు వరకు, ఏ పంటకు నీళ్ళిస్తారో తెలపకుండా రాయలసీమ రైతాంగానికి మానసిక ఆందోళనకు గురిచేయడం ప్రతి సంవత్సరం పరిపాటే.
ఈ సంవత్సరం శ్రీశైలం రిజర్వాయర్ కు 2017 tmc ల నీరు వచ్చినప్పటికీ రిజర్వాయర్ అంతా ఖాళీ చేసి రాయలసీమకు త్రాగడానికి నీరు అందకుండా చేసిన పాలకులు, కృష్ణా డెల్టా నారుమళ్ల కోసం పులిచింతల రిజర్వాయర్లో 34 టి ఎం సీ లు నీరు ఉంచామని జూన్ 7, 2023 న ప్రకటించిన రోజైనా రాయలసీమ ప్రజాప్రతినిధులలో చలనం రాకపోవడాన్ని రాయలసీమ సమాజం గమనించాలి.
కృష్ణా, తుంగభద్ర నదులలో వరద ప్రవాహం మొదలు కాకున్నా, గతంలో శ్రీశైలం రిజర్వాయర్ కు వచ్చిన నీటిని వచ్చినట్లుగా కృష్ణా డెల్టాకు తరలించినట్లుగానే ఈ సంవత్సరం కూడా తీసుకొని పోవచ్చునన్న ధీమాతో కృష్ణా డెల్టాకు నీటి విడుదలను సాగునీటి శాఖ మంత్రి గావించారు.
ఆ ధీమాకు కారణం రాయలసీమ ప్రజాప్రతినిధులకు నిర్వాకమే అని మరల మరల చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులు స్పందించడం లేదంటే వారికి తమ ప్రాంత సాగునీటి సమస్యలు పట్ల ఆసక్తి ఏమైనా ఉందా లేదా అని రాయలసీమ ప్రజలు తమను తామే ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
కృష్ణా డెల్టా అవసరాలను తీర్చడానికి ప్రకాశం బ్యారేజి, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు కాకుండా నాలుగవ స్థిరీకరణ ప్రాజెక్టుగా పులిచింతల రిజర్వాయర్, ఐదవ స్థిరీకరణ ప్రాజెక్టు గా పట్టిసీమ, ఆరవ స్థిరీకరణ ప్రాజెక్టుగా పోలవరం సాధించుకున్నారు అక్కడి ప్రజా ప్రతినిధులు. కాని రాయలసీమ ప్రాజెక్టుల స్థిరీకరణకు గుండ్రేవుల రిజర్వాయర్, సిద్దేశ్వరం అలుగు, తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ, వేదవతి ఎత్తిపోతల పథకాలు కోసం గొంతెత్తకపోగా, శ్రీశైలం రిజర్వాయర్ ను ఖాళీ చేస్తున్నా మౌనంగా ఉన్నారు మన ప్రజాప్రతినిధులు.
రాయలసీమ ప్రజలారా, ఇకనైనా మేల్కొనండి. రాయలసీమను రక్షించుకోవడం మీ చేతులలోనే ఉందన్న విషయాన్ని గ్రహించండి. రాయలసీమ ప్రజా ప్రతినిధులు శ్రీశైలం రిజర్వాయర్ లో 854 అడుగులకు నీరు చేరేంత వరకు దిగువకు నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయకుండా పాలకులపై ఒత్తిడి పెంచడానికి, రాయలసీమ సాగునీటి నిర్మాణాలపై పాలకులపై ఒత్తిడి తేవడానికి గళం విప్పండి.
ధన్యవాదములతో
బొజ్జా దశరథ రామిరెడ్డి