– తెలంగాణలో చెరో 8 సీట్లు గెలిచిన బీజేపీ, కాంగ్రెస్
– ఆశించినరీతిలో కనిపించని ‘హస్త’వాసి
– షెడ్డుకెళ్లిన ‘కారు’
– డిపాజిట్లు దక్కని బీఆర్‌ఎస్ విషాదం
– మోదీ ప్రభంజనంతోనే ‘కమలవికాసం’
– అభ్యర్ధులపై వ్యతిరేకత ఉన్నా మోదీతో గెలిచిన వైనం
– మహబూబ్‌నగర్‌లో బీజేపీ ‘అరుణ’పతాక
– సొంత జిల్లాలో రేవంత్ రెండో ఓటమి
– మల్కాజిగిరిలోనూ గెలవని కాంగ్రెస్
– మెజారిటీవీరుడిగా రఘువీర్‌రెడ్డి
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణలో హోరెత్తించిన పార్లమెంటు ఎన్నికలు రెండు జాతీయ పార్టీలకు సమాన సంతృప్తిని ఇచ్చాయి. కాంగ్రెస్-బీజేపీ అభ్యర్ధులు చెరో 8 స్థానాలు సాధించగా, యధావిధిగా మజ్లిస్ తన హైదరాబాద్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లు.. ఈ ఫలితాలతో బీఆర్‌ఎస్ ‘కారు’ షెడ్డుకు వెళ్లక తప్పనిసరి పరిస్థితి సృష్టించింది. ‘నువ్వు మగాడివైతే ఒక్క స్థానంలో గెలువు’ అన్న రేవంత్ సవాల్‌కు, కేసీఆర్ ఫలితాల్లో జవాబివ్వలేకపోయారు. రెండు స్థానాలు మినహా, మిగిలిన అన్ని స్థానాల్లో ధరావతు దక్కని దయనీయం ఆ పార్టీకి సొంతమైన విషాదం. తాను ప్రధాని రేసులో ఉన్నానని సగర్వంగా ప్రకటించుకున్న కేసీఆర్‌కు, తాజా ఓటమి ఫలితాలు వజ్రాఘాతమే. అటు సీఎం రేవంత్ కూడా, తన సొంత గడ్డపై రెండోసారి ఓడిన చేదు అనుభవం. తాజా ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి బీజేపీ అభ్యర్ధి డికె అరుణ అనూహ్య విజయం సాధించగా.. తెలుగురాష్ట్రాల్లోనే అత్యధిక మెజారిటీ సాధించిన వీరుడిగా.. నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్ధి రఘువీర్‌రెడ్డి రికార్డు సృష్టించారు. ఈ ఫలితాలతో ఇక తెలంగాణలో పోటీ.. రెండు జాతీయ పార్టీలకే పరిమితమయ్యే సంకేతాలు స్పష్టం చేశాయి.
తెలంగాణలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 10-12 స్థానాలు సాధించాలన్న అధికార కాంగ్రెస్ పార్టీ కోరిక నెరవేరలేదు. అదే సంఖ్యపై కన్నేసి ప్రముఖులను ప్రచారబరిలోకి దించిన బీజేపీకి సైతం, పూర్తి స్థాయి సంతృప్తి దక్కలేదు. ఓటర్లు ఎవరికీ సంపూర్ణ స్థానాలు కట్టబెట్టకుండా చెరో ఎనిమిది స్థానాలు ఇచ్చి, ఇద్దరినీ సంతృప్తి పరిచారు.
కాంగ్రెస్ పార్టీ 10 నుంచి 12 స్థానాలు సాధించాలని సర్వశక్తులూ ఒడ్డినప్పటికీ.. 8 స్థానాలతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. నల్లగొండలో కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్‌రెడ్డి 5,59,905 మెజారిటీ ఘన విజయం సాధించి, తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక మెజారిటీ సాధించిన ఎంపీగా రికార్డు సృష్టించారు. ఖమ్మంలో రఘురామిరెడ్డి, మహబూబాబాద్‌లో బలరాం నాయక్, వరంగల్‌లో కడియం కావ్య, భువనగిరిలో చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ, నాగర్‌కర్నూల్‌లో మల్లు రవి, జహీరాబాద్‌లో సురేష్ షెట్కార్ విజయం సాధించారు.
అటు బీజేపీలో మల్కాజిగిరి అభ్యర్ధి ఈటల రాజేందర్ 3,91,4753 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. కరీంనగర్‌లో బండి సంజయ్ 2,25,209 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి 49,944 ఓట్లు, నిజామాబాద్‌లో ధర్మపురి అర్వింద్ 1,09,241 ఓట్లు, ఆదిలాబాద్‌లో నాగేష్ 90,652 ఓట్లు, మెదక్‌లో రఘునందన్‌రావు 39,139 ఓట్లు, మహబూబ్‌నగర్‌లో డికె అరుణ 4,500 ఓట్లు, చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి 1,72,897 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఇక బీఆర్‌ఎస్ ఖమ్మంలో మాత్రమే గట్టి పోటీ ఇవ్వగలిగింది. బీఆర్‌ఎస్ అభ్యర్ధి నామా నాగేశ్వరరావు రెండోస్థానంలో నిలిచారు. ఆ తర్వాత మహబూబాబాద్‌లో కవిత మాత్రమే పోటీ ఇవ్వగలిగారు. నాగర్ కర్నూలులో ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ 3.2 లక్షల ఓట్లు సాధించగలిగారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌కు ధరావతు దక్కకపోవడమే విషాదం. కేసీఆర్,కేటీఆర్, హరీష్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత పార్లమెంటు నియోజకవర్గాలలో కూడా, పార్టీని గెలిపించుకోలేకపోవడం గమనార్హం.
జగన్ రికార్డు బద్దలు కొట్టిన రఘువీర్‌రెడ్డి
కాగా ఈ ఫలితాల్లో బ్రహ్మాండమైన రికార్డు ఒకటి కాంగ్రెస్ సొంతం కావటం విశేషం. నల్లగొండ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి, ఈ ఎన్నికల్లో తెలుగురాష్ట్రాల్లోనే అత్యధిక మెజారిటీ సాధించిన ఎంపీగా రికార్డు సృష్టించారు. 2011లో జగన్ కడప ఎంపీగా సాధించిన 5.43 లక్షల ఓట్ల మెజారిటీని, రఘువీర్‌రెడ్డి బద్దలుకొట్టారు. ఆయన 5,59,905 లక్షల మెజారిటీతో నల్లగొండను కొల్లగొట్టారు. నిజానికి రఘువీర్ తొలి నుంచీ గెలుపుపై కాకుండా.. జగన్ మెజారిటీని బద్దలు కొట్టడంపైనే దృష్టి సారించారు. ఆమేరకు ఆయన నియోజకర్గాల వారీగా ప్రత్యేక వ్యూహం అనుసరించారు. పార్లమెంటు పరిథిలో ఒకటి మినహా, మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండటం ఆయనకు కలసివచ్చింది. దానికితోడు తండ్రి జానారెడ్డి వ్యూహరచన, ఆయనకు మిగిలిన పార్టీలో ఉన్న గౌరవాభిమానాలు కూడా, రఘువీర్‌రెడ్డికి తెలుగు రాష్ట్రాల్లోనే అధిక మెజారిటీ వచ్చేందుకు కారణమయింది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక మెజారిటీ సాధించిన యంగ్‌టర్క్‌గా రఘువీర్ లోక్‌సభలో అడుపెట్టనున్నారు. రఘు.. ఆల్‌దిబెస్ట్!
రేవంత్‌కు వరసగా రెండో ఓటమి
కాంగ్రెస్ పార్టీని 8 స్థానాల్లో గెలిపించిన సీఎం రేవంత్‌రెడ్డి.. తన సొంత జిల్లాల్లో చిరకాల రాజకీయ ప్రత్యర్ధి డికె అరుణ గెలవకుండా అడ్డుకోలేకపోయారు. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికలో చివరకు బీజేపీ అభ్యర్ధి ‘అరుణ’ పతాకం ఎగురవేశారు. ఇది రేవంత్‌కు వ్యక్తిగతంగా ఓటమి కిందే లెక్క. అటు నాగర్‌కర్నూలులో మల్లు రవిని గెలిపించుకున్న రేవంత్, ఇటు మహబూబ్‌నగర్‌లో మాత్రం పార్టీ అభ్యర్ధి వంశీచంద్‌రెడ్డిని మాత్రం గెలిపించుకోవడంలో విఫలమయ్యారు. రెండురోజుల క్రితమే మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా, కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిన సంగతి తెలిసిందే. తాజా ఎంపీ ఎన్నికల్లో వంశీచంద్ ఓటమితో.. రేవంత్ ఖాతాలో రెండవ పరాజయం నమోదయిన ట్టయింది.