– పార్టీ, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా
– ఈవారంలో టీడీపీలో చేరిక
– అవమానాలే కారణం
(అన్వేష్)
హిందూపురం: వైనాట్ 175.. మేమంతా సిద్ధం నిదానంతో ఎన్నికలకు వెళుతున్న వైసీపీ అధినేత జగన్కు, పోలింగు ముందురోజుల్లో వరస వరస వెంట ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మాజీ మంత్రులు పార్టీకి పోటీ పడి మరీ గుడ్ బై చెబుతున్నారు. తాజాగా ఆ జాబితాలో వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ ఐపిఎస్ అధికారి ఇక్బాల్ చేరారు.
గత కొద్దిరోజుల నుంచి హిందూపురంలో సొంత పార్టీ నేతలే తనను అవమానిస్తున్న తీరును భరించలేక, ఆ పార్టీకి- శాసనసభ్యత్వానికీ రాజీనామా చేసి వైసీపీకి షాక్ ఇచ్చారు. ఆ మేరకు ఆయన పార్టీ అధినేత-సీఎం జగన్, శాసనమండలి చైర్మన్కు లేఖ రాశారు. నిజానికి ఇక్బాల్ గత ఎన్నికల్లో బాలకృష్ణపై పోటీచేసి ఓడిపోయారు. అయినా అక్కడే ఉండి పార్టీ బాధ్యతలు చూశారు. ఆ తర్వాత ఆయనకు పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఆయనను తప్పించి దీపిక అనే మహిళకు ఆ బాధ్యతలు అప్పగించారు. పైగా హిందూపురంలో ఆయన మాట చెల్లకుండా, మంత్రి పెద్దిరెడ్డి చక్రం తిప్పారన్న విమర్శలు కూడా లేకపోలేదు. దీనితో మనస్తాపం చెందిన ఇక్బాల్ పార్టీకి రాజీనామా చేశారు.
కాగా ఆయన ఈవారంలో చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇక్బాల్ రాజీనామాతో, వైసీపీకి హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో మైనారిటీలు దూర మయ్యే ప్రమాదం ఏర్పడింది. ప్రధానంగా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో, ముస్లింలు అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం.