– హటాత్తుగా తెరపైకి శిద్దా రాఘవరావు పేరు
– ఇప్పటిదాకా రేసులో ఎమ్మెల్సీ జంగా, మాజీ ఎంపి మేకపాటి
– వచ్చే ఎన్నికల్లో మేకపాటి కుటుంబానికి రెండు సీట్లు
– దానితో నిలిచిపోయిన మేకపాటి పేరు ప్రతిపాదన
– కొత్తగా రేసులో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు
– ఇటీవలే సీఎం జగన్ తో శిద్దా భేటీ
– క్యాబినెట్‌లో వైశ్యుడిని తొలగించడంతో అసంతృప్తి
– తాజాగా వైశ్యుల ఓట్లపై వైసీపీ గాలం?
– శిద్దాకు టీటీడీ చైర్మన్ ఇవ్వడం ద్వారా వైశ్యులను సంతృప్తి పరిచే వ్యూహం
– ఇంకా రేసులోనే యాదవ నేత జంగా కృష్ణమూర్తి పేరు
– శిద్దా రాఘవరావుకే టీటీడీ చైర్మన్ దక్కే చాన్స్
( మార్తి సుబ్రహ్మణ్యం)
ప్రతిష్ఠాత్మక టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందన్న అంశం వైసీపీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పదవీకాలం ముగిసిపోయింది. నింబధనల ప్రకారం ఆగస్టు పది వరకూ ప్రస్తుత టీటీడీ పాలకవర్గ పదవీకాలం ఉంది.
ప్రస్తుత చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని ఇప్పటికి రెండుసార్లు ఆ పదవిలో కొనసాగించారు. ఆయనకు- టీటీడీ జెఈఓ ధర్మారెడ్డికి పెద్దగా పొసగడం లేదన్న ప్రచారం జరిగింది. పైగా అన్ని పదవుల్లో రెడ్లను నియమిస్తున్నారన్న ప్రచారం కూడా, ఇతర సామాజికవర్గాలను పార్టీకి దూరం చేసే ప్రమాదం ఏర్పడింది.
గతంలో కమ్మవర్గంపై బురద వేసిన వైసీపీ.. ఇప్పుడు పదింతలు అంతకుమించిన రెడ్డి కులతత్వంతో, నిర్ణయాలు తీసుకుంటోందన్న విపక్షాల విమర్శలు వైసీపీని ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటిదాకా జగన్ ఎంతమంది రెడ్లకు పదవులిచ్చారన్న జాబితాను, టీడీపీ-జనసేన సోషల్‌మీడియా సైనికులు ప్రచారంలోకి పెట్టారు. ఇది రాజకీయంగా వైసీపీకి ఇరకాటంగా మారింది.
పైగా కీలకమైన ఎన్నికల సమయంలో సుబ్బారెడ్డి, ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్తగా ఎక్కువ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. ఈ నేపధ్యంలో ఇక మరోసారి ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి కొనసాగించే అవకాశం లేదని, స్వయంగా జగన్ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దానితోపాటు ఇక టీటీడీ చైర్మన్ పదవిని రెడ్లకు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు సీనియర్లు వెల్లడించారు.
నిజానికి సుబ్బారెడ్డి చాలకాలం నుంచి రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. తాజాగా ఒంగోలు ఎంపీ సీటును తనకు గానీ, తన కొడుకుకు గానీ ఇవ్వాలని సుబ్బారెడ్టి సీఎం జగన్‌పై ఒత్తిడి చేస్తున్నారు. అయితే సుబ్బారెడ్డి కుటుంబానికి ఎంపీ సీటు ఇచ్చే పక్షంలో, ఆయన బావమరిది -మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీలో కొనసాగడం అనుమానమేనంటున్నారు.
బాలినేని చాలాకాలం నుంచి సిట్టింగ్ ఎంపి మాగుంటకు, మళ్లీ టికెట్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు. ఈ అంశంపై ఇటీవల ఎంపి విజయసాయిరెడ్డి మాజీ మంత్రి బాలినేనితో చర్చించినట్లు సమాచారం. ఆ వివాదం ఇంకా కొనసాగుతోంది.
ఈ క్రమంలో ప్రకాశం జిల్లా వైశ్య వర్గానికి చెందిన మాజీ మంత్రి శిద్దారాఘవరావు పేరు, టీటీడీ చైర్మన్ రేసులో హటాత్తుగా తెరపైకివచ్చింది. గత వారం నుంచి ఆయన పేరు సోషల్‌మీడాయలో మార్మోగిపోతోంది. వైవి సుబ్బారెడ్డి స్వయంగా, శిద్దా పేరు సీఎం వద్ద ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. గత మంత్రివర్గ విస్తరణ లో వైశ్యుల నుంచి, మంత్రివర్గంలో ఎవరికీ ప్రాతినిధ్యం లభించలేదు. ఉన్న ఒక్కడిని కూడా తొలగించారు. దానితో వైశ్యులు వైసీపీపై అసంతృప్తిగా ఉన్నారు.
అదీగాక రాష్ట్రంలో వైసీపీ వచ్చిన తర్వాత.. వ్యాపారులకు భద్రత లేకుండా పోయిందని, రాయలసీమ, ప్రకాశం, గుంటూరు జిల్లా గురజాల వంటి చోట్ల వైశ్యుల ఆస్తులను వైసీపీ నేతలు, కబ్జాలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గురజాల నియోజకవర్గంలో ఈ బెడద ఎక్కువగా ఉందని, పలువురు వైశ్య ప్రముఖులు తమ రాష్ట్ర నేతలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో వీటికి చెక్ చెప్పే వ్యూహంలో భాగంగా.. వైశ్య వర్గానికే చెందిన శిద్దాకు టీటీడీ చైర్మన్ ఇవ్వడం ద్వారా, వైశ్యవర్గాన్ని సంతృప్తి పరచవచ్చని వైసీపీ నాయకత్వం యోచిస్తోందంటున్నారు.
శిద్దా వివాద రహితుడు-అన్ని వర్గాలతో కలసి ఉండే నేత అయినందున, ప్రకాశం జిల్లా వైసీపీలోని అన్ని వర్గాలూ ఆయనకు మద్దతునిచ్చే అవకాశాలున్నాయి. కాగా ఇప్పటికే శిద్దా, గత వారంలో సీఎం జగన్‌ను కలిసినట్లు తెలుస్తోంది.
నిజానికి టీటీడీ చైర్మన్ రేసులో.. మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేరు, ఇటీవలి కాలం వరకూ ప్రముఖంగా వినిపించింది. చాలకాలం క్రితం ఆయనే తన కోరికను జగన్ దగ్గర వెల్లడించినట్లు చెబుతున్నారు.
అయితే వచ్చే ఎన్నికల్లో మేకపాటి కుటుంబం నుంచి.. ఇద్దరికి అసెంబ్లీ సీట్లు ఇస్తున్నందున, మళ్లీ మేకపాటికి చైర్మన్ పదవి ఇవ్వడం సమంజసం కాదన్న భావనతో, పరిశీలనలో ఆయన పేరు పక్కనపెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాతనే శిద్దా రాఘవరావు పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక గురజాలకు చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేరు కూడా, ఇంకా పరిశీలనలోనే ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యాదవ వర్గానికి చెందిన జంగా, ప్రస్తుతం పార్టీ బీసీ సెల్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. జంగాకు చైర్మన్ ఇవ్వడం ద్వారా, రాష్ట్రంలో బీసీలలో అధిక జనాభా ఉన్న యాదవులను ఆకర్షించవచ్చన్న ఎత్తుగడతోనే, ఇన్నాళ్లూ ఆయన పేరు పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే వ్యాపారవర్గమైన వైశ్యులను దూరం చేసుకుంటే, పార్టీకి అన్ని విధాలా నష్టమన్న భావన కూడా వైసీపీ నాయకత్వంలో లేకపోలేదంటున్నారు. తాజా రాజకీయ పరిస్థితిలో వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, కాపు.. చివరకు సొంత సామాజికవర్గమైన రెడ్లు కూడా పార్టీకి దూరమవుతున్నారు. మొత్తంగా అగ్రకులాలేవీ వైసీపీ వైపు చూసే పరిస్థితి కనిపించడం లేదు.
ఈ క్రమంలో విధేయుడిగా ఉండే, వైశ్య నేత శిద్దాకు టీటీడీ చైర్మన్ ఇవ్వడం ద్వారా.. కనీసం అగ్రకులాలను అసంతృప్తిని, దూరం చేయవచ్చన్న వ్యూహం కూడా, నాయకత్వంలో లేకపోలేదని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో టీటీడీ చైర్మన్ ఎంపికపై అధికారిక ప్రక టన వెలువడే అవకాశం ఉంది.