అమరావతిని చంక నాకించి… పోలవరాన్ని భ్రష్ఠు పట్టిస్తే ప్రజలు మన పార్టీకి ఓట్లు ఎలా వేస్తారు?
-రానున్న ఎన్నికల్లో 135 స్థానాలు గ్యారెంటీనే … కానీ అవి మా పార్టీకి కాదు ప్రతిపక్షానికి!
-కమిషన్ల కోసం కక్కుర్తి పడి రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం వల్లే పోలవరం ప్రగతి సర్వనాశనం
-గత ప్రభుత్వ హయాంలో రికార్డు టైంలో 72 శాతం పనులు పూర్తి… దానికి నేనే ప్రత్యక్ష సాక్షి
-2025 ఖరీఫ్ నాటికి పోలవరం నీళ్లు ఇస్తామన్న జమోరె … ఇప్పుడు పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదని కొత్తరాగం
-వైయస్ వివేకా హత్య కేసులో కచ్చితంగా జగన్, భారతీలను సిబిఐ పిలిచే ఉంటుంది… కానీ వారు వెళ్లి ఉండరు
-రాష్ట్ర ప్రభుత్వానికి గడ్డి పెట్టిన చిరంజీవి
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
అమరావతిని చంక నాకించి, పోలవరాన్ని భ్రష్ఠు పట్టించిన మన పార్టీకి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. దొంగ సర్వేలదేముంది?, డబ్బులు ఇస్తే ఎవరైనా సర్వేలను మనకు అనుకూలంగా చేసి ఇస్తారు. అలాగే కర్ణాటకలో ఇటీవల ఎవరో సర్వే చేశారట… మా పార్టీకి రానున్న ఎన్నికల్లో 120 నుంచి 130 స్థానాలు వస్తాయని చెప్పారట. ఆ విషయాన్ని మా పార్టీ పెద్దలు పత్రికల్లో రాయించుకున్నారు. నేను కూడా అదే చెబుతున్నాను. సీట్ల సంఖ్య వాస్తవమే.. రానున్న ఎన్నికల్లో మా పార్టీకి కాదు… ప్రతిపక్ష పార్టీలకు 135 స్థానాలు రావడం గ్యారెంటీ అని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.
మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… పోలవరం స్పిల్ వే కట్టకుండా డయాఫ్రం వాల్ నిర్మించారని జగన్మోహన్ రెడ్డి పేర్కొంటుంటే… డయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టారని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నారన్నారు . ఈ ప్రశ్న అడగడానికి అంబటి రాంబాబుకు బుద్ధి ఉందా..?
అని రఘు రామకృష్ణంరాజు నిలదీశారు. ఈ ప్రశ్న అంబటి రాంబాబు, జమోరె ని అడగాలని సూచించారు. 2021 ఖరీఫ్ నాటికి పోలవరాన్ని పూర్తిచేసి నీళ్లు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ఎలా ప్రకటించాడని ప్రశ్నించిన ఆయన, ఆ తర్వాత తూచ్ అని 2022 ఖరీఫ్ సీజన్ నాటికి నీళ్లు ఇస్తామని చెప్పాడని గుర్తు చేశారు. పోలవరాన్ని పూర్తి చేస్తామని అసెంబ్లీలో తోడ కొట్టిన మంత్రి ఏమయ్యారంటూ రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. 2022 కాదు, 2023 నాటికి పూర్తి చేస్తామన్న జగన్మోహన్ రెడ్డికి ముందు స్పిల్ వే కట్టాలని తెలియదా? అంటూ ప్రశ్నించారు.
డయాఫ్రమ్ వాల్ నిర్మించడం తప్పేమీ కాదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన డిజైన్ల మేరకే గత ప్రభుత్వం, పోలవరం పనులను చేపట్టింది. పోలవరం గురించి మీకేమీ తెలుసు… ఏమీ తెలియదు. మీకు తెలిసిందల్లా కన్నాలు వేయడం తప్ప మరొకటి లేదు అంటూ రఘు రామకృష్ణంరాజు ఫైర్ అయ్యారు. నాలుగేళ్ల తర్వాత పోలవరం నిర్మాణంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశారు. పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు అసహ్యించుకోరా? అంటూ నిలదీశారు .
క్విట్ ఇండియా స్ఫూర్తితో క్విట్ ఆంధ్ర ఉద్యమం చేపట్టాలి
ఆంగ్లేయులను దేశం విడిచి వెళ్ళమని చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో… ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వారిని తరిమి కొట్టడానికి క్విట్ ఆంధ్ర ఉద్యమాన్ని చేపట్టాలని రఘురామ కృష్ణంరాజు రాష్ట్ర ప్రజలను కోరారు. ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన నేటి పాలకులు రాష్ట్రానికి గుండు కొట్టారు. తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే మన రాష్ట్ర పరిస్థితి అత్యంత దయనీయంగా తయారయ్యింది . ఏడేళ్ల క్రితం మా ఊరిలో ఎకరా భూమి 70 నుంచి 80 లక్షల రూపాయల ధర పలకగా, ఇప్పుడు పది నుంచి 15 లక్షలకు తగ్గి 60 లక్షలకు చేరింది.
అప్పుడు కరీంనగర్, వరంగల్ ప్రాంతాలలో మూడు లక్షల రూపాయలు ఉన్న ఎకరా భూమి, ఇప్పుడు 60 లక్షలకు చేరింది. ఆదాయం, డబ్బున్న వాళ్లు రాష్ట్రంలోని దరిద్రమైన పాలనలో చూసి ఇక్కడ పెట్టుబడులు పెట్టలేమని పొరుగు రాష్ట్రానికి వెళ్లి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారన్నారు. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన జగన్మోహన్ రెడ్డి రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ కు చేరకుండా, పోలవరం లోనే బస చేశారు. ఎక్కడికి వెళ్ళినా రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ కు చేరకపోతే నిద్ర పట్టని జగన్ మోహన్ రెడ్డి, పోలవరం వరద బాధితులతో మమేకమైపోయారట.
పోలవరంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విని రాష్ట్ర ప్రజలంతా నిర్గాంత పోయారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత రాష్ట్రానిది కాదని, కేంద్రానిదని పేర్కొని జమోరె అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. పోలవరం నిర్మాణ బాధ్యత రాష్ట్రానిది కాదు… కేంద్రానిదని భావించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగుకు ఎందుకు వెళ్లిందని రఘు రామకృష్ణంరాజు ప్రశ్నించారు. పోలవరం పనులు సజావుగా జరుగుతున్నాయని, రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టవద్దని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి షెకావత్ మొత్తుకున్నారు.
అయినా వినకుండా, కాసుల కక్కుర్తి కోసం పోలవరాన్ని బలి పెట్టి, ఇప్పుడు నిర్మాణ బాధ్యత కేంద్రానిదని జమోరె పేర్కొనడం చూస్తే అసహ్యం వేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు విన్న తర్వాత కొంతమంది నాకు ఫోన్ చేసి మాట్లాడారు. వారి మాటలు విన్న తర్వాత ఈ పార్టీ సభ్యుడిగా నా పై నాకే అసహ్యం వేస్తోందన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పోలవరం పనుల పూర్తి పై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు.
2021 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి, ఆ తరువాత మాట మార్చి 2022, 2023 అంటూ కాలయాపన ప్రకటనలు చేశారు. ప్రస్తుతం 2025 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు ఆ మాటను కూడా మార్చి, పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని చెప్పి చేతులెత్తేశారని ధ్వజమెత్తారు.
2025 ఖరీఫ్ నాటికి 41.5 మీటర్ల ఎత్తుతో మొదటి కాంటూర్ వరకు బహులార్ధ సాధక ప్రాజెక్టును కాస్తా బ్యారేజీ గా మార్చి కంప్లీట్ చేస్తామని చెప్పినా జమోరె, ఇప్పుడు కేంద్రం నిధుల కోసం ఎదురుచూస్తున్నామని ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది. నిధులు ఇస్తే కొట్టేయడానికి అలవాటు పడిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంచాయితీల నిధులను పక్కదారి పట్టించింది. ఎన్ని నిధులు ఇచ్చిన కొట్టేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఓట్ల కొనుగోలుకు మాత్రం బటన్ నొక్కి కాస్తో కూస్తో నిధులను ఖర్చు చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తోంది. బటన్ నొక్కుడు పేరుతో మనం ఎంత నొక్కుతున్నామో ప్రజలు ఇప్పటికే పసిగట్టారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.
మద్యం పేరిట ఇప్పటికే 52 వేల కోట్ల అప్పులు
మద్యం ఆదాయాన్ని తాకట్టుపెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 52 వేల కోట్ల రూపాయల అప్పులు చేసింది. ఎత్తిన అప్పుల లో పదివేల కోట్ల రూపాయలు పోలవరం రిహాబిలిటేషన్ కోసం ఖర్చు చేసి ఉంటే, ఇప్పటికే ఆ ప్రాజెక్టు పూర్తి అయి ఉండేది. బ్యారేజీ కింద నీళ్లు వచ్చి ఉండేవి. కమీషన్ల కక్కుర్తి కోసం రివర్స్ టెండరింగ్ అని మనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చాము. ఆ కాంట్రాక్టర్ కు బ్యారేజీ ఎలా కట్టాలో తెలియక, చేయాల్సిన పనులు చేయకుండా మట్టి మాత్రమేవేశారు.
ఆ మట్టి వరదలు వచ్చి కొట్టుకుపోయింది. పోలవరం ప్రాజెక్టును గతనాగేళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడుసార్లు మాత్రమే సందర్శిస్తే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని రికార్డు టైంలో 72 శాతం పనులను పూర్తి చేశారు. దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. గతంలో పోలవరం నిర్మాణానికి 50వేల కోట్ల రూపాయలు కావాలని అప్పటి ప్రభుత్వం కోరితే, పోలవరాన్ని ఏటీఎం గా మార్చుకొని డబ్బులు డ్రా చేస్తున్నారంటూ తప్పుడు ఫిర్యాదులతో పాతిక వేల కోట్లు చాలని లేఖలు రాసింది జగన్మోహన్ రెడ్డి కాదా అంటూ ప్రశ్నించారు.
దానికి అప్పుడేదో తెలియక లేఖ రాశారంటూ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి సమర్ధింపులు. ముఖ్యమంత్రికి ఏమీ తెలియదని, సజ్జలకైనా ఏమైనా తెలిసేమో నంటూ రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు ఏడు నెలల అనంతరం మనమే పూర్తి చేసుకోవాలి. కేంద్రం నిధులు లేకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలతో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడం వల్ల ఎకరానికి 30 లక్షల చొప్పున 60 లక్షల కోట్ల రూపాయల ఆ రాష్ట్ర మార్కెట్ క్యాప్ పెరిగింది.
పోలవరం ప్రాజెక్టు తో పాటు, చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసి అభివృద్ధి చేసి ఉంటే, ఎకరా 10 నుంచి 15 కోట్ల రూపాయల ధర పలికేది. తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నదంతా ఆంధ్రా వాళ్లే. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం. జగన్మోహన్ రెడ్డి అసమర్ధత వల్లే తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ అంతకంతకు పెరుగుతోందని సమర్థులైన వాళ్లు భావిస్తున్నారు.
పోలవరానికి జగన్మోహన్ రెడ్డి వరద బాధితులను సందర్శించడానికి వెళ్లారో , లేకపోతే ఎన్నికల ప్రచారానికి వెళ్లారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆ ఒక్కటి అడగకు సినిమాలో హాస్యనటుడు బ్రహ్మానందం టీవీ నవ్వు మాదిరిగా వరద బాధితులను పరామర్శించే సమయంలో కూడా చిక్కటి చిరునవ్వు చిందించడం జగన్మోహన్ రెడ్డి కే సాధ్యమని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.
పోలవరంలో అసలైన వరద బాధితులను ఇండ్లలో బంధించారు. పోలవరాన్ని సర్వనాశనం చేసిన మా ప్రభుత్వానికి మళ్లీ ఓటు వేస్తే, ఆ చంద్రబాబు నాయుడు మనకు చాలా అన్యాయం చేశారని చెప్పి జమోరె … 2027 ఖరీఫ్ సీజన్ నాటికి నీళ్లు ఇస్తామంటారు. లేకపోతే నా పేరు మార్చుకుంటానని చెబుతారని రఘురామకృష్ణం రాజు ఎద్దెవా చేశారు. 2019 ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ఉండి ఉంటే 2020 జూన్ నాటికి కాకపోతే, 2021 జూన్ నాటికి పోలవరం బహులార్ధ సాధక ప్రాజెక్టు ఫుల్ కాంటూర్ తో ఈపాటికి పూర్తయి ఉండేదని రఘురామకృష్ణంరాజు అన్నారు
అజయ్ కల్లం పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు డొంక కదలడం ఖాయం
తన వాంగ్మూలాన్ని సిబిఐ అధికారులు తప్పుగా నమోదు చేశారని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం దాఖలు చేసిన పిటిషన్ న్యాయస్థానంలో విచారణకు వచ్చినప్పుడు తీగలాగితే డొంక కదిలిన చందంగా అన్ని విషయాలు వెలుగు చూస్తాయని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈ కేసులో నిజ దోషులు ఎవరో తేలి వచ్చే ఏడాది వైఎస్ వివేకానంద రెడ్డి జయంతి నాటికైనా వారికి శిక్ష పడాలి. నాలుగేళ్ల క్రితం వైఎస్ వివేక జయంతి రోజున ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కుంటి సాకులు చెప్పి జగన్మోహన్ రెడ్డి వాయిదా వేశారు.
ఆ తరువాత సెప్టెంబర్ రెండవ తేదీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి రోజున, వైఎస్ వివేకానంద రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అప్పటికే కుటుంబ సభ్యులపై డాక్టర్ సునీత అనుమానం వ్యక్తం చేయడం, కోర్టును ఆశ్రయించడంతో మా పార్టీ నాయకత్వం వైఎస్ వివేకా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించడం మానేసింది.
కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం లను వైఎస్ వివేక హత్య కేసులో విచారణ నిమిత్తం పిలిచిన సిబిఐ, అదే సమావేశంలో పాల్గొన్న దువ్వూరు కృష్ణ, కృష్ణమోహన్ రెడ్డి,జీ వి డి కృష్ణమోహన్ లు పిలవకుండా ఉంటుందా?, తమని సిబిఐ అధికారులు విచారణ నిమిత్తం పిలవలేదని వారు చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. సిబిఐ విచారణకు పిలిచిన వీరు గైరాజరై ఉంటారు. కోర్టులో సమర్పించే కేసు డైరీలో అన్ని వివరాలు ఉంటాయి. సిబిఐ అధికారులకు నేను వాంగ్మూలం ఇచ్చింది ఒకటైతే, సిబిఐ అధికారులు నమోదు చేసుకున్నది మరొకటని న్యాయస్థానంలో పెద్దగా శానిటిటీ లేని వాంగ్మూలాన్ని కొట్టివేయాలని కోరుతూ అజయ్ కల్లం పిటిషన్ దాఖలు చేయడం చూస్తే… గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉందన్నారు.
విచారణలో భాగంగా అజయ్ కల్లం, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పిలిచిన సిబిఐ అధికారులు జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణిని ఎందుకు పిలవరు?, పిలిచే ఉండి ఉంటారు. కానీ వారు ఏవో కారణాలు చెప్పి విచారణకు హాజరు కాకుండా దూరంగా ఉండి ఉంటారు. 32 ఆర్థిక నేరాల కేసులోనే కోర్టుకు హాజరు కాకుండా అనుమతి పొందగలిగిన జగన్మోహన్ రెడ్డికి, సిబిఐ విచారణకు హాజరు కాకుండా ఉండేందుకు లేఖ రాసి ఉండి ఉంటారు. ఆ వివరాలన్నీ తర్వాత బయటకు వస్తాయి. అజయ్ కల్లం వాంగ్మూలం నమోదు చేసిన సిబిఐ అధికారులు, తాము తప్పుగా ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశామని ఎందుకు అంగీకరిస్తారు?
తమ వద్దనున్న రికార్డెడ్ ఆధారాలను వారు కోర్టుకు సమర్పించే అవకాశం ఉందని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. వైఎస్ వివేక హత్య కేసులో నిజ దోషులకు శిక్ష పడాలని పోరాటం చేస్తున్న ఆయన కూతురు, అల్లుడు ఇదే పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని రఘురామకృష్ణం రాజు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
బాలికపై అత్యాచారం చేయబోయిన వాలంటీర్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైన్యమైన వాలంటీర్ల ఆగడాలను రఘురామకృష్ణం రాజు వివరించారు. దర్శి గ్రామ వాలంటీర్ అశోక్ ఒక బాలికపై అత్యాచారం చేయబోగా, అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ కు తరలించారు. బాలికపై అత్యాచారం చేయబోయిన వాలంటీర్ ను స్థానిక ఎంపిడిఓ కుసుమ కుమారి సస్పెండ్ చేశారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని బొమ్మరాటపల్లి వాలంటీర్ ఇంట్లో అక్రమ మద్యం సీసాలు పోలీసులకు లభించాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న బయ్యా రెడ్డి అనే వాలంటీర్ ను స్థానిక తహసీల్దార్ సస్పెండ్ చేశారు. ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనరాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. నకిలీ విలేకర్ల అవతారం ఎత్తి ఇద్దరు వాలంటీర్లు రమేష్, దస్తగిరి అక్రమ వసూళ్లకు పాల్పడగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు.
మనసులోని మాట చెప్పిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తన మనసులోని మాటను చెప్పారని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాంతంలో వరదలు వచ్చి ప్రజలు ఇక్కట్లు పడుతుంటే వారిని పరామర్శించాల్సిన నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, అక్కడకు వెళ్లకుండా బ్రో చిత్రంపై ఫిర్యాదు కోసమని ఢిల్లీకి వెళ్లడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం, పోలవరం నిర్మాణానికి నిధులు, విశాఖపట్నం రైల్వే జోన్ కోసం ప్రయత్నించాలని, ఉన్న ఆస్తులు అమ్మకుండా చూసుకోమ్మని రాష్ట్ర ప్రభుత్వానికి గడ్డి పెట్టారన్నారు.