Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ పాలనలో కష్టాలు మొదలు

– తలసాని శ్రీనివాస్ యాదవ్

కాంగ్రెస్ ప్రభుత్వ వంద రోజుల పాలనలో ఆదర్శవంతమైన పాలన అందించిన తెలంగాణ ప్రభ్యత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి గా కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిపారని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజులలో విద్యుత్, నీటి కష్టాలు మొదలయ్యాయని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం మరిచిందని విమర్శించారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, కార్యకర్తలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, పార్లమెంట్ ఎన్నికలలో సమిష్టిగా పని చేసి సికింద్రాబాద్ నియోజకవర్గ అభ్యర్థి పద్మారావు గౌడ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని అన్నారు.

బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం ప్రజల తోనే ఉంటుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా త్రాగునీటిని సరఫరా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు పంపుతుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీలను వంద రోజులలో అమలు చేస్తామని చేయలేదని, పార్లమెంట్ ఎన్నికల అనంతరం ప్రజల పక్షాన ప్రభుత్వం పై బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాడతామని హెచ్చరించారు.

LEAVE A RESPONSE