– ఆర్భీఐ, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రుణాలు
– 2019 వరకు అప్పులు ఏటా 20% పెరగ్గా.. 2020 నుంచి ఏటా 15.42% మాత్రమే అప్పుల్లో పెరుగుదల ఉన్నట్లు వెల్లడి
– ఆర్థిక శాఖ, ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం రుణాలు సమీకరించినట్లు ఆర్థిక శాఖ, స్పెషల్ సెక్రటరీ దువ్వూరి కృష్ణ తెలిపారు. ఈ లెక్కలన్నీ కాగ్, ఆర్బీఐ ధృవీకరించినవేనని స్పష్టం చేశారు.కాగా, ఏపీ ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలోని సచివాలయ పబ్లిసిటీ సెల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని వివరించారు.
ఆర్బీఐ నివేదిక ప్రకారం రాష్ట్ర విభజన నాటికి(2014) ప్రభుత్వ అప్పులు రూ. 1,18,050 కోట్లు కాగా, 2019నాటికి రూ.2.71 లక్షల కోట్లకి అప్పు చేర్చిందని తెలిపారు. ఇక, 2023 మార్చి నాటికి ఏపీ అప్పులు రూ.4లక్షల కోట్లకు చేరుకున్నాయని వెల్లడించారు. టీడీపీ హయాంలో ప్రతీ ఏటా 20 శాతం అప్పు పెరగగా.. ఈ ప్రభుత్వంలో ఏటా పెరిగిన అప్పు 15.42 శాతం మాత్రమే అని పేర్కొన్నారు. ఏపీ రుణాలన్నీ ప్రస్తుత ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదని హితవు పలికారు. ఎఫ్ఆర్ఎంబీ నిబంధనల ప్రకారమే రుణాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ లెక్కలన్నీ కాగ్, ఆర్బీఐ ధృవీకరించినవేనని తెలిపారు.
విద్యుత్ డిస్కంల అప్పు విభజనకి ముందు రూ.2893 కోట్లు అయితే టీడీపీ హయాంలో రూ.21,541కోట్లకి పెరిగిందని, ఈ ప్రభుత్వంలో ఈ అప్పులు రూ.11,602 కోట్లకు అప్పులు తగ్గాయి. మొత్తం విద్యుత్ సంస్థల అప్పులు విభజన నాటికి 32,596.27 కోట్లు అయితే టీడీపీ హయాంలో రూ.91,137కోట్లకి పెరిగాయని.. ఇక, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.1,09,094 కోట్లకి మాత్రమే పెరిగాయని తెలిపారు.
విద్యుత్ పంపిణీ సంస్ధల అప్పులు గత ప్రభుత్వంలో 30.74 శాతం పెరిగితే ఈ ప్రభుత్వంలో 5.79 శాతం తగ్గాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనధికార అప్పులు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. రాజ్యాంగ విరుద్దంగా చట్ట విరుద్దంగా అప్పులు ఎలా చేయగలుగుతామని ప్రశ్నించారు. కేంద్ర పరిమితులకి లోబడే అప్పులు చేస్తామని, అన్ని నిబంధనలు పాటిస్తేనే బ్యాంకులు సైతం అప్పులు ఇస్తాయని తెలిపారు.
టీడీపీ ప్రభుత్వం ఏర్పడే నాటికి రూ.1,53,346 కోట్ల అప్పులు 2019 నాటికి రూ.4,12,288 కోట్లకి పెరిగాయని టీడీపీ ఐదేళ్ల కాలంలో రూ.2,58,941 కోట్లు అప్పులు చేశారని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో అప్పులు పెరగలేదని టీడీపీ హయాంలో రుణం 7.45% పెరిగినప్పుడే ఆర్బీఐ హెచ్చరించలేదని, ఇప్పుడు అంతకన్నా తక్కువ ఉన్న 5.21% రుణానికి ఆర్బీఐ ఎందుకు హెచ్చరిస్తుందని అన్నారు.