-సమస్యలు పరిష్కారం అయితే ఉపాధ్యాయులు- ఉద్యోగులు నిరంతరం ఎందుకు నిరసనలు ప్రకటిస్తున్నట్లు?
-హరీష్ రావు ని టార్గెట్ గా చేసి మాట్లాడడం సరికాదు
-ఇలాంటి ప్రకటనలు చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు
-ఏపీ ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి- ఉద్యోగులకు ఎలాంటి కోపం లేదు
-బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నాం
-తెలంగాణ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు దేవీ ప్రసాద్
ఇటీవల ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఏపీ ఉద్యోగుల సమస్యలపై స్పందించిన తీరు పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రులు రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటీవల ఉపాధ్యాయ సంఘం సమావేశంలో హరీష్ రావు ప్రసంగిస్తూ ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో మెరుగైన వేతనాలు పొందుతున్నారని పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితిని వివరిస్తే దానిని రాద్ధాంతం చేయడం హాస్యాస్పదం.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఎనిమిది సంవత్సరాల కాలంలో పే రివిజన్ ద్వారా 73% (43 + 30 )సాధిస్తే ఆంధ్రప్రదేశ్లో కేవలం 66% మాత్రమే (43 + 23 )ఇచ్చింది వాస్తవం కాదా ?.తొలిసారి ఉద్యోగులకు ఉద్యమ చరిత్రలోనే మద్యంతర భృతి 27% కంటే తక్కువగా 23% తీసుకున్నది నిజం కాదా, దీనికి బాధ్యత సంఘాలకు నాయకత్వం వహించిన నాయకులదా ప్రభుత్వాన్నదా ఉద్యోగ సంఘ నాయకులు స్పష్టం చేయాలి.
దీనివలన భవిష్యత్తులో ఉద్యోగుల మీద ప్రభావం ఎంత ఉంటుందో ఆలోచించాలి ఏపీ ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగులకు ఎలాంటి కోపం లేదు. కేవలం రెండు రాష్ట్రాల ఉద్యోగుల సమస్యల్ని పరిశీలించి చేసిన ప్రకటనగానే భావించాలి. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయులపై ఉద్యోగులపై అనుసరించిన నిర్బంధ కాండను ఇతర సంఘ నాయకులు సభలో మాట్లాడిన సందర్భంలో ఉదాహరిస్తూ, దాని ఆధారంగా హరీష్ రావు మాట్లాడుతూ ఏపీ కంటే తెలంగాణలో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని అనడం నేరం చేసినట్టుగా భావించి ఉద్యోగ సంఘ నాయకుడు ఖండించడం ఏ మేరకు న్యాయము వివరించండి.
అనేకమంది ఏపీ ఉద్యోగ సంఘ నాయకులు ఇటీవల చేసిన ప్రకటనలో ఉన్న సారాంశాన్ని మంత్రి ఉదాహరించారు. ఏపీలో అన్ని సమస్యలు పరిష్కారం అయితే ఉపాధ్యాయులు ఉద్యోగులు నిరంతరంగా ఎందుకు నిరసనలు ప్రకటిస్తున్నట్లు, చలో విజయవాడ మరియు ఇటీవల సిపిఎస్ ఉద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును అన్ని రాష్ట్రాల ఉద్యోగులు నిరసించారు. హరీష్ రావు మొదటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఉద్యోగ పక్షపాతిగా నిలబడిన విషయం అందరికీ తెలిసిందే.
తమ సమస్యల పరిష్కారం కోసం తామే స్పందిస్తామని ఎవరు స్పందించాల్సిన అవసరం లేదని ప్రకటించడం కార్మిక ఉద్యోగ వ్యతిరేక భావాలకు నిదర్శనం.ఉద్యోగుల సమస్యల కోసం దేశవ్యాప్తంగా అనేక సందర్భాలలో ఉద్యోగులు కలిసి పోరాడడం స్పందించడం మద్దతుగా ప్రదర్శనలు చేయడం, చరిత్రలో అనేక సందర్భాలలో చూసింది వాస్తవం కాదా?
దేశవ్యాప్త ఉద్యోగ సంఘాలలో భాగమై ఐక్య ఉద్యమాలు చేస్తున్న తరుణంలో మా గురించి ఎవరూ మాట్లాడవద్దని అనడం భావ దారిద్యానికి నిదర్శనం.ఆంధ్రప్రదేశ్ మంత్రులు అంబటి రాంబాబు అమర్నాథ్ చేసిన ప్రకటనలు మరీ విడ్డూరంగా ఉన్నాయి. కేసీఆర్ తో హరీష్ రావు సమస్యలు ఎదుర్కొంటున్నాడని, అందులో భాగంగానే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ప్రకటించడం మూర్ఖత్వం. హరీష్ రావు ని టార్గెట్ గా చేసి మాట్లాడడం సరికాదు. ఇలాంటి ప్రకటనలు చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదని హెచ్చరిస్తున్నాం …తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా పనిచేసే కీలక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ నాయకత్వం పట్ల ఇలాంటి ప్రకటనలు చేస్తే తిప్పికొడతామని హెచ్చరిస్తున్నాం. ఏపీ ఉద్యోగులు హరీష్ రావు వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకొని భవిష్యత్తులో స్పందించాలని కోరుతున్నాం.