Suryaa.co.in

Andhra Pradesh

3 నెలల్లో 400 కొత్త బస్సులు కొన్న ఘనత కూటమి సర్కారుది

– భవిష్యత్తులో వినుకొండలో అతిపెద్ద మోడ్రన్ బస్టాండ్
– రెండు కొత్త బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

వినుకొండ: అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆర్టీసీకి 400 కొత్తబస్సులు కొన్ని ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. కొత్త బస్సులతో పాటు బస్టాండ్‌ల ఆధునీకరణపై కూడా దృష్టి పెట్టి ప్రజారవాణకు కొత్తరూపు కల్పిస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే ముఖ్యంగా రాయలసీమకు ముఖద్వారంగా ఉన్న వినుకొండ ఆర్టీసీ డిపోను అన్ని హంగులతో ఆధునికంగా తీర్చిదిద్దబోతున్నామన్నారు. వినుకొండ ఆర్టీసీ డిపో పరిధిలో వినుకొండ-హైదరాబాద్ సూపర్ లగ్జరీ, వినుకొండ-విజయవాడ ఎక్స్‌ప్రెస్ బస్సులు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీలో నూతన శకం ప్రారంభమైందని అందుకు తగినట్టే ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ అధికారులను కోరారన్నారు. గత వైకాపా ప్రభుత్వం ఒక్క బస్సు కొనుగోలు చేయలేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే వందలాది ఆధునాతన సౌకర్యాలున్న బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెట్టడం మార్పుకి నిదర్శనమన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో నిత్యం ప్రయాణించే 40 లక్షలమందికి డొక్కు బస్సులు తిప్పి ప్రయాణికుల ముప్పు తిప్పలు పెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

జగన్ హయాంలో రద్దు చేసిన పల్లెవెలుగు సర్వీసుల పునరుద్ధరణతో పాటు కొత్తసర్వీసులతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. సీతారాంపురం తండాకు బస్సు సర్వీసును ఏర్పాటు చేశామన్నారు. పేదలకు ఎక్కడ బస్సు సర్వీసు అవసరమైతే అక్కడ ఆర్టీసీ సేవలను మెరుగ్గా అందిస్తామన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తూ సంస్థను లాభాలబాట పట్టించాలని కోరారు. ప్రయాణికులకు బ్రహ్మాండమైన సౌకర్యాలు ఉండే విధంగా మోడరన్ బస్టాండ్‌ నిర్మాణాన్ని చేపడతామని ప్రకటించారు. ఇప్పటికే ఆ విషయమై రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డితో మాట్లాడానని, ఆయన కూడా సూచనప్రాయంగా ఒప్పుకున్నారని, కచ్చితంగా బస్టాండ్ నిర్మాణం చేపడదామన్నారు.

అనంతరం డిపో మేనేజర్‌ కోటేశ్వరరావు నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక వినుకొండ డిపోకు 16 కొత్త బస్సులు వచ్చాయన్నారు. 7 సూపర్ లగ్జరీలు, 6 ఎక్స్‌ప్రెస్‌లు, 3 పల్లె వెలుగు బస్సులు అందించారన్నా రు. ఇంద్ర బస్సులు కూడా వచ్చాయని, రిజిస్ట్రేషన్ పూర్తికాక గ్యారేజీలో ఉన్నాయని, త్వరలో వాటిని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇంకా కొన్ని కొత్త బస్సులు రావాల్సి ఉందని, 15 ప్రైవేట్ బస్సులు రావాలని, ఈ నెలాఖరు నాటికి అవీ సేవల్లోకి వస్తాయన్నారు. కొత్తబస్సుల రాకతో ఇకపై విజయవాడకు 15 నిమిషాల కాల వ్యవధితో దాదాపు 31 బస్సులు తిప్పడానికి అవకాశం ఉందన్నారు.

స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సహకారంతో డిపోను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్యే ప్రోత్సాహకంతో నూతన బస్టాండ్ నిర్మాణం కూడా జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పఠాన్ అయిబ్ ఖాన్, పత్తి పూర్ణచందర్రావు, పెమ్మసాని నాగేశ్వరరావు, సౌదాగర్ జానీ భాష, చికెన్ బాబు, గోల్డ్ కరిముల్ల, బోడెపుడి రామారావు, పలు ఆర్టీసీ యూనియన్ లు నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE