Suryaa.co.in

Editorial

కమలం-జనసేన.. కలసి కదనం!

– ఏపీలో వికసిస్తున్న బీజేపీ-జనసేన పొత్తు బంధం
– సర్పంచుల నిధుల ధర్నాలో పాల్గొన్న రెండు పార్టీలు
– తొలిసారి రెండు పార్టీల కలసి కదనభేరి
– సోము హయాంలో ఉత్తర దక్షిణ ధృవాలుగా రెండుపార్టీలు
– స్థానిక సమరంలో టీడీపీతో కలసి పోటీ చేసిన జనసేన
– జనసేనను పట్టించుకోని సోము నాయకత్వం
– సోము పనితీరుపై చాలాసార్లు ఢిల్లీకి ఫిర్యాదు చేసిన పవన్‌
– పురందేశ్వరి రాకతో మారిన పొత్తు బంధం
– జనసేనతో కలసి ధర్నాలో పాల్గొన్న బీజేపీ శ్రేణులు
– ధర్నాల్లో బీజేపీ కంటే జనసైనికుల సంఖ్యనే ఎక్కువ
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు బంధం వికసిస్తోంది. మొన్నటి వరకూ పేరుకు పొత్తు ఉన్నా.. ఉత్తరదక్షిణ ధృవాలుగా ఉన్న రెండు పార్టీలు, ఇప్పుడు కొత్త నాయకత్వం రాకతో, మళ్లీ ఒక్కటవుతుండటం కొత్త పరిణామం.

జగన్‌ సర్కారు గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి, సర్పంచులను బికారులను చేసిందన్న ఆవేదన ఢిల్లీ పురవీధుల వరకూ చేరింది. తమ నిధులు కొట్టేశారంటూ సర్పంచులు.. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లలో చేసిన వినూత్న ఫిర్యాదు, సంచలనం సృష్టించింది. అంతకుముందు సర్పంచులు, బిచ్చమెత్తుకుంటూ రోడ్డెక్కిన వైనం చర్చనీయాంశమయింది.

ఫలితంగా గ్రామాలకు కేంద్రం ఇచ్చిన నిధులను.. జగన్‌ సర్కారు దారిమళ్లించి, ఇతర అవసరాలకు వాడుకుందన్న విషయం క్షేత్రస్థాయిలో తెలిసిపోయింది. ఈ అంశంపై టీడీపీ అన్ని పార్టీల కంటే ముందుండి, సర్పంచులను ఉద్యమాల వైపు నడి పించింది.

ఈ క్రమంలో బీజేపీ కూడా, సర్పంచులకు మద్దతుగా అన్ని జిల్లాల్లో తాజాగా ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో.. జనసేన కూడా పాల్గొనడం అందరినీ ఆకర్షించింది. కొన్నేళ్ల క్రితం ఒకే ఒక్క కార్యక్రమంలో మాత్రమే పాల్గొన్న జనసైనికులు, మళ్లీ సుదీర్ఘకాలం తర్వాత, బీజేపీ కార్యక్రమంలో పాల్గొనడంతో కమలం శ్రేణుల్లో సమరోత్సాహం తొంగిచూసింది.

సోము వీర్రాజు హయాంలో, జనసేనతో బీజేపీ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పవన్‌పై వైసీపీ చేసే విమర్శలను బీజేపీ ఏ సందర్భంలో కూడా ఖండింలేదు. టీడీపీ నేతలే పవన్‌కు మద్దతుగా నిలబడి వైసీపీపై ఎదురుదాడి చేశారు. పవన్‌ కల్యాణ్‌ ఉన్న హోటల్‌ వద్ద పోలీసులు హంగామా చేసినప్పుడు చంద్రబాబు ఖండించారు. ఆ తర్వాతనే సోము వీర్రాజు మేల్కొని ఆ ఘటనను ఖండించారు.

నిజానికి పొత్తు లేకపోయినా టీడీపీ-జనసేన మానసికంగా కలసి అడుగులు వేశాయి. చివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా.. పొత్తు ఉన్న బీజేపీతో కాకుండా, జనసేన అభ్యర్ధులు టీడీపీతో కలసి అవగాహనతో పనిచేశారు. కాగా సోము పనితీరుపై పవన్‌ చాలాసార్లు ఢిల్లీ నేతలకు ఫిర్యాదు చేశారు.

నిజానికి ఈ ధర్నా కార్యక్రమాల్లో బీజేపీ శ్రేణుల సంఖ్య పలచగా, జనసైనికుల సంఖ్యనే ఎక్కువగా కనిపించింది. కొన్ని జిల్లాల్లో అయితే జనసైనికులు హాజరుకాకపోతే, బీజేపీ ధర్నాలు జనం లేక వెలవెల పోయేవి. సహజంగా బీజేపీ నేతలు కార్లలో వచ్చినా, ఒక్కరే వస్తుంటారు. కారులో కార్యకర్తలను తమ వెంట తీసుకువెళ్లరు. ఈ కారణంగా బీజేపీ కార్యక్రమాల్లో కార్యకర్తల కంటే, నేతల సంఖ్యనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఆ పార్టీ కార్యక్రమాలను, ఎవరూ సీరియస్‌గా తీసుకోకపోవడానికీ ఇదీ ఒక కారణం.

కాగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయిలో జరిగే ఈ ధర్నాలకు.. ఒక్కో జిల్లాకు 5 వేలమందిని తరలించాలని, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్వయంగా జిల్లా అధ్యక్షులను ఆదేశించారు. ధర్నాలను సీరియస్‌గా తీసుకోవాలని స్పష్టం చేశారు. అయితే రెండు, మూడు జిల్లాల్లో తప్ప.. బీజేపీ ధర్నాల్లో వెయ్యిమంది దాటిన దాఖలాలు లేవు. అది కూడా జనసేన కార్యకర్తలతో కలిపి కావడం గమనార్హం.

పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి సొంత ఒంగోలులో నిర్వహించిన సభకు సైతం, జనసేన కార్యకర్తలే రావడం విశేషం. అక్కడ డీమ్డ్‌ యూనివర్శిటీ కోసం ప్రయత్నిస్తున్న విద్యాసంస్థల అధినేత కల్యాణచక్రవర్తి, ధర్నాకు జనాలను తరలించారు. ధర్నాకు అన్ని వనరులూ ఆయనే సమకూర్చడంతో, ధర్నా కళకళలాడింది. అటు సర్పంచులు కూడా భారీ సంఖ్యలోనే హాజరయ్యారు. మొత్తంగా పురందేశ్వరి హాజరైన ధర్నాకు, వెయ్యిమంది హాజరయ్యారు.

అదీకాకుండా.. బీజేపీ రాష్ట్ర కమిటీని ప్రకటి ంచకపోవడంతో, అందులో స్థానం ఆశిస్తున్న నేతలు, జనాలను తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ధర్నాల్లో, ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ఆవిధంగా రాష్ర్ట కమిటీని ప్రకటి ంచకపోవడం కూడా, ధర్నాలు విజయవంతం కావడానికి కలసివచ్చినట్లయింది.

ఈవిధంగా కార్యకర్తల సంఖ్య విపరీతంగా ఉండే జనసేన ధర్నాలో పాల్గొనడంతో, బీజేపీ ధర్నాలకు నిండుతనం వచ్చింది. విజయవాడ, విశాఖలో జరిగిన ధర్నాలు విజయవంతమవగా, మిగిలిన జిల్లాల్లో ఫర్వాలేదనిపించింది. అనంతపురం, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కూడా జనసేన కార్యకర్తలే ఎక్కువగా హాజరయ్యారు. రెండు పార్టీల ధర్నాతో, అటు సర్పంచులలో కూడా ఆత్మస్ధైరం పెరిగింది.

తాజా పరిణామాలు పరిశీలిస్తే.. భవిష్యత్తులో రెండు పార్టీల బంధం బాగా బలపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్నిబట్టి.. ఇకపై జనసేన నిర్వహించే ఆందోళన కార్యక్రమాలకు, బీజేపీ కూడా హాజరయ్యేలా కనిపిస్తోంది. పురందేశ్వరి అధ్యక్షురాలిగా వచ్చిన తర్వాత, రాజకీయ బంధం బలపడం మంచిదేనని, జనసైనికులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

LEAVE A RESPONSE