వైసీపీ గ్రౌండ్‌లో అంబటి హిట్ వికెట్

– వైసీపీకి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు
– ఇటీవలే పార్టీలో చేరిన రాయుడు
– అంబటిని ‘ఆడుదాం ఆంధ్రా’కు దూరంగా పెట్టిన జగన్
-గుంటూరు ఎంపీ టికెట్ నో చెప్పిన జగన్
– అందుకే వైసీపీకి రాజీనామా
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎన్నికల ముందు వైసీపీ గ్రౌండ్ ప్లే క్రమంగా ఖాళీ అవుతోంది. ఒక్కొక్కరూ శరవేగంగా పెవిలియన్ నుంచి.. అసలు అటుంచి అటే ఏకంగా జట్టుకే దూరమవడం వైసీపీ కెప్టెన్ జగన్‌ను కలవరపెడుతోంది. జగనన్న కెప్టీన్సీని భరించలేని వారంతా గ్రౌండ్ నుంచి శరవేగంగా బయటకు పరుగులు తీస్తున్న పరిస్థితి. ఆ పరుగుల పరంపరలో భాగంగా… తాజాగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా హిట్ వికెట్ అయ్యారు.

జగన్ సర్కారు సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై వైసీపీలో చేరుతున్నానంటూ.. వారం రోజుల క్రితమే వైసీపీలో చేరిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, ఊహించనివిధంగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి, వైసీపీ కెప్టెన్‌పై బౌన్సర్ వేశారు. కొద్దికాలం తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఏ పార్టీలోనూ చేరబోనని ప్రకటించారు. అంటే జగనన్న కెప్టెన్సీ ప్రభావం ఆయన రాజకీయ జీవితంపై ఏ స్థాయిలో ప్రభావితం చేసిందో అర్ధమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

వైసీపీలో చేరిన వారంరోజుల్లోనే.. రాజీనామా చేసి వెళ్లిపోవడం ఆ పార్టీలో ఇదే ప్రధమం.ఇది జగన్‌కు వజ్రాఘాతమేనన్నది సుస్పష్టం. జాతీయ స్థాయిలో కీర్తిప్రతిష్ఠలున్న క్రికెటర్ అంబటి రాయుడు, కోటి ఆశలతో.. రాజకీయ ఆకాంక్షతో వైసీపీలో చేరారు. నిజానికి ఆయన పార్టీలో చేరకముందే, జగన్‌ను ఆకాశానికెత్తేశారు. యువతరానికి మార్గదర్శి అని కొనియాడారు. వారం క్రితమే ఆయన వైసీపీ కండువా కప్పేసుకున్నారు.

ఆ తర్వాత జగన్ ప్రారంభించిన ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమానికి, అంబటిని కావాలనే దూరంగా ఉంచారు. అంబటి హాజరైతే.. ఆ కార్యక్రమానికి వచ్చే మైలేజీ అంతా ఆయనకే వెళుతుందని, జగన్ ప్రేక్షకుడవుతారన్న ముందుచూపుతో, రాయుడును వ్యూహాత్మకంగా దూరంగా పెట్టారు. దానితో రాయుడు మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు.

కాగా కాపు సామాజికవర్గానికి చెందిన అంబటి రాయుడు, వైసీపీలో నిజానికి గుంటూరు ఎంపీ సీటు ఆశించారు. అయితే గుంటూరు సీటు ఇచ్చేది లేదని జగన్ నిర్మొహమాటంగా చెప్పడంతో, రాయుడు తన రాజకీయ భవిష్యత్తుపై ఆలోచనలో పడ్డారు. నర్సరావుపేట ఎంపి లావు కృష్ణదేవరాయల్‌ను గుంటూరుకు పోటీ చేయమని జగన్ సూచిస్తున్నారు.
అయితే ఆయన తనకు గుంటూరు వద్దని, నర్సరావుపేటలోనే పోటీ చేస్తాననడంతో గుంటూరు సీటు పెండింగ్‌లో పడింది.

దానితో వైసీపీలో ఉన్నందున వల్ల ప్రయోజనం లేదని గ్రహించిన రాయుడు.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనితో జగన్ మనస్తత్వం తెలిసిన వారెవరూ, ఆయనతో ఎక్కువకాలం కలసి నడవరన్న మాట ప్రచారం నిజం చేసినట్టయింది.

Leave a Reply