-
ప్రతి హ్యాబిటేషన్ కు మంచినీరు అందించేందుకు కృషి చేస్తున్నా
-
ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు
ఉండి: నియోజకవర్గ పరిధిలో కాలువలు, డ్రైన్లు, రోడ్ల ఆక్రమణను అరికట్టి గత వంద రోజులలో క్రమబద్ధీకరించేందుకు కృషి చేసినట్లు శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అలాగే ప్రతి హ్యాబిటేషన్ కు డిసెంబర్ నాటికి తాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు.
ఉండి, పాలకోడేరు ప్రభుత్వ పాఠశాలను దాదాపుగా 80 లక్షల రూపాయలు వెచ్చించి పునర్ నిర్మించినట్లుగా వెల్లడించారు. ఉండిలో ఆక్రమణకు గురై పిచ్చి మొక్కలు పెరిగి ఉన్న పార్కును స్థానికుల సహకారంతో ఆక్రమణలను తొలగించి, 40 రోజుల వ్యవధిలోను సుందరమైన పార్కుగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే జిల్లా కలెక్టర్ తో సమావేశమై సాగునీరు, తాగునీరు, డ్రైన్ల సమస్య చాలా తీవ్రంగా ఉందని, ఈ సమస్యలను పరిష్కరిస్తే రైతులతోపాటు ఆక్వా రైతులు, సాధారణ ప్రజలు సంతోషిస్తారని జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు.
అయితే ఈ సమస్యల పరిష్కారానికి తాము ఏమీ చేయలేమని జిల్లా యంత్రాంగం పేర్కొనడం జరిగిందన్నారు. గతంలో ఉమ్మడి జిల్లాకు ఐదు కోట్ల రూపాయల కేటాయించినట్లుగా వివరించారని తెలిపారు. అయితే ఈ సమస్యల పరిష్కారానికి సహకరించడంతోపాటు, తాము సొంతంగా పనులు చేసుకోవడానికి క్లియరెన్స్ ఇవ్వాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని కోరడం జరిగిందన్నారు. డ్రైనేజీ పనులను చేపట్టడానికి కలెక్టర్ తన ప్రత్యేక నిధులనుంచి పది లక్షల రూపాయలు కేటాయించారని, నేను వ్యక్తిగతంగా 10 లక్షల రూపాయలు, నా స్నేహితులతో మాట్లాడి ఇప్పటివరకు ఖర్చైనా నాలుగు కోట్ల రూపాయలను సేకరించడం జరిగిందన్నారు.
ఉండి నియోజకవర్గ పరిధిలో కాలువలను వెడల్పు చేయడంతో పాటు కొన్ని చోట్ల డ్రైన్ల పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇంతలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి డ్రైన్ల పనులను చేపడతామని పేర్కొన్నారన్నారు. కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదని వెల్లడించారు.. రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ఉండకపోతే, ఈపాటికి డ్రైన్లలలో కూడా పూడికతీత చేపట్టి ఉండే వాళ్లమని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
డ్రైన్ల పునరుద్ధరణ పనులను పర్యవేక్షించడానికి లబ్ధిదారులైన రైతులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కు సూచించినట్లుగా రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. డ్రైన్ల పూడికతీత పనులు కాంట్రాక్టర్ సక్రమంగా చేపట్టకపోతే, లబ్ధిదారులైన 10 గ్రామాల రైతులు కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తారని, టెండర్ లో పేర్కొన్న విధంగా పనులు చేపట్టిన తర్వాతే బిల్లులు ఇవ్వాలని సూచించడం జరిగిందన్నారు.
టెండర్ పిలిచిన ఖర్చులు 50% మొత్తానికే పనులు పూర్తవుతాయని, అయితే బలవంతంగా పనులు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. టెండర్ లో పేర్కొన్నట్లుగా కాంట్రాక్టర్ తన పనిని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు.
పంట కాలువలను క్లీన్ చేశాం… డ్రైన్లలో పూడిక తీశాం
పంట కాలువలను క్లీన్ చేశామని, డ్రైన్లలో కొన్నిచోట్ల పూడిక తీశామని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ప్రభుత్వం డ్రైన్లలో పూడిక తీసేందుకు ముందుకు వస్తే రైతులను ఇన్వాల్వ్ చేసి వాటిని పూర్తి చేస్తామన్నారు. పరిమళ వద్ద మంచినీటి ప్రాజెక్టును గతంలో 19 కోట్ల రూపాయల అంచనా తో ప్రారంభించి 18 కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. అయితే ఈ ప్రాజెక్టును రాంగ్ గా డిజైన్ చేయడం జరిగిందని, కాలువలలో పైప్ లైన్ వేశారన్నారు. దీనికి తోడు కమిషన్ల కోసం సమస్య ఎదురై, ఈ ప్రాజెక్టు మూలన పడిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
తాగునీటి ప్రాజెక్టు కోసం 60 లక్షలు మంజూరైనప్పటికీ వాటిని విడుదల చేయడం లేదని వెల్లడించారు. ఒక కోటి రూపాయలు ఖర్చు చేస్తే, ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని 60 లక్షల రూపాయల పోను 40 లక్షల రూపాయలను ఉండి నియోజకవర్గ అభివృద్ధి ఫండ్ నుంచి ఖర్చు చేయాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. అందుకే పరిమళ తాగునీటి ప్రాజెక్టు పనులను వెంటనే చేపట్టడం జరిగిందని వివరించారు. పరిమళ వద్ద కీకారణ్యమైన పరిస్థితి నెలకొనగా, దాన్ని శుభ్రపరిచి, కాలిపోయిన మోటార్ల స్థానంలో కొత్త మోటార్లను బిగించి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు.
పరిమళ వాటర్ లైన్ ట్రయల్ ప్రారంభించగా కాలువలలో పనులు చేసేటప్పుడు పైపులైన్లను పీకి వేయడం వల్ల కొత్త సమస్య ఏర్పడిందన్నారు. పైప్ లైన్లు లేని చోట నూతన పైప్ లైన్లను బిగించి, ట్రయల్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. మరో నెల రోజుల వ్యవధిలో ప్రాజెక్టును అప్పగిస్తానని కాంట్రాక్టర్ పేర్కొన్నారని, నెల రోజులు కాకపోతే 45 రోజులలోనైనా పరిమళ వాటర్ లైన్ పూర్తవుతుందన్నారు. డిసెంబర్ నాటికి 50 హ్యాబిటేషన్లకు తాగునీరు అందిస్తామని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
కాళ్ల మండలంలో గుండాడ దగ్గర ఉన్న ప్లాంట్ ను కేవలం 30 శాతం మాత్రమే వినియోగిస్తున్నారని, మిగిలిన సామర్థ్యాన్ని ఉపయోగించడం లేదన్నారు. చెరువులో నీటిని నింపుకుంటే వేసవిలోనూ తాగునీటి కొరత ఉండదన్నారు. జల జీవన్ మిషన్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రతి ఇంటికి మంచినీరు అందించడం జరుగుతుందన్నారు.
తుగ్లక్ పని చేసిన గత ప్రభుత్వం
మంచినీటి పైప్లైన్ పనులను చేపట్టడానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాక పోవడంతో గత ప్రభుత్వం ఒక తుగ్లక్ పని చేసిందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. 18 కోట్ల రూపాయల అంచనాలతో కూడిన పైప్లైన్ పనులను డ్వాక్రా గ్రూపులకు అప్పగించడం జరిగిందన్నారు. డ్వాక్రా గ్రూపుల మహిళలు సాధారణంగా కుట్లు అల్లికల వంటి పనులు మాత్రమే చేపడతారని, ఈ ఐడియా ఇచ్చిన వారిని తన్నాలన్నారు.
డ్వాక్రా మహిళలతో బుద్ధున్న వారెవరైనా 18 కోట్ల రూపాయల పైప్ లైన్ పనులు చేయిస్తారా అంటూ ప్రశ్నించారు. ఇదే విషయమై పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆఫీసులోని అసిస్టెంట్ కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని, పవన్ కళ్యాణ్ కు కూడా వినతి పత్రాన్ని ఇచ్చినట్లుగా తెలిపారు. రెండు రోజుల వ్యవధిలో ఇదే విషయమై పవన్ కళ్యాణ్ తో సమావేశం కానున్నట్లు వెల్లడించారు.
పైప్ లైన్ పనులను కాంట్రాక్టర్ కు ఇస్తే, వాటిని పర్యవేక్షిస్తూ సకాలంలో పూర్తి చేయించడం జరుగుతుందన్నారు. కాళ్ళ, పాలకోడేరు మండలాలకు మంచినీటి సరఫరా కోసం ఒక ప్రణాళికను చేపడుతున్నట్లుగా వివరించారు. 18.5 కోట్లతో పైప్ లైన్ చేపట్టే పనులను మంత్రి పవన్ కళ్యాణ్ ఆమోదిస్తే, కచ్చితంగా ఆమోదిస్తారన్న విశ్వాసం నాకు ఉందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో 200 రోజులు అయ్యేటప్పటికీ, మంచినీటి సమస్యను పూర్తిగా పరిష్కరించడం జరుగుతుందని వెల్లడించారు.
కాలువలను ఆక్రమించిన వారిలో 90 శాతం మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు
కాలువలను ఆక్రమించి ఇళ్లను నిర్మించుకున్న వారిలో 90 శాతం మందికి ఇప్పటికే ఇళ్ల స్థలాలను ఇచ్చారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఆకివీడులో పంట కాలువ 12 అడుగులు ఉంటే దాన్ని రెండు నుంచి రెండున్నర అడుగులకు ఆక్రమణదారులు కుదించారన్నారు. పంట కాలువ పై 50 నుంచి 60 ఇళ్లను నిర్మించి, దాన్ని డ్రైన్ గా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
డ్రై ను పూర్తిగా కప్పెట్టేసి, దానిపై స్లాబ్ నిర్మించి ఇళ్లను కట్టుకున్నారన్నారు. బుడమేరు లాంటి పరిస్థితి తలెత్తకముందే మేల్కొని పంట కాలువలను, డ్రైన్ల ఆక్రమణలను తొలగించడం జరిగిందన్నారు. పంట కాలువలపై ఆక్రమణలను తొలగించాలని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. పంట కాలువలు, డ్రైన్లపై ఇండ్లను నిర్మించుకున్న వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక చేయూత అందే విధంగా కృషి చేయనున్నట్లు వెల్లడించారు.
నాడు నేడు పూర్తిగా ఫ్రాడ్
నాడు నేడు కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం పూర్తి అవినీతిమయమని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ఐదవ తరగతి వరకు ఉన్న స్కూళ్లలో కేవలం ఒక తరగతి గదిలో బల్లాలను, బెంచీలను ఏర్పాటు చేసి, వైసీపీ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం ఉండి నియోజకవర్గ పరిధిలోని ఏ స్కూల్లో నాడు నేడులో భాగంగా ఏర్పాటుచేసిన బెంచీలు, బల్లాలు కనిపించడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతం పెరగాలంటే కాస్ట్ టు కాస్ట్ తో రవాణా సౌకర్యాన్ని కల్పించాలని సూచించారు. ఇదే విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు.