– మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్ : ప్రొఫెసర్ జయశంకర్ కలలుగన్న ప్రజా తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమవుతుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ 90వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన పోరాడిన తీరును మంత్రి కొండా సురేఖ స్మరించుకున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కాంక్షను ప్రజల్లో రగిలించి, తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా యువతను పోరుబాట పట్టించిన జయశంకర్ సార్ కు తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతస్థానం ఉంటుందని మంత్రి తెలిపారు. జయశంకర్ ఆశయ సాధన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి, వారి అభ్యున్నతికి అంకితభావంతో పనిచేస్తుందని మంత్రి అన్నారు. నియంతృత్వ పాలనలో తల్లడిల్లిన తెలంగాణకు నూతన జవసత్వాలు కల్పిస్తామని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.