Suryaa.co.in

Editorial

జగన్‌పై కాంగ్రెస్‌.. ‘షర్మిల బాణం’!

– త్వరలో ఏపీ కాంగ్రెస్‌కు షర్మిల ఎంట్రీ
– ఏపీ స్టార్‌ క్యాంపెయినర్‌గా షర్మిల ఖరారు
– అధ్యక్ష పదవి వార్తలు ఉత్తివే
– ఖరారు చేసిన కాంగ్రెస్‌ నాయకత్వం
– ఏపీ కాంగ్రెస్‌ నేతలకు స్పష్టం చేసిన ఖర్గే
– నేడు పార్టీలో చేరే అవకాశం?
– దళిత, గిరిజన, సీమ జిల్లాలలో షర్మిల ప్రచారం
– ఎస్సీ-ఎస్టీలకు చేరువకావడమే కాంగ్రెస్‌ వ్యూహం
– పోయిన ఓటు బ్యాంకు రాబట్టుకోవడమే లక్ష్యం
– సీటు రాని వైసీపీ సిట్టింగుఎమ్మెల్యే లపై దృష్టి
– వారిని షర్మిల ద్వారా కాంగ్రెస్‌లో చేర్పించే వ్యూహం
– సీమ జిల్లా వైసీపీ అసంతృప్తులపై వల
– ప్రజాఉద్యమాలపై దృష్టి సారించాలని ఆదేశించిన ఖర్గే
– కర్నాటక, తెలంగాణ కాంగ్రెస్‌ నేతల ప్రచారం
– ఏపీకి రావాలని ఆహ్వానించిన పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు
– సోనియా, రాహుల్‌, ప్రియాంక, ఖర్గే రావాలని అభ్యర్ధన
– ఈసారి సభలో కాలుబెట్టడమే కాంగ్రెస్‌ లక్ష్యం
– ఢిల్లీలో ఏపీ నేతలతో ఖర్గే భేటీ మతలబు ఇదే
( మార్తి సుబ్రహ్మణ్యం)

అనుకున్నదే జరుగుతోంది. ఎన్నికల ముందు ఏపీ రాజకీయాలు అనూహ్య మలుపు తిరగనున్నాయి. వైసీపీ అధినేత-ఏపీ సీఎంపై కాంగ్రెస్‌ పార్టీ సరికొత్త బాణం సంధించనుంది. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల, ఏపీ కాంగ్రెస్‌లో ఇకపై కీలక పాత్ర పోషించనున్నారు. ఆమె స్టార్‌ క్యాంపెయినర్‌గా ఏపీలో అడుగుపెట్టనున్నారు. అంటే జగనన్నపై కాంగ్రెస్‌ విడిచిన బాణంగా మారనున్నారు. బహుశా ఆమె కాంగ్రెస్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రేపు కాంగ్రెస్‌లో చేరవచ్చంటున్నారు. షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.

ఆ మేరకు కాంగ్రెస్‌ నాయకత్వం ఏపీ నాయకులకు, స్పష్టమైన సంకేతాలు పంపింది. తాజాగా ఢిల్లీలో పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఏపీ కాంగ్రెస్‌ సీనియర్ల సమావేశంలో, ఆమేరకు షర్మిల రాకను నిర్ధారించారు. అయితే ఆమె ఎప్పటినుంచి రంగంలోకి దిగుతారన్నది మాత్రం స్పష్టం చేయలేదు. అధ్యక్ష పదవి కాకుండా.. పార్టీకి జీవం పోసే స్టార్‌ క్యాంపెయినర్‌ పాత్రను షర్మిల పోషించనున్నట్లు సమాచారం.

‘నేను షర్మిలను. జగనన్న విడిచిన బాణాన్ని’ అని.. పాదయాత్ర, గత ఎన్నికల ప్రచారంలో సగర్వంగా చాటుకున్న షర్మిల.. ఇప్పుడు అదే జగనన్నపై కాంగ్రెస్‌ విడిచిన బాణంగా మారనున్నారు. అంటే.. ‘నేను మీ షర్మిలను. కాంగ్రెస్‌ విడిచిన బాణాన్ని’ అని అంతే సగర్వంగా చాటబోతున్నారు. తాజా పరిణామాలు వీటినే స్పష్టం చేస్తున్నాయి. ఆమె కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా ఏపీలో రంగప్రవేశం చేయనున్నారు.

తాజాగా ఢిల్లీలో కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఏపీ సీనియర్‌ నేతల సమావేశంలో, ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సీడబ్ల్యుసీ సభ్యుడు రఘవీరారెడ్డి, పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ, మాజీ ఎంపి చింతామోహన్‌ తదితర నేతలు హాజరైన ఈ భేటీ ఆసక్తికరంగా సాగింది.

రాష్ట్రంలో జగన్‌ సర్కారు అనుసరిస్తున్న విధానాలు, దానివల్ల ఇబ్బందిపడుతున్న వర్గాలు, జగన్‌ సర్కారుకు ఏయే వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి? 90 మందికి సీట్లు నిరాకరించిన వైనం, దానిపై వైసీపీలో పెరుగుతున్న అసమ్మతి, గతంలో ఎస్సీ,ఎస్టీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు, గత ఎన్నికల్లో సాధించిన ఓట్ల వివరాలపై చర్చించినట్లు సమాచారం. వైసీపీ అసమ్మతిని సొమ్ము చేసుకునే బాధ్యతను షర్మిలకు అప్పగించినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెఎస్‌ చీఫ్‌ గిడుగు రుద్రరాజు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరిని ఖర్గే దృష్టికి తీసుకువెళ్లారు. తన వద్ద ఉన్న ప్రణాళిక వివరించారు. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి సారించడం ద్వారా, కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి సాధించాలన్నది తన లక్ష్యమని వివరించారు. గిడుగు ఆలోచనను ఖర్గే కూడా అభినందించారు.

తెలంగాణ-కర్నాటక ముఖ్యమంత్రులను ఏపీ ప్రచారానికి రావాలని తాను ఇప్పటికే ఆహ్వానించానని, వారితోపాటు ఆయా రాష్ర్టాల మంత్రులు కూడా తరచూ ఏపీలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే.. క్యాడర్‌లో ఉత్సాహం పెరగడంతోపాటు, ప్రజలు కూడా పార్టీ వైపు చూస్తారని విశ్లేషించారు. అదేవిధంగా సోనియా, రాహుల్‌, ప్రియాంకతోపాటు మీరు కూడా రావాల్సిన అవసరం ఉందని గిడుగు అభ్యర్ధించగా, తప్పకుండా వస్తామని ఖర్గే హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ-ఎస్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు ఉండేదని, వైసీపీ రాకతో దానిని ఆ పార్టీ పూర్తిగా కొల్లగొట్టిందని పార్టీ నేతలు ఖర్గే దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పుడు దళిత-గిరిజన వర్గాలపై విపరీతమైన దాడులు జరుగుతుండటం, అందులో వైసీపీ నేతలే ముద్దాయిలుగా ఉండటంతో, వారంతా వైసీపీకి దూరమవుతున్నారని విశ్లేషించారు. ఆ స్థానాన్ని తిరిగి భర్తీ చేయాలంటే 31 రిజర్వుడు నియోజకవర్గాలపై పూర్తి స్థాయి దృష్టి సారించాలని స్పష్టం చేశారు.

దానితో జోక్యం చేసుకున్న ఖర్గే.. ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేక ప్రణాళికలతో వెళ్లాలని, అక్కడ ప్రజాసమస్యల పరిష్కారం కోసం తరచూ ఉద్యమాలు చేయాలని సూచించినట్లు తెలిసింది. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రధాన సమస్యల పరిష్కారం కోసం, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. వాటికి జాతీయ నేతలను పంపిస్తామని ఖర్గే హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును… ఇండియా కూటమిలో చేరాలని నాయకత్వం ఆహ్వానిస్తే బాగుంటుందని, ఒక సీనియర్‌ నేత సూచించినట్లు సమాచారం.

ఇక వైఎస్‌ కూతురు, ఫైర్‌బ్రాండ్‌ షర్మిల ఏపీ కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషిస్తారని, నాయకత్వం స్పష్టమైన సంకేతాలిచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆమెకు స్టార్‌క్యాంపెయినర్‌ బాధ్యతలు ఇచ్చి, పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజుతో సమన్వయం చేసుకోనున్నారు. ఆమె ప్రధానంగా 31 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలపై దృష్టి సారించేలా పార్టీ ప్రణాళిక రూపొందిస్తోంది.

వాటితోపాటు కడప-కర్నూలు-అనంతపురం-చిత్తూరు జిల్లాల్లోని వైసీపీ అసమ్మతి నేతలను, కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చే బాధ్యతను కూడా షర్మిలకు అప్పగించినట్లు సమాచారం. ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో ఆమెకు కర్నాటక నుంచి ఎంపీ సీటు ఇచ్చేందుకు, గతంలోనే సూత్రప్రాయ ఒప్పందం జరిగిందన్న వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.

ప్రధానంగా వైసీపీ అధినేత జగన్‌..దాదాపు 90 మంది సిట్టింగు ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించే అవకాశం ఉన్నందున, వారిని కాంగ్రెస్‌లో చేర్పించి టికెట్లు ఇప్పించే బాధ్యత కూడా, షర్మిలకే అప్పగించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కడప జిల్లాలో వైసీపీ వెంట ఉన్న రెడ్డి సామాజికవర్గం.. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లోని దళిత-గిరిజనులను తిరిగి కాంగ్రెస్‌ వైపు మళ్లించడమే షర్మిలకు కాంగ్రెస్‌ నాయకత్వం అప్పగించిన అసైన్‌మెంట్‌గా కనిపిస్తోంది.

షర్మిలకు వైసీపీ నేతలతో కుటుంబసంబంధాలు కూడా ఉన్నందున, వైసీపీ నేతలను కాంగ్రెస్‌ వైపు తీసుకురావడంలో ఆమె సక్సెస్‌ అవుతారని, నాయకత్వం కూడా నమ్ముతున్నట్లే కనిపిస్తోంది. ఆమెతో సీమలోని నాలుగు జిల్లాల్లోని రెడ్లను కాంగ్రెస్‌ లోకి తీసుకురాగలిగితే, ఏపీలో ఓటు బ్యాంకు గణనీయంగా పెరుగుతుందన్నది నాయకత్వ అంచనాగా కనిపిస్తోంది. ఇక రిజర్వుడు నియోజకవర్గాల నుంచి గెలిచి, ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో కాలుపెట్టాలన్నదే కాంగ్రెస్‌ అసలు లక్ష్యంగా కనిపిస్తోంది.

ఈ క్రమంలో వైసీపీ ఓటు బ్యాంకు దారుణంగా దెబ్బతినే ప్రమాదం లేకపోలేదని, రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తనకు దళిత-గిరిజనుల మద్దతు ఉందని తరచూ ఎమ్మెల్యేలు, మంత్రులకు చెప్పే జగన్‌ భరోసా… చెల్లి షర్మిల రాకతో కుప్పకూలే అవకాశాలు కనిపిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే.. ఇప్పటివరకూ వైసీపీకి దన్నుగా ఉన్న క్రైస్తవ-దళిత క్రైస్తవులు, పూర్తి స్థాయిలో కాంగ్రెస్‌ కొల్లగొడితే, వైసీపీ దారుణంగా దెబ్బతినే ప్రమాదం లేకపోలేదని విశ్లేషిస్తున్నారు.

LEAVE A RESPONSE