యువతలోనే దేశాన్ని ముందుకు నడిపించే శక్తి
ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ తో ఉజ్వల భవిష్యత్
విభిన్న ప్రతిభావంతులకు కేరళ తరహాలో ప్రత్యేక సంస్థ ఏర్పాటు అవసరం
సీఎం సహకారంలో నిధులు సమకూర్చుతానని హామీ
50 లక్షల చెక్ అందజేత
నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ నూతన భవనం ప్రారంభించిన ఎంపీ విజయసాయిరెడ్డి
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఆంధ్రప్రదేశ్ లో విద్యాభివృద్ధి జరుగుతోందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో మంగళవారం ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ నూతన భవనం ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని అనంతరం విద్యార్దులకు ఉద్దేశించి మాట్లాడారు.
రాష్ట్రంలో ప్రజల కనీస అవసరాలు కూడు, గూడు, గుడ్డ తీర్చిన తరువాత అత్యంత ప్రాధాన్యతా రంగాలైన వైద్యం, విద్యాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారని అన్నారు. డిజిటల్ విప్లవంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూంలు, కంప్యూటర్లు ఏర్పాటు చేసి, విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేశారని అన్నారు. అభివృద్ధి చెందుతున్న డిజిటల్ యుగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్సులకు ఉజ్వల భవిష్యత్ ఉందని, ఈ దిశగా యూనివర్శిటీలో ఏఐఎంఎల్ ప్రారంభించడం ప్రశంసనీయమని అన్నారు. డిజిటల్ యుగంలో ఆర్కిటెక్చర్, టెక్నాలజీ రంగాలకు అత్యంత ప్రాముఖ్యత ఉందని, నూతన ఆవిష్కరణలకు అద్భుత అవకాశాలు ఉన్నాయని అన్నారు.
ఈ అవకాశాన్ని వినియోగించుకొని విద్యార్థులు, అధ్యాపకులు మరింత పేరుప్రఖ్యాతులు తేవాలని కోరారు. క్రీస్తు పూర్వం భారతదేశంలో కేవలం నలంద, తక్షశిల యూనివర్శిటీలు మాత్రమే ఉండేవని విద్యనభ్యసించేందుకు విదేశాల నుంచి విద్యార్థులు భారతదేశానికి వచ్చేవారని అన్నారు. ఆ సమయంలో హార్వర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ ఫర్డ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత యూనివర్శిటీలు లేవని గుర్తుచేశారు. విదేశాల నుంచి ప్రతి ఏటా 4వేల మంది విద్యార్థులు ఉన్నత చదువులకు భారతదేశానికి వచ్చేవారని అన్నారు. ఇప్పుడు మన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు పరుగులు తీస్తున్నారని అన్నారు.
ప్రస్తుతం దేశంలో 5350 యూనివర్శిటీలు ఉన్నాయని, ప్రతి ఏటా 2 కోట్ల మంది విద్యార్థులు ఆయా యూనివర్శిటీల్లో చదువుతున్నారని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పోలిస్తే భారతదేశ విద్యాప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేవని, విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు మౌలిక సదుపాయాలు, అకడమిక్ కరిక్యులం మరింతగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం తీసుకొచ్చిందని అన్నారు. భారతదేశ విద్యార్థి గ్లోబల్ ఛాలెంజ్ ను ఎదుర్కొనే విధంగా నూతన విద్యా విధానంలో మార్పులు చేశారని అన్నారు. ప్రాథమిక విద్య, సెంకడరీ విద్య బలోపేతం చేయడం ద్వారా విద్యకు బలమైన పునాది వేసినట్లువుతుందని అన్నారు.
రాష్ట్రంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేశారని అన్నారు. దేశంలో విద్యాప్రమాణాలు మెరుగుపరచడం ద్వారా విదేశీ విద్యార్థులు ఇండియాకు చదువుకోసం వస్తారని అన్నారు. భారతదేశం ఆర్దికంగా బలీయమైన శక్తిగా ఎదుగుతోందని, ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా ఇండియా గుర్తింపు పొందిందని త్వరలో నెంబర్ 3 స్థానానికి చేసుకుంటుందని అన్నారు. చదువుకున్న ప్రతి విద్యార్థి తాను సంపాదించిన జ్ఞానంతో దేశానికి తాను ఏమి చేశానో ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో గడిచిన నాలుగున్నర సంవత్సరాలలో 1.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని, 6.10 లక్షల పబ్లిక్, ప్రైవేటు రంగ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించారని అన్నారు. ఉద్యోగాల కల్పనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 85% ఉద్యోగాలు కల్పించారని అన్నారు. యూనివర్శిటీలో విద్యాప్రమాణాలు మెరుగుపరచడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలు ఉద్యోగాల కల్పించేందుకు ముందుకు వస్తాయని అన్నారు. అలాగే యూనివర్శిటీకి నాక్ నుంచి మంచి గ్రేడ్ రావాలని అశిస్తున్నానని అన్నారు.
50 లక్షల చెక్ అందజేత
ఈ సందర్భంగా యూనివర్సిటీలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ – మిషన్ లెర్నింగ్- ఇంటర్నట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ ఎక్స్ లెన్స్ సెంటర్ ఏర్పాటుకు విజయసాయిరెడ్డి తన ఎంపీ నిధుల నుండి 50 లక్షలు రూపాయల చెక్ ను యూనివర్శిటీ విసికి అందించారు..
కేరళలోని విబిన్న ప్రతిభావంతుల ఆర్ట్ సెంటర్ దేశానికే అదర్శం
కేరళలో త్రివేండ్రంలో ప్రముఖ సంగీతకళాకారుడు గోపినాధ్ నిర్వహిస్తున్న విభిన్న ప్రతిభావంతులు ఆర్ట్ సెంటర్ దేశానికే ఆదర్శమని ఈ మేరకు యూనిర్శిటీ ఉన్నతాధికారులు, యాజమాన్యం ఆ సంస్థను సందర్శించాలని విజయసాయి రెడ్డి కోరారు. ట్రాన్స్ పోర్టు, టూరిజం, కల్చర్ విభాగాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్టడీ టూర్ లో బాగంగా దేశ వ్యాప్తంగా తాను అనేక విద్యా సంస్థలు సందర్శించానని అయితే త్రివేండ్రంలోని డిఫరెంట్లీ ఎబుల్డ్ ఆర్ట్ సెంటర్ ప్రత్యేకమైనదని అన్నారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక శిక్షణ అందించి సాధారణ విధ్యార్దులకు ధీటుగా ఆత్మ స్థైర్యాన్ని పెంపొందిస్తున్నారని అన్నారు. తాను గడిపిన 3 గంటల సమయంలో నిర్వాహకునితో పాటు తల్లిదండ్రులతోనూ మాట్లాడానని అన్నారు.
పిల్లల భవిష్యత్ పట్ల వారి తల్లిదండ్రులు ధీమాతో ఉన్నారని అన్నారు. అయితే ఆ సంస్థ ప్రభుత్వ గుర్తింపుకు నోచుకోలేదని, గుర్తింపు కోసం తాను కేంద్ర మానవ వనరులు మంత్రిత్వ శాఖకు సిఫారస్ చేశానని అన్నారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ప్రముఖులు సంస్థను సందర్శించారని అన్నారు. విభిన్న ప్రతిభావంతులకు సౌకర్యాలు ఉచితంగా కల్సిస్తే సరిపోదని, వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని, మిగతా విద్యార్దులకు తాము ఏ మాత్రం తీసిపోమన్న భావన వారిలో కల్గించాలని కోరారు. అటువంటి సంస్థ యూనివర్శిటీలో ఏర్పాటు చేయాలని, అందుకు కావాల్సిన నిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి సీఎస్ఆర్ నిధులు, లేదా తన ఎంపీ నిధులనుంచి సమకూర్చుతానని హామీ ఇచ్చారు.
విభిన్న ప్రతిభావంతులకు కేంద్ర ప్రభుత్వం 4% రిజర్వేషన్ కల్పించిందని, వారిలో ఆత్మ స్థైర్యం నింపే బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. కేరళలోని డిఫరెంట్లీ ఎబుల్డ్ ఆర్ట్ సెంటర్ సందర్శించి, అక్కడి విద్యావిధానం, మౌలిక వసుతులు అధ్యయం చేసి డీపీఆర్ సమర్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రెక్టర్ ప్రొఫెసర్ పి. వరప్రసాద్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.కరుణ, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిద్దయ్య, ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ప్రమీలారాని , ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల ప్రిన్సిపల్స్ ప్రొఫెసర్ సిహెచ్. స్వరూపారాని , ప్రొఫెసర్ కే. గంగాధర్, ఓఎస్డి ఆచార్య కే .సునీత, వర్సిటీ అధికారులు, కోఆర్డినేటర్లు, డైరెక్టర్లు, పాలకమండలి సభ్యులు కన్నా మాస్టారు, వర్సిటీ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు పాల్గొన్నారు.