పక్కదారిపట్టిన స్టీల్, సిమెంట్
ఎమ్మెల్యే ఏం చేస్తారో?
(సుబ్బారావు)
అవనిగడ్డ: గత ప్రభుత్వంలో జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాల పేరిట జరిగిన అనేక అవినీతి, అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా అవనిగడ్డ నియోజకవర్గంలో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు అధికారుల బాధ్యత రాహిత్యంతో లబ్ధిదారులు నిండా మునిగిపోయారు. నియోజవర్గంలోని కొన్ని జగనన్న కాలనీల్లో జరిగిన అవినీతి మరెక్కడా జరగలేదు. అధికారుల నిర్లక్ష్యంతో అనేక తప్పులు జరిగాయి.
పలుచోట్ల గృహ నిర్మాణాల బాధ్యతను స్వయంగా తీసుకున్న అధికారులు సక్రమంగా పనులు చేయించకపోవడంతో ఎక్కడికక్కడ గృహ నిర్మాణాలు అగిపోయి ఉన్నాయి. లక్షలాది రూపాయల విలువ కలిగిన ప్రజాధనం నిర్లక్ష్య పూరితమైన వైఖరి కలిగిన కొందరు అధికారుల కారణంగా దారి మళ్ళిపోయింది. గత ప్రభుత్వంలో అప్పటి ప్రజా ప్రతినిధుల ఉదాసీన వైఖరి అవినీతికరమైన అధికారులకు వరంగా మారితే, లబ్ధిదారులకు శాపంగా మారింది.
నూతన ప్రభుత్వంలో అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన మండలి బుద్ధ ప్రసాద్ దృష్టికి హౌసింగ్ అక్రమాలు అనేకంగా వస్తూనే ఉన్నాయి. జగనన్న కాలనీల్లోని లబ్ధిదారులు తమకు జరిగిన మోసాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునేలా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ దృష్టి సారించారు.
అవనిగడ్డ నియోజకవర్గంలో హౌసింగ్ శాఖ ద్వారా జరిగిన అక్రమాలు ఒక్కొక్కటి గమనిస్తే అధికారుల నిర్లక్ష్యానికి, కొందరి అవినీతికి ప్రత్యక్ష తార్కాణాలుగా నిలుస్తాయి. అసలు మంజూరు కూడా లేనివారు గృహాలు నిర్మించుకున్నారు. వారికి బిల్లులు ఏ విధంగా వస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇళ్ళు కట్టిస్తామని లబ్ధిదారుల వద్ద నుంచి డబ్బులు పోగేసిన కొందరు అధికారులు ఆ ఒప్పుకున్న ఇళ్లను కూడా పూర్తిస్థాయిలో నిర్మించకుండా బిల్లులు మాత్రం పూర్తిస్థాయిలో పొందినట్లు వెలుగులోకి వస్తోంది.
తాము ఒప్పుకున్న లబ్ధిదారులకు చెందిన మెటీరియలును స్వంతం చేసుకొని, దారి మళ్లించి సొమ్ము చేసుకున్న వైనాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
ప్రభుత్వ సొమ్ము దోపిడీకి ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలను కొందరు అధికారులు సద్వినియోగం చేసుకొని ప్రజాధనాన్ని విపరీతంగా దోచుకుని నిరుపేద లబ్ధిదారులను మోసం చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చి జగనన్న కాలనీల్లో నేడు వందలాది ఇళ్ళు ఫౌండేషన్ స్థాయిని కూడా దాటకుండా చేశాయి.
కోడూరు మండలంలో మూడు వేల బస్తాల సిమెంటు, ఇరవై టన్నుల స్టీలు దారిమళ్ళినట్లు తెలుస్తోంది.అవనిగడ్డ మండలంలో వెయ్యి సిమెంట్ బస్తాలు, 15 టన్నుల స్టీలు దారి మళ్ళినట్లు తెలుస్తోంది.ఘంటసాల మండలంలో నాలుగు వేల బస్తాల సిమెంటు, యాభై టన్నుల స్టీలు దారి మళ్ళినట్లు తెలుస్తోంది.చల్లపల్లి మండలంలో రెండు వేల బస్తాల సిమెంటు, నలభై టన్నుల స్టీలు దారి మళ్ళినట్లు తెలుస్తోంది.నాగాయలంక మండలంలో వెయ్యి బస్తాల సిమెంటు, పది టన్నుల స్టీల్ దారి మళ్ళినట్లు తెలుస్తోంది.మోపిదేవి మండలంలో 500 బస్తాల సిమెంటు, పది టన్నుల స్టీల్ దారి మళ్ళినట్లు తెలుస్తోంది.
ఇంకా లెక్కలోకి రాని, లబ్ధిదారులకు చేరని మెటీరియల్ ఇంకెన్ని లక్షల మేరకు దోపిడీకి గురైందో అంతులేని, అంతు చిక్కని వ్యవహారంగా మారిపోయింది. గృహ నిర్మాణ శాఖను ఆసరాగా చేసుకుని అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా సరే పట్టుకొని వారి నుంచి ప్రభుత్వ ధనాన్ని రికవరీ చేసి లబ్ధిదారులకు చేర్చి ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగేలా చూడాలని నియోజకవర్గ ప్రజలు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో జరిగిన హౌసింగ్ అవినీతి అక్రమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి సమర్థవంతమైన విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడిన వారిపై గట్టి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.