జగన్మోహన్ రెడ్డి చర్యలతో 95 శాతం మంది తటస్థుల మద్దతు చంద్రబాబుకే
స్కిల్ డెవలప్మెంట్ స్కీం లో స్కామే జరగలేదు… గుజరాత్, కర్ణాటక, తమిళనాడు కంటే తక్కువ ఖర్చుతో స్కీమ్ అమలు చేసిన చంద్రబాబు సర్కార్
అయినా స్కిల్ డెవలప్మెంట్ లో స్కామ్ జరిగిందంటే గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కూడా తప్పు జరిగినట్టేనా?
370 కోట్ల రూపాయలు వెచ్చించి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన చంద్రబాబు
మూడు వేల కోట్ల రూపాయలను కొట్టేయడానికి 7వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో మీటర్లు బిగించిన జగన్మోహన్ రెడ్డి
పార్టీ రంగులు వేసి తుడిపేయడానికి మూడు నుంచి నాలుగు వేల కోట్లు ఖర్చు చేసిన ముఖ్యమంత్రి
హవ్వ…జగన్మోహన్ రెడ్డి చేసింది ఒప్పటా?, చంద్రబాబు చేసింది తప్పటా??ఇదెక్కడి విడ్డూరం???
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పైనున్న తన వ్యక్తిగత కక్షను తీర్చుకోవడానికి సిఐడి పోలీసులతో అరెస్టు చేయించడం ద్వారా మా పార్టీ భవిష్యత్తును జగన్మోహన్ రెడ్డి సమాధి చేశారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
రానున్న ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థులకు భవిష్యత్తు అన్నదే లేకుండా చేశాడు. జగన్మోహన్ రెడ్డి చర్యలతో మా పార్టీ నేతలంతా లో లోపల కుమిలిపోతున్నారు. ఎరవేసి తిమింగలాన్ని పట్టాలను చూస్తే… తానే బలైపోతానన్న విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి చర్యలను పరిశీలిస్తే విస్మరించినట్లు స్పష్టమవుతుంది. గతంలో బలి చక్రవర్తి దానాలు చేస్తే, మా పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా పార్టీ భవిష్యత్తును బలిచ్చారు. అభినవ బస్మాసురుడిలా పార్టీ భవిష్యత్తు దహనం చేశారని మండిపడ్డారు.
పార్టీ సభ్యుడుగా ఈ విషయాన్ని చెప్పడానికి తానేమి సందేహించడం లేదన్నారు. బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… వ్యక్తిగత కక్షను తీర్చుకోవడానికి చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో స్కామ్ జరిగిందని అరెస్టు చేసి జైల్లో వేయడాన్ని రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో నిరసిస్తున్నారన్నారు.
అసలు స్కామే జరగని స్కీం లో చంద్రబాబు నాయుడు అరెస్టు ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారని, ఏ పార్టీ పక్షం కానీ తటస్తులంతా ఈసారి చంద్రబాబుకే మా ఓటు అని పేర్కొంటున్నారన్నారు. సమాజ హితం కోసం పనిచేసిన ఒక వ్యక్తిని ఇంత దారుణంగా హింసిస్తున్నాడంటే వాడు అసలు మనిషేనా?, ఇటువంటి మృగాన్నా మనము ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నదని నాకు ఫోన్ చేసిన ఎంతోమంది న్యాయవాదులు, వైద్యులు ప్రశ్నిస్తున్నారన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 35 శాతం ఓటు బ్యాంకు ఉంటే, తెలుగుదేశం పార్టీకి కూడా 35% ఓటు బ్యాంకు ఉంది. ఇక మిగిలిన తటస్థులలో 95% మంది ఇప్పుడు చంద్రబాబుకే తమ మద్దతు అని బాహాటంగానే చెబుతున్నారు. ఐటీ ప్రొఫెషనల్స్, న్యాయవాదులు, వైద్యులు ఒక్కరేమిటి ప్రజాస్వామ్య హితాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ వి ఆర్ విత్ యు చంద్రబాబు అని అంటున్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారని పేర్కొన్నారు.
తప్పులతడకగా ఎఫ్ఐఆర్
స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో ఎఫ్ఐఆర్ రిపోర్ట్ తప్పుల తడకగా ఉంది. అసలు ముందు చంద్రబాబు పేరే ఎఫ్ఐఆర్లో లేకపోయినప్పటికీ, ఆయన పేరు చేర్చారు. తక్షణమే రిమాండ్ రిపోర్ట్ ను రద్దు చేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ విచారణ సమయంలో ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ తమకు వారం రోజుల వ్యవధి కావాలని కోరడం జరిగింది. అయితే చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా కు తన వాదనను వినిపించే అవకాశాన్ని న్యాయమూర్తి కల్పించారు.
ఈ కేసులోని లోపాలను సిద్ధార్థ లూత్రా స్పష్టంగా న్యాయమూర్తికి వివరించారు. చట్టంలో 17A సెక్షన్ ను సిఐడి పోలీసులు ఎలా ఉల్లంఘించారో న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంలో సిద్ధార్థ లూత్రా వాదనకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడ్డు పడగా, న్యాయమూర్తి జోక్యం చేసుకొని ఆయన్ని మాట్లాడనివ్వు అని చెప్పారు. క్వాష్ పిటిషన్ పై ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించడానికి మూడు రోజుల వ్యవధిని ఇస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ కేసులో 409 సెక్షన్ అప్లికేబుల్ కాదు. మనీ ట్రయల్ ఎలా జరిగిందో… చంద్రబాబు నాయుడు దగ్గరికి డబ్బులు వచ్చి, అవి ఎక్కడ ఉన్నాయో ఇప్పటివరకు సిఐడి పోలీసులు గుర్తించలేకపోయారు.
ఇదే విషయాన్ని ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని సదరు టీవీ ఛానల్ యాంకర్ ప్రశ్నించగా మనీ ట్రయల్ గురించి తమ వద్ద పూర్తి సమాచారం లేదని పుసుక్కున నిజాన్ని ఒప్పుకున్నారు. ఇంకా ట్రేస్ చేస్తున్నామని సిఐడి పోలీసులు చెబుతున్నారు. కోర్టుకు కూడా ఎటువంటి ఆధారాలను సమర్పించలేదు. 409 అప్లికేబుల్ కానప్పుడు ఆటోమేటిగ్గా బెయిల్ మంజూరు చేయాల్సిందే. చట్టంలోని 17A చట్టాన్ని సరిగ్గా అన్వయించి అర్థం చేసుకోవడం పొరబడ్డారు. ఏసీబీ కోర్టుకు ఈ సెక్షన్ అసలు అర్థమే కాలేదు. న్యాయమూర్తికి కేవలం సుధాకర్ రెడ్డి మాటలు మాత్రమే స్పష్టంగా అర్థమైనట్టుంది.
సుప్రీం కోర్టు 2018 లో ఇచ్చిన తీర్పులో, ఏదైనా కేసు రిజిస్టర్ చేయాలని భావిస్తే 17A సెక్షన్ ను పరిగణలోకి తీసుకోవాలని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పును కాదనే హక్కు ఏసీబీ కోర్టుకు లేదు. అసలు ఈ కేసును ఏసీబీ కోర్టు విచారించడానికి హక్కేలేదు. ఒకవేళ హక్కు ఉన్నా 17 A సెక్షన్ అర్థం కాని న్యాయమూర్తి తనాన్ని మన్నించాలి. పిచ్చోడు ఏదో చెప్పాడని దానితో ఏకీభవించినట్లుగా న్యాయమూర్తి తన తీర్పులో రాసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు గురించి న్యాయమూర్తికి తెలిసి ఉండకపోవచ్చు.
హైకోర్టులో సుప్రీంకోర్టు తీర్పు గురించి చాలా స్పష్టంగా చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్ర మెన్షన్ చేశారు. 17A సెక్షన్ ఉల్లంఘనతో పాటు, 409 సెక్షన్ ఈ కేసుకు వర్తించకపోవడం, ఒక టెలివిజన్ ఛానల్ కు పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పిన విషయాన్ని పరిశీలిస్తే ఈ కేసులో అసలు విషయమే లేదన్నది స్పష్టమవుతుందని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. హైకోర్టు కూడా సుప్రీంకోర్టు తీర్పును కాదనలేదు. చంద్రబాబు నాయుడు రిమాండ్ రిపోర్టు చెల్లదని స్పష్టమైన తరువాత దానికోసం బీభత్సమైన సమయం తీసుకోవలసిన అవసరం లేదు. కోర్టు లో చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ ఎందుకు ఫైల్ చేయలేదన్న విలేకరుల ప్రశ్నకు, అసలు రిమాండ్ రిపోర్టే చెల్లనప్పుడు… జగన్మోహన్ రెడ్డి లాగా బెయిల్ పై బయట తిరగాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకు లేదని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు.
ఈ కేసులో వాయిదాల కోసమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఒక్కరోజు, రెండు రోజులు అంటూ కాలయాపన చేస్తుంది. చంద్రబాబు నాయుడుని వేధించడం తప్ప, ఈ కేసు వల్ల ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. కేసులో అసలు విషయమే లేనప్పుడు కోర్టు ముందు నిలబడే అవకాశమే లేదు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు ని 15 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సిఐడి పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను మంగళవారం వరకు టచ్ చేయవద్దని హైకోర్టు ఆదేశించిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలలో మూడు కోట్ల మంది చంద్రబాబు నాయుడు ని అభిమానిస్తారు. వాస్తవ పరిస్థితులను రాష్ట్ర ప్రజలంతా ఆకలింపు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు పెళ్లి రోజునే ఉద్దేశపూర్వకంగా సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. వినాయక చవితి పండుగ రోజున కూడా ఆయన జైల్లో ఉండే అవకాశం ఉంది. ప్రజలు, చంద్రబాబు నాయుడు అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోవాలి. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత కావలసిన బిల్లులకు మద్దతు తెలిపిన తర్వాత వీరి ఆటలు సాగవు. మరో ఎనిమిది నుంచి తొమ్మిది రోజులపాటు జైల్లో చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ఎటువంటి ఆపద తలెత్తకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిది. పొరపాటున జైలులో ఏదైనా జరిగితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆ పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే వాటిని ఊహించడం కూడా కష్టమే. ఒక్కసారి ఊహించుకుంటేనే భయంగా ఉందని రఘు రామ కృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధాని మోడీ కూడా తప్పు చేసినట్లుగానే పనికిమాలిన వారి వ్యాఖ్యలున్నాయి
స్కిల్ డెవలప్మెంట్ స్కీం లో స్కాం జరిగిందని కొంతమంది పనికిమాలిన వారు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తప్పు చేసినట్లుగానే వారి వ్యాఖ్యలు ఉన్నాయని రఘు రామకృష్ణంరాజు మండిపడ్డారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ స్కీమును ఎంతగానో ప్రోత్సహించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కీం ని ఆయన అమలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీం కార్యదర్శి హోదాలో ప్రేమ్ చంద్రారెడ్డి తన బృందంతో గుజరాత్ కు వెళ్లి ఆస్కీముని అధ్యయనం చేసి వచ్చి ఇక్కడ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఒకవేళ ఈ స్కీం లో ఏదైనా తప్పు జరిగినట్టు భావిస్తే ముందు ప్రేమ్ చంద్రారెడ్డిని అరెస్టు చేయాలి.
గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలలో స్కిల్ డెవలప్మెంట్ స్కీం క్లస్టర్లను డిజైన్ చేసినది డిజిటెక్ సంస్థ. అదే సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికంటే తక్కువ మొత్తానికే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ టూల్స్ కు వ్యాల్యూ చేసి… ఆ సాఫ్ట్వేర్ ను తీసుకొచ్చింది డిజిటెక్ సంస్థ. ఇస్తానని చెప్పిన సాఫ్ట్వేర్ ని పూర్తిగా ఆ సంస్థ అందజేసింది. ఇక జీఎస్టీకి అదనంగా ఏడు కోట్ల రూపాయలను చెల్లించినట్లు, ఆ వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని డిజిటెక్ సంస్థ ఎండి వికాస్ ఖాన్ విల్కర్ స్పష్టం చేశారు.
రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేవలం 370 కోట్ల రూపాయలను వెచ్చించి రెండు లక్షల అరవై మూడు వేల మందికి నైపుణ్య శిక్షణను ఇవ్వడం ఈ ప్రభుత్వానికి తప్పుగా కనిపించడం విడ్డూరంగా ఉంది. పనికిమాలిన రత్నాల పేరిట ఎన్ని నిధులు దుర్వినియోగం చేసిన తప్పు లేదట. మీటర్ల బిగింపు పేరిట మూడు వేల కోట్ల రూపాయలు కొట్టేయడానికి ₹7,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. ఇక పార్టీ రంగులు వేయడానికి, తుడ్చి వేయడానికి మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. అయినా అవేవీ తప్పు కావాట… విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం కేవలం 370 కోట్ల రూపాయలు ఖర్చు చేయడమే తప్పన్నట్లుగా ఈ ప్రభుత్వం కేసులు నమోదు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
ఎన్నికలకు ముందు పాత కేసులను తిరగదొడే ప్రయత్నం
ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై నమోదు చేసిన పాత కేసులను తిరగదొడే ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తోందని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. రామతీర్థం లో రాముని తలను నరికేసింది మా పార్టీ వాళ్లే. రామతీర్థం రథాన్ని తగలబెట్టింది కూడా వారే. అది పరిశీలించడానికి వెళ్లిన విజయసాయి రెడ్డి పై ఎవరో చెప్పుతో దాడి చేస్తే … హత్యాయత్నం కేసు నమోదు చేస్తే అందులో A1 చంద్రబాబు నాయుడు పేరు చేర్చడం విడ్డూరం.
ఇప్పుడు ఆ కేసు ను కూడా సీబీసీఐడీకి అప్పగిస్తారట. అలాగే అంగళ్లు కేసును వారికే కట్టబెడతారట. నలుగురు పోలీసులు నీ పక్కన ఉన్నారని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు జాగ్రత్త. వ్యక్తిగత కక్షల కోసం రాష్ట్రాన్ని తగలబెట్టే ప్రయత్నాన్ని చేయవద్దని పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు. పాత కేసులను తిరగడం ద్వారా పిటి వారింట్లను జారీ చేసి చంద్రబాబు నాయుడుని వేధించాలని చూస్తున్నారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీం లో స్కామ్ అన్నదే జరగలేదు. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు.
2019 లో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అమలు చేసిన రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డి అవార్డును స్వీకరించారు. ఆ మూడు నెలల్లోనే స్కిల్ డెవలప్మెంట్ స్కీం అమలు కోసం ఆయన చేసింది ఏమిటి?, గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన స్కీమ్ వల్లే అవార్డు వచ్చిందని, దాన్ని ఘనత గా జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నారని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.
రాక్షసులే తలదించుకునే జగన్ వ్యవహార శైలి
ఎందరో రాక్షసులను చూశాము. రాక్షసులే తల దించుకునేలా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉన్నది. జగన్ ను రాక్షసుడని అంటున్నారు. వాడికంటే మనం చాలా మంచోళ్లం కదా. వాడితో మనల్ని ఎందుకు కలుపు తున్నారని రాక్షసులే విస్తుపోయేలా జగన్మోహన్ రెడ్డి చేష్టలున్నాయని రఘురామ కృష్ణంరాజు ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా అమలు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కీం కు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అమలు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కీంకు ఎటువంటి తేడా లేదు. గుజరాత్ వెళ్లి మరి సిఐడి పోలీసులు అన్ని తనిఖీచేశారు.
అయినా 370 కోట్ల రూపాయలకు ఇంత బెనిఫిట్ లభిస్తే, ఈ స్కీమును అమలు చేసిన వ్యక్తిని ఇంతగా వేధిస్తున్న జగన్మోహన్ రెడ్డిని క్షమించి వదిలేయాలా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడునే ఇంతగా వేధిస్తే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటి అంటూ నిలదీశారు. రాముడికి 14 ఏళ్ల పాటు అరణ్యవాసం తప్పలేదు. చంద్రబాబు నాయుడు కి కూడా 14 రోజుల జైలులో ఉండాల్సిన పరిస్థితి నెలకొనవచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సమాధికి తానే గొయ్యి తవ్వుకుంటున్నారు. నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు రేపు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇసుక, మద్యం కుంభకోణాలలో అక్రమాలను వెలికి తీసి వెధవ పనులు చేసిన గ్యాంగ్ ను జైల్లో పెట్టడం ఖాయమన్నారు.
చంద్రబాబును జైల్లోనే పెట్టారుగా… ఇక పీవీ రమేష్ ను ఎలా కొనుగోలు చేశారు?
దళిత ఐఏఎస్ అధికారి పివి రమేష్ ను చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారని కొంతమంది పనికిమాలిన వ్యక్తులు వ్యాఖ్యలు చేస్తున్నారని రఘురామకృష్ణం రాజు ఫైర్ అయ్యారు. పివి రమేష్ రిజర్వేషన్ సహాయంతోకాకుండా, మెరిట్ ఆధారంగా ఐఏఎస్ పరీక్షలు ఉత్తీర్ణుడైన వ్యక్తి. ఎటువంటి అవినీతి మరక అంటని ఉన్నత అధికారి. ఇప్పుడు ఆయన స్కిల్ డెవలప్మెంట్ స్కీం లో ఎటువంటి స్కాం జరగలేదని నిజాలు మాట్లాడితే చంద్రబాబు నాయుడుకి అమ్ముడుపోయారని కొంతమంది పనికిమాలిన వ్యక్తులు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు ని మీరే జైల్లో పెట్టారు కదా… ఇక జైలు నుండి వచ్చి పీవీ రమేష్ ను ఎప్పుడు కొనుగోలు చేశారని ప్రశ్నించారు. నిజాలు మాట్లాడిన పివి రమేష్, చంద్రబాబు నాయుడు కి అమ్ముడుపోయినట్లయితే… ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కూడా వారికి అమ్ముడుపోయారని భావించాలా? అంటూ ఎదురు ప్రశ్నించారు. ఈ కేసులో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తికి సెక్యూరిటీని కల్పించడం చూస్తే… సెక్యూరిటీని ఆమె కోరారా?, లేకపోతే ప్రభుత్వమే కల్పించిందా??, తీర్పు ఇవ్వకముందే సెక్యూరిటీ అవసరం వస్తుందని ప్రభుత్వం భావించిందా?? అంటూ శర పరంపరగా రఘురామ కృష్ణంరాజు ప్రశ్నాస్త్రాలను సంధించారు.
సిఐడి పోలీసులతో పాటు, ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి ఆమె బంధువులకు ఎవరెవరి ఫోన్ ల నుంచి కాల్స్ వచ్చాయో విచారణ జరిపించాలన్న బిజెపి నేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలను తాను సమర్ధిస్తున్నట్లు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో స్కామ్ జరిగిందని పివి రమేష్ చెప్పినట్లుగా టీవీ 9 ఛానల్ లో పదే పదే ప్రసారం చేశారని, ఇప్పుడు అదే పివి రమేష్ నిజాలను మాట్లాడితే జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. మీడియా ముందుకు వచ్చి నిజాలను మాట్లాడిన పివి రమేష్ ఇంటికి సిఐడి పోలీసులు వెళ్లినట్లు తెలిసింది. ఒకవేళ పీవీ రమేష్ ను అరెస్టు చేస్తే, ఇప్పటికే గాలిలో దీపం లా ఉన్న ఈ కేసు ఆరిపోవడం ఖాయమన్నారు. 1964 లో విడుదలైన ఆత్మబలం చిత్రాన్ని చూసి అందులో సీనియర్ నటుడు జగ్గయ్య పాత్ర సమకాలీన రాజకీయాలలో ఏ నేతకు దగ్గర పోలికలు ఉన్నాయో చెప్పాలని రఘురామ కృష్ణంరాజు ప్రజలను కోరారు.