Suryaa.co.in

Editorial

గన్నవరంలో ఇక.. వం‘శీను’ అయిపోయినట్టేనా?

– వైసీపీ అభ్యర్ధికి ఫలితాల్లో ‘నున్న’గా గుండుకొట్టిన టీడీపీ అభ్యర్ధి
– వార్డు ఉప ఎన్నికలో ఎమ్మెల్యే వంశీ అభ్యర్ధి పరాజయం
– టీడీపీ అభ్యర్ధి కోసం రంగంలోకి దిగిన వైసీపీ రెబెల్ యార్లగడ్డ
– యార్లగడ్డ ఝలక్‌తో వైసీపీ అభ్యర్ధి ఓటమి
– పనిచే యని ఎమ్మెల్యే వంశీ వ్యూహాలు
– వంశీకి యార్లగడ్డ వెంకట్రావు తొలి షాక్
– టీడీపీకి యార్లగడ్డ అడ్వాన్స్ గిఫ్ట్
– పార్టీలో చేరకముందే టీడీపీకి యార్లగడ్డ ముందస్తు విజయ కానుక
– వంశీకి కీలక సమయంలో ఝలక్ ఇచ్చిన యార్లగడ్డ వెంకట్రావు
– జగన్‌కు తన సత్తా చాటిన యార్లగడ్డ
– విజయంతో తానేంటో నిరూపించిన వైసీపీ తిరుగుబాటు నేత
– గన్నవరంలో వైసీపీ ఓటమికి ఉప ఎన్నిక ఫలితం ముందస్తు హెచ్చరిక సంకేతమా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎన్నికలు మరో ఏడాది ఉండగా వైసీపీ కీలక నియోజకవర్గంలో జరిగిన పరిణామం.. అధికార పార్టీలోకి జంపయిన, ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి షాక్‌నిచ్చింది. టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ జిలానీగా మారిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి.. ఆయన ప్రత్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు, కీలక సమయంలో షాక్ ఇవ్వడం వైసీపీని దిగ్భ్రాంతికి గురిచేసింది.

తాజాగా మేజర్ పంచాయితీ అయిన నున్న లోని 9వ వార్డు ఉప ఎన్నికను, ఎమ్మెల్యే వంశీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కేవలం 825 ఓట్లు ఉన్న ఆ వార్డును గెలించేందుకు వంశీ, తన అనుచరులను మోహరింపచేశారు. అవిశ్రాంతంగా ప్రచారం చేశారు. డబ్బు ధారాళంగా ఖర్చు చేశారు.

అయితే వంశీకి రాజకీయ ప్రత్యర్ధి అయిన, వైసీపీ సీనియర్ నేత యార్లగడ్డ వెంకట్రావు.. హటాత్తుగా బరిలోకి దిగడంతో సీన్ రివర్సయింది. టీడీపీ అభ్యర్ధి వల్లూరు వెంకట శివకు మద్దతుగా యార్లగడ్డ ప్రచారంలోకి దిగారు. దానితో అంతకుముందు వరకూ, వైసీపీ అభ్యర్థి బొమ్మిన శ్రీనివాసరావు విజయం నల్లేరుపై నడక అనుకున్న పరిస్థితి కాస్తా.. రింగురివర్సయి, నువ్వా-నేనా అన్నట్లు మారింది. దానితో ఎమ్మెల్యే వంశీ దానిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అయితే చివరాఖరకు ఫలితాల్లో, టీడీపీ అభ్యర్ధి 25 ఓట్లతో విజయం సాధించి, ఎమ్మెల్యే వంశీకి షాక్ ఇచ్చారు.

టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న యార్లగడ్డ.. తాజా ఉప ఎన్నిక విజయాన్ని, చంద్రబాబుకు ముందస్తు కానుకగా ఇచ్చినట్లే భావించాలి. ఇంకా పార్టీలో చేరకముందే ఒక వార్డును.. టీడీపీకి కానుకగా ఇచ్చిన యార్లగడ్డ, పరోక్షంగా తన ప్రత్యర్థి ఎమ్మెల్యే వంశీకి ఇచ్చిన, హెచ్చరిక సంకేతంగా భావించక తప్పదు. అధికారంలో ఉన్న పార్టీ ఉప ఎన్నికల్లో పరాజయం కావడమే ప్రమాద సంకేతం. అది ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేపై, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు సంకేతంగానే భావించడం సహజం.

ఇప్పటివరకూ వంశీకి సరైన సమాధానం చెప్పలేని టీడీపీకి.. యార్లగడ్డ రూపంలో దొరికిన అస్త్రంగానే తమ్ముళ్లు భావిస్తున్నారు. యార్లగడ్డ ఒక్కరే వంశీకి సరైన ప్రత్యర్థి అని, గన్నవరం టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. పైగా టీడీపీలో బలమైన నేత లేనందున, యార్లగడ్డకు టికెట్ ఇస్తే గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అటు యార్లగడ్డ కూడా తనను వాడుకుని వదిలేసిన జగన్- నియోజకవర్గంలో అవమానించిన వంశీకి, సరైన సమయంలో జమిలిగా ఝలక్ ఇచ్చారని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరోవైపు యార్లగడ్డ కూడా.. ఓడింది వార్డు మెంబర్ అభ్యర్ధి అయినప్పటికీ.. స్వయంగా ఎమ్మెల్యే వంశీనే ఓడించినంత మహదానంద పడుతున్నారట. ఏదేమైనా గన్నవరం వంటి కీలక నియోజకవర్గంలోని నున్న వంటి ప్రాంతంలో, వైసీపీ ఓడిపోవడం అధికారపార్టీకి అవమానమేన ంటున్నారు.

LEAVE A RESPONSE