Suryaa.co.in

Telangana

రేవంత్.. ఇవిగో ఆధారాలు.. దమ్ముంటే చర్యలు తీసుకోండి

– ఈ కంపెనీలపై చర్యలు తీసుకోండి
– బడా కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
– ఫాతిమా కాలేజీ నిర్మాణం చేపడితే ఎందుకు కూల్చడం లేదు?
– ఫాతిమా కాలేజీకి నోటీసులు ఇచ్చారా లేదా?
– ఫాతిమా కాలేజీకి ఒక న్యాయం.. పేదలకు మరో న్యాయమా?
– హైడ్రాపై ఎంఐఎం పార్టీ ఒత్తిడి
– బీఆర్‌ఎస్ హయాంలో 25 చెరువులు కట్టబెట్టిన కంపెనీల జాబితా విడుదల చేసిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
– దమ్ముంటే వాటిపై చర్యలు తీసుకోవాలని సవాల్

హైదరాబాద్: రాష్ట్రంలో హైడ్రా పేరుతో హడావుడి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పేదలు, మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తోంది. నిజంగా హైడ్రాకు, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నాలాలు, చెరువులను కబ్జాల చెర నుంచి విడిపించడానికి ప్రయత్నం చేయాలి.

కబ్జాలకు పాల్పడి చెరువులను ఆక్రమించుకున్న కట్టడాలను కూల్చితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, రాష్ట్రంలో హైడ్రా పేరుతో జరుగుతున్న తంతు చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

2022 లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద, చెరువుల సుందరీకరణ పేరుతో హైదరాబాద్ లో 25 చెరువులను బడా కంపెనీలకు ధారదత్తం చేసింది. వివిధ కంపెనీలకు చెరువులను కట్టబెట్టింది. వివిధ కంపెనీలు ఆయా చెరువుల కబ్జాలకు పాల్పడి ఎఫ్టీఎల్ పరిధిలోకి చొచ్చుకొచ్చాయి. ఇంకొన్నేమో బఫర్ జోన్ వదలకుండానే నిర్మాణాలు చేపట్టి, రూ.వందల కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టాయి.

నానక్ రామ్ గూడలో మీనాక్షి ఇన్ ఫ్రా స్ట్రక్చర్ వద్ద చెరువుల్లో మధ్య నుంచి రోడ్డు నిర్మించి, బహుళ అంతస్థుల కట్టడాలు నిర్మించి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. వంశీరామ్ బిల్డర్స్ పేరుతో అనేక నిర్మాణాలు చేపట్టారు.

సల్కం చెరువులో అక్రమంగా ఎంఐఎం కి సంబంధించిన ఫాతిమా కాలేజీ నిర్మాణం చేపడితే ఎందుకు కూల్చడం లేదు..?
ఫాతిమా కాలేజీకి నోటీసులు ఇచ్చారా లేదా..? హైడ్రా అధికారులు సమాధానం చెప్పాలి.

ఎంఐఎం పార్టీ చెరువులను కబ్జా చేసినా, నిర్మాణాలు చేపడితే రాష్ట్ర ప్రభుత్వం కనీసం వారి దరిదాపుల్లోకి కూడా వెళ్లేందుకు ధైర్యం చేయడం లేదు.కేవలం పేదలను, మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బంది పెట్టాలనుకోవడం సబబు కాదు.ఎంఐఎం పార్టీకి చెందిన ఫాతిమా కాలేజీకి ఒక న్యాయం.. పేదలకు మరో న్యాయమా..?

హైడ్రాపై ఎంఐఎం పార్టీ ఒత్తిడి తీవ్రమైనట్లు అనుమానం తలెత్తుతున్నది. హైడ్రా కమిషనర్ తో పాటు సంబంధిత అధికారులను కూడా మార్చే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఎంఐఎంకు తలొగ్గి కాంగ్రెస్ పాలన చేస్తున్నది.

హైదరాబాద్ నగరంలో 25 చెరువులు వివిధ వ్యాపారస్తులు, కంపెనీల ఆధీనంలోకి వెళ్లాయి. గత ప్రభుత్వం వేలకోట్ల రూపాయల విలువ గల ప్రభుత్వ భూములు, చెరువులకు ఎఫ్టీఎల్ లు ఫిక్స్ చేసి బడా వ్యాపారస్తులకు కట్టబెట్టింది.

ఇరిగేషన్ అధికారులకు సంబంధం లేకుండా, చెరువులకు ఎఫ్టీఎల్ పరిధిని ఫిక్స్ చేసి వివిధ కంపెనీలకు అనుమతులు ఎలా జారీ చేస్తారు.. అక్రమంగా ఆక్రమణలకు పాల్పడి, చెరువులను కబ్జా చేసి వేల కోట్ల రూపాయలు వ్యాపారాలు చేస్తున్న బడా కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం ఎందుకు.?

నగరంలోని 25 చెరువులే కాకుండా నిజాం నుంచి ఇప్పటివరకు ఆక్రమణకు గురైన భూముల వివరాలకు సంబంధించి చాలా రికార్డులు మాయమయ్యాయి. ప్రభుత్వ భూములు, చెరువుల ఆక్రమణలపై హైడ్రా కమిషనర్ ని కలిసి ఫిర్యాదు చేస్తాం.. న్యాయం చేయకపోతే హైకోర్టును ఆశ్రయిస్తాం. ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో జరిగిన చెరువుల ఆక్రమణల గోల్ మాల్ వ్యవహారంపై సమీక్ష జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంపెనీలకు చెరువులను కట్టబెట్టిన 25 చెరువుల వివరాలు:

శేరిలింగంపల్లి (గోపి చెరువు) -అరబిందో, నానక్ రాంగూడ (భగీరథమ్మ) -మీనాక్షి ఇన్ఫాస్ట్రక్చర్స్, మూసాపేట (మైసమ్మ చెరువు) – వాసవి, ఇబ్రహీంబాగ్ (ఇబ్రహీంబాగ్ చెరువు) – సైబర్ మియాడోస్, నానక్ రాంగూడ (నానక్ రాంగూడ చెరువు) – జయభేరి ప్రాపర్టీస్, చందానగర్ (గంగారాం చెరువు) -శర్వాణి వెంచర్స్ అండ్ ఎవెన్యూస్, మదీనాగూడ (మదీనాగూడచెరువు) -ఇండిస్ స్మార్ట్ హోమ్స్ ప్రై.లిమిటెడ్, కొండాపూర్ (మజీద్ బండ లేక్) -సుమధుర ఇన్సాకాన్ ప్రై.లిమిటెడ్, ఖానామెట్ ( ముల్లకత్వ చెరువు) -మహిరా వెంచర్స్ ప్రై.లిమిటెడ్, పటాన్ చెరువు (సకి చెరువు) – ఇన్కార్ లేక్ సిటీ ప్రాజెక్ట్స్, పటాన్ చెరువు (తిమ్మక చెరువు) -ఏపీఆర్ ప్రాజెక్ట్స్, గోపన్ పల్లి(చిన్న పెద్ద చెరువు) -హానర్ ఎస్టేట్ ప్రై.లిమిటెడ్, హైదర్ నగర్ (ఎల్లమ్మ చెరువు) – భవ్య కన్ స్ట్రక్షన్, నానక్ రాంగూడ (విప్రో లేక్) -వంశీరాం బిల్డర్స్, కూకట్ పల్లి (కూకట్ పల్లి లేక్) -నయాన్ కన్ స్ట్రక్షన్, ఖాజాగూడ(ఎల్లమ్మ చెరువు) – నిహారిక ప్రాజెక్ట్స్, ఖానామెట్ (మొండికుంట) -వాసవి హోమ్స్, యాప్రాల్ (యాప్రాల్ లేక్) -జీకే కన్ స్ట్రక్షన్, సఫిల్ గూడ (సఫిల్ గూడలేక్) -జైన్ కన్ స్ట్రక్షన్, కూకట్ పల్లి (ఐడీఎల్ చెరువు) -గోల్ఫ్ ఆయిల్ లిమిటెడ్, మన్సూరాబాద్ (పెద్దచెరువు) -గ్రీన్ లీవ్స్ ఇన్ఫా, గుట్టలబేగంపేట చెరువు -అయ్యన్న ఫౌండేషన్, మదీనాగూడ (రామసముద్రం) -వెర్టెక్స్ హోమ్స్.

LEAVE A RESPONSE