– ఆయా కార్యకలాపాల పై ప్రశంసలు
సికింద్రాబాద్, సెప్టెంబరు 12 : రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ మంగళవారం డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ఏర్పాటు చేసిన సితఫలమండి లోని సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయం కార్యకలాపాలను పరిశీలించారు. సితాఫలమండీ లోని సెట్విన్ కేంద్రాన్ని సందర్శించారు. కార్యకలాపాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. వివిధ వృత్తులకు సంబంధించిన శిక్షణా కార్యకలాపాలను ఆరా తీశారు.
బ్యుటిషియన్, కంప్యూటర్స్, మొబైల్ రిపైరింగ్, సీ సీ కెమెరా రిపైరింగ్, కుట్టు- అల్లికలు, హోటల్ మేనేజ్ మెంట్ తదితర కోర్సుల కు సంబంధించిన శిక్షణ వివరాలను అధికారులు ఈ సందర్భంగా విపులీకరించారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ నెలకొల్పిన సితాఫలమండీలోని సెట్విన్ కేంద్రం కార్యకలాపాలు ఆదర్శంగా ఉన్నాయని, ఉపాధిని పొందేందుకు దోహదపడుతున్నాయని ఎం పీ సంతోష్ కుమార్ ఈ సందర్భంగా ప్రశంసించారు. నిరంతరం ప్రజల మధ్య నిలిచే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలు స్పూర్తివంతంగా నిలుస్తాయని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.
అదే విధంగా సితాఫలమండీ లో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ను పరిశీలించారు. పేద, మధ్య తరగతుల ప్రజలు సైతం వివాహాది శుభకార్యాలు చేసుకొనేందుకు వీలుగా ఏర్పాట్లు జరిపినట్లు పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యమంత్రి నుంచి పొందిన దాదాపు రూ.29 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులతో నిధులతో నిర్మిస్తున్న ప్రభుత్వ స్కూల్, కాలేజి కొత్త భవనాల నిర్మాణం పనులను, సుమారుగా రూ.11.60 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనాలను సంతోష్ కుమార్ ఈ సందర్భంగా పరిశీలించారు.