Suryaa.co.in

Devotional

అధికమాసం – శూన్యమాసం – అయోమయం!

అధికమాసంలో నిర్ణయాలు, ప్రకటనలు ధర్మబద్ధం!

అధికమాసానికి తనదైన విశిష్టత ఉంది. ఇది శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేకమైన నెల. అందుకే దీనికి ‘పురుషోత్తమ మాసం’ అనే పేరును ఆయన ప్రసాదించాడనీ, ఈ మాసంలో చేపట్టే దైవకార్యాలకు అధికమైన ఫలాలు లభిస్తాయని వరమిచ్చాడనీ పురాణాలు చెబుతున్నాయి. అధికమాస మహిమ గురించి మహా విష్ణువును లక్ష్మీదేవి అడిగినప్పుడు.

“పురుషోత్తమ మాసంలో ఎవరైతే పుణ్య నదీస్నానాలు, జప, హోమాలు, దాన ధర్మాలు ఆచరిస్తారో వారికి సాధారణ మాసాల కన్నా అనేక రెట్ల ఫలితాలు లభిస్తాయి. అధికమాసంలో శుక్లపక్షంలో కానీ, కృష్ణపక్షంలో కానీ అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, అలాగే పౌర్ణమి రోజునైనా కనీసం పుణ్యకార్యాలు చేయాలి. దానివల్ల వారికి అపారమైన పుణ్యఫలం లభిస్తుంది.” అని శ్రీ మహావిష్ణువు చెప్పినట్టు పౌరాణిక కథ ఒకటి ఉంది.

పురుషోత్తమ మాసంగా వ్యవహరింపబడే అధికమాసం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడిన నెల! అందుకే, ఈ మాసంలో వివాహాది శుభకార్యాలు చేయరు! కానీ, ఇతర సత్కార్యాలు, వ్యవహారిక సంకల్పాలు, నిర్ణయాలు, ప్రకటనలు, పండగలు నిరభ్యంతరంగా నిర్వర్తించవచ్చు!

ప్రతి 32.5 నెలల్లో చాంద్రమాన సంవత్సరం, సౌరమాన సంవత్సరం కంటే 30 రోజుల పాటు వెనకబడుతుంది. ఈ 30 రోజులను సవరించి చాంద్రమాన సంవత్సరాన్ని సౌర సంవత్సరంతో సమానం చేసేందుకు ఆ సంవత్సరంలో ఒక నెలను అధికంగా కలుపుతారు. ఈ నెలనే అధికమాసం అంటారు. అంటే అధికమాసం సుమారుగా ప్రతి 32 నెలలకు ఒకసారి వస్తుంది.

శూన్యమాసంలో శుభకార్యాల నిర్వహణ నిషిద్దం!
ఇక, సూర్యమానం ప్రకారం, చాంద్రమానం ప్రకారం కలిసి ఉండే కొన్ని మాసాలను శూన్య మాసాలంటారు. సూర్యమానం ప్రకారం ధనుర్మాసం – చాంద్రమానం ప్రకారం పుష్యమాసం కలిసి ఉన్న కొన్ని రోజులను శూన్యమాసం అంటారు.

శని జన్మనక్షత్రం పుష్యమి కావడంతో ఈ పుష్యమాసంలో ఏ శుభకార్యం చేసినా సత్ఫలితాన్నివ్వదని నమ్మకం. అందుకే, ఈ మాసంలో వివాహాది శుభకార్యాలు, ఇతర సత్కార్యాలు, వ్యవహారిక సంకల్పాలు, నిర్ణయాలు, ప్రకటనలు చేయరు. కానీ, పండగలను మాత్రం యధావిధిగా నిర్వహిస్తారు.

– శ్రీచరణ్‌శర్మ

LEAVE A RESPONSE