– ముఖం చాటేసిన జగన్మోహన్‌రెడ్డి
– కేసీఆర్ పరామర్శలో కనిపించని ఏపీ సీఎం జగన్
– తెలంగాణ సీఎం రేవంత్, టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శ
– చిరంజీవి, జానారెడ్డి, మంత్రుల పరామర్శ
– ఇప్పటిదాకా పరామర్శకు రాని సీఎం జగన్
– కనీసం కనిపించని ఏపీ మంత్రులు
– అధికారం ఉంటేనే కనిపిస్తారా అంటూ సెటైర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)
అధికారంలో ఉన్నప్పుడు వారిద్దరూ గురు శిష్యులు. అపూర్వ సహోదరులు. ఒకరి ఆలోచనలే మరొకరి అడుగులు. ఫెవికాల్ మాదిరిగా అతుక్కున్న వారి బంధంపై ప్రకృతి కూడా ఈర్ష్యపడింది. ఫలితంగా రెండు రాష్ట్రాల మధ్య మునుపటి కొట్లాటలు, పంచాయతీల్లేవు. గురువు అడిగిన వెంటనే శిష్యపరమాణువు, హైదరాబాద్ సెక్రటేరియేట్‌లో ఏపీ ప్రభుత్వ వాటా భూమి కూడా వదులుకున్నారు. మొహమాటం కోసం విద్యుత్ బకాయిలు కూడా అడగకుండా, అన్నయ్యకు కావలసినంత వెసులుబాటు ఇచ్చారు. ఇవన్నీ తన ప్రత్యర్ధికి రిటర్ను గిఫ్టు ఇచ్చి, తనకు పవర్‌గిఫ్ట్ ఇచ్చినందుకు శిష్యుడు, ప్రేమతో గురువుకు ఇచ్చిన కానుకలు. మరి గురువంటే వల్లమాలిన భక్తి ప్రపత్తులున్న శిష్యులుంగారు… గురువుగారు కాలుజారి ఆసుపత్రిలో చేరితే కనీసం ఆయనను పరామర్శించేందుకు రాకపోవడమేమటి చెప్మా? పలకరించకుండా ముఖం చాటేయడానికి కారణమేమిటి? ఇప్పుడు అందరికీ ఇదే హాశ్చర్యం! ఇది కూడా చదవండి: రేవంత్-బాబు.. ఒక పరామర్శ.. మరికొన్ని విమర్శలూ!
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బాత్రూమ్‌లో కాలుజారి, యశోదా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆ మేరకు ఆయనకు తుంటిమార్పిడి ఆపరేషన్ కూడా విజయవంతంగా జరిగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా, ఇద్దరు ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అందులో ఒకరు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కాగా, మరొకరు మాజీ సీఎం-టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.
ఇద్దరూ కేసీఆర్ బాధితులే. రేవంత్‌ను కేసీఆర్ నేరుగా జైలుకు పంపిస్తే.. చంద్రబాబును కేసీఆర్ శిష్యుడు జగన్ జైలుకు పంపించారు. ఆరకంగా ప్రత్యక్షంగా-పరోక్షంగా ఇద్దరూ కేసీఆర్ వల్ల జైలుపాలయినవారే. ఈ ఇద్దరిలో కాస్త విషాదం రేవంత్‌దే. బిడ్డ పెళ్లిని దగ్గరుండి చేయలేని వేదన. అలాంటి ఇద్దరు ప్రత్యర్ధులు ఒకరోజు అటు ఇటుగా, కేసీఆర్‌ను ఆసుపత్రిలో పరామర్శించడం అందరినీ విస్మయపరిచింది. వారిద్దరి విశాల హృదయాన్ని లోకం కూడా మెచ్చింది.
కానీ కేసీఆర్ ఆసుపత్రిలో చేరి ఇన్ని రోజులయినా, ఆయన రాజకీయ శిష్యపరమాణువు జగన్ మాత్రం, ఇప్పటివరకూ పత్తా లేకపోవడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జగన్ ముఖం చాటేయడం రాజకీయ వర్గాలను విస్మయపరుస్తోంది. నిజానికి అందరికంటే ముందే ఆయన ‘ఓదార్పు’ యాత్ర కోసం హైదరాబాద్ వెళ్లాలి. ఎలాగూ ఏపీలో పది కిలోమీటర్ల ప్రయాణానికే ఆయన హెలికాప్టర్ వాడుతున్నారు కాబట్టి, హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో వెళ్లయినా సరే, గురువుగారిని పరామర్శిస్తారని చాలామంది భావించారు. పైగా తన రాజకీయ ప్రత్యర్ధి చంద్రబాబు- ఆయన సీఎం శిష్యుడు రేవంత్‌రెడ్డి తనకంటే ముందుగానే పరామర్శించారు కాబట్టి, కనీసం మరుసటి రోజైనా జగనన్న హైదరాబాద్ వెళతారని వైసీపేయులు కూడా అనుకున్నారు. కానీ ఇప్పటివరకూ జగనన్న కాదు కదా? కనీసం ఆయన మంత్రులెవరూ వచ్చి పరామర్శించకపోవడంపై, రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
రాజకీయాల్లో అధికారం ఉన్నంత వరకే, బంధాలు కొనసాగుతాయన్న సత్యం దీనితో మరోసారి తేలిపోయింది. ఇప్పుడు కేసీఆర్ అధికారంలో లేరు కాబట్టి, ఇక జగన్‌కు ఆయనతో పనేమిటిన్న వ్యంగ్య వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఇంట్లో బిర్యానీ, చేపపులుసు తిన్న జగన్… అదే కేసీఆర్ అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరితే, కనీసం మాటమాత్రం పలకరించకపోవడంపై గులాబీదళాలు కూడా గుర్రుగా ఉన్నాయట. ఏదేమైనా కేసీఆర్-జగన్ బంధం.. అధికారమనే తాత్కాలిక వంతెనపై నడిచిన ప్రయాణమేనని తేలింది.