Suryaa.co.in

Andhra Pradesh

కనిష్ట వ్యవధిలో 4వేల గ్రామాలలో రీసర్వే పూర్తిచేసిన రాష్ట్రంగా ఎపి రికార్డు

సర్వే , సెటిల్ మెంట్, భూమి రికార్డులు కమీషన్ సిద్దార్ధ జైన్
భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచిన ఏపీ రీసర్వే ప్రాజెక్ట్
భూ హక్కు పత్రంతో భద్రత నిర్ధారణ, భూ రక్షా సర్వే రాళ్ళు ద్వారా సరిహద్దు భద్రత
సెప్టెంబర్ 30 నాటికి 25.31 లక్షల స్టోన్స్ ప్లాంటేషన్స్, 8.5 లక్షల భూ హక్కు పత్రాలు
అన్ని గ్రామ సచివాలయాలలో అక్టోబరు 15 నాటికి రిజిస్టేషన్లు ప్రారంభించేలా చర్యలు

అతి తక్కువ వ్యవధిలో “ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం” ద్వారా 4,000 గ్రామాలలో ల్యాండ్ రీసర్వే కార్యకలాపాలను పూర్తి చేసిన మొట్ట మొదటి రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ భారత దేశం చరిత్రలో రికార్డును సొంతం చేసుకుంది. భూ యజమానుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ఈ పధకం ప్రారంభం కాగా, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల విశేష ఆదరణను చూరగొంటోంది.

ఈ పథకం ఆలంబనగా రాష్ట్ర సర్వే, సెటిల్ మెంట్ విభాగం పది సెంటీమీటర్ల ఖచ్చితత్వంతో భూకమత పటం, గ్రామ పటం, భూ హక్కు పత్రం తదితర భూమి రికార్డులు, అక్షాంశరేఖాంశలతో, డిజిటల్ రూపం లో అందిస్తుండటంతో భూ యజమానులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందుచూపును అభినందిస్తున్నారు.

“వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం” ద్వారా లక్షలాది రూపాయల ప్రభుత్వ వ్యయంతో వ్యవసాయ భూముల సరిహద్దులలో ఉచితంగా భూ రక్ష సర్వే రాళ్ళు ఏర్పాటు చేయటమే కాక, ట్యాంపరింగ్ కు అవకాశం లేని భూమి రికార్డులు సిద్దం అవుతున్నాయి.

పూర్తి పారదర్శకతతో రాష్ట్రంలో జరుగుతున్న ఈ పధకం ఫలితంగా భూ యజమానికి తెలియకుండా భూమి రికార్డులో ఎటువంటి మార్పులు చేసే అవకాశం ఉండదు. డబుల్ రిజిస్ట్రేషన్ల సమస్య అసలే ఉత్పన్నం కాదు. గ్రామ సచివాలయాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా ఇప్పటికే సేవలు అందిస్తున్నాయి. భూమి రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు జరుగుతూ రిజిస్ట్రేషన్ కు ముందే మ్యుటేషన్‌, పట్టా సబ్ డివిజన్ ప్రక్రియ సైతం ఈ పధకంలో అంతర్భాగంగా ఉంది. రాష్ట్రంలో రీసర్వే కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రపంచ స్దాయి సాంకేతికతను వినియోగిస్తున్నారు.

ఎయిర్ క్రాఫ్ట్ , హెలికాప్టర్, డ్రోన్, రోవర్, కార్స్ నెట్‌వర్క్ వంటి అత్యంత అధునాతన హైబ్రిడైజ్డ్ సాంకేతికతల సాయంతో రైతుకు స్పష్టమైన సరిహద్దులను అప్పగిస్తున్నారు. ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్‌ల తయారీలో భాగంగా ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్, డ్రోన్‌లు వినియోగిస్తుండగా, కార్స్ నెట్‌వర్క్, రోవర్లు తదితర అంశాలను గ్రౌండ్ ట్రూథింగ్, గ్రౌండ్ వాలిడేషన్ కోసం ఉపయోగిస్తున్నారు. డ్రోన్ ఫ్లై వివరాలను పరిశీలిస్తే మొత్తం రాష్ట్రంలో మొత్తం 17,595 గ్రామాలు ఉండగా, డ్రోన్ ఫ్లై వర్తించని గ్రామాలు 4135 ఉన్నాయి. నికరంగా 13,460 గ్రామాలలో పూర్తి కావాలసి ఉండగా, వాటిలో 12,836 గ్రామాలలో ఈ ప్రక్రియ పూర్తి అయ్యింది.

అంటే 95శాతం గ్రామాలలో పూర్తి కాగా, కేవలం ఐదు శాతం గ్రామాలలో మాత్రమే డ్రోన్ ఫ్లై మిగిలిఉంది. ఇలా మిగిలిన 624 గ్రామాలలో అక్టోబరు 15 నాటికి డ్రోన్ ఫ్లై పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సర్వే , సెటిల్ మెంట్, భూమి రికార్డులు కమీషన్ సిద్దార్ధ జైన్ ఈ సందర్భంగా తెలిపారు.

తొలిదశ నిర్ధేశించుకున్న 2000 గ్రామాల పరంగా మంచి పురోగతి నమోదు అయ్యింది. రెండు లక్షల మ్యుటేషన్లు ఈ గ్రామాలలో జరిగాయి. 4.3 లక్షల కొత్త సర్వే సబ్ డివిజన్లు సృష్టించబడ్డాయి. 19,000 సరిహద్దు వివాదాలు పరిష్కరించారు. 25 లక్షల సరిహద్దు రాళ్లు పాతారు. 7.8 లక్షల బిహెచ్ పిలను పంపిణీ చేసారు. రెండో దశ రెండు వేల గ్రామాలలో సైతం గణనీయంగా విజయాలు నమోదు అయ్యాయి.

2.69 లక్షల మ్యుటేషన్లు పూర్తి కాగా, 4.4 లక్షల వరకు కొత్తగా సర్వే సబ్ డివిజన్లు సృష్టించబడ్డాయి. 26,000 సరిహద్దు వివాదాలు పరిష్కారానికి నోచుకున్నాయి. ముఖ్యమంత్రి మార్గనిర్దేశకత్వంలో త్వరిత గతిన సర్వే ఫలాలను రైతులకు అందించాలన్న ధ్యేయంతో ముందడుగు వేస్తున్నామని సిద్దార్ధ జైన్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 30 నాటికి 25.31 లక్షలు స్టోన్స్ ప్లాంటేషన్స్, 8.5 లక్షల భూ హక్కు పత్రాలు పూర్తి చేయాలన్న లక్ష్యం కలిగి ఉన్నామన్నారు. అక్టోబరు 15 నాటికి అన్నిగ్రామ సచివాలయాలలో రిజిస్టేషన్ల ప్రకియ ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు.

“వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షా పథకం “ ఎన్ టి ఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం లో 2020 డిసెంబరు 21 న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించగా, దాదాపు 100 సంవత్సరాల తర్వాత దేశంలో సమగ్ర రీసర్వేను చేపట్టిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. భూ హక్కు పత్రం ద్వారా భద్రతను నిర్ధారణ, భూ రక్షా సర్వే రాళ్ళు ద్వారా సరిహద్దు భద్రత కల్పిస్తున్నారు .

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు భూ రికార్డులను జిపిఎస్ కోఆర్డినేట్‌లు, ప్రత్యేక ఐడి నంబర్, క్యూ ఆర్ కోడ్‌లతో జారీ చేస్తోంది. తొలిసారిగా భూరక్ష సర్వే రాళ్ల ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. రెవెన్యూ, సర్వే, పంచాయత్ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ శాఖల సహకారంతో ఈ ప్రాజెక్ట్ చురుకుగా సాగుతోంది. వ్యవసాయ భూములతో పాటు గ్రామ స్థలాలు, మునిసిపల్ భూములను కూడా మొదటిసారిగా సర్వే చేసి, గృహస్థులందరికీ యాజమాన్య ధృవీకరణ పత్రం కూడా జారీ చేస్తున్నారు.

పట్టాదారులు వ్యక్తిగతంగా రీసర్వేకు ప్రక్రియకు హాజరు కాలేని పక్షంలో, వారికి రీసర్వేకు హాజరయ్యేందుకు విభిన్న అవకాశాలు అందుబాటులో ఉంచారు. వాట్సాప్ వీడియో కాల్, జూమ్, ఏదైనా ఇతర వీడియో దృశ్య శ్రవణ మాధ్యమ సాంకేతికతల ద్వారా రీసర్వే బృందాలు రైతుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేస్తున్నాయి. మరోవైపు సర్వే, ఆర్‌ఓఆర్‌ చట్టం కింద ఉన్న అన్ని అవకాశాలను రైతులు వినియోగించుకునే వెసులుబాటు ఉంది.

భూమికి సంబంధించిన అన్ని సేవలు ఏకీకృతం కాగా, ఏక గవాక్ష విధానంలోకి వచ్చాయి. గ్రామ సచివాలయంలో సమీకృత సర్వే, రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ సేవలను అందించడం దేశంలోనే ఇదే మొదటిసారి అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏపీ రీసర్వే ప్రాజెక్ట్ భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలుస్తోంది.

ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మన అధికారులచే ఇతర రాస్ట్రాల వారికి రీ-సర్వే శిక్షణలను ఇప్పిస్తుండటం ప్రత్యేకత. సర్వే డిపార్ట్‌మెంట్ 32 డ్రోన్‌లను కొనుగోలు చేసి, 104 మంది సర్వేయర్లకు పైలట్‌లుగా శిక్షణ ఇచ్చి స్వతంత్రంగా డ్రోన్ ఫ్లై నిర్వహిస్తుoది. 3,240 జిఎన్ఎస్ఎస్ రోవర్లను కూడా కొనుగోలు చేసి రీసర్వేలో ఉపయోగిస్తున్నారు.

LEAVE A RESPONSE