-
వైసీపీని వీడుతున్న మాజీ ఎమ్మెల్యేలు
-
బాలినేని వెంట మాజీ మంత్రి రజని, శిల్పా?
-
మాజీ ఎమ్మెల్యేలు ఉదయభాను, కేతిరెడ్డి, మద్దిశెట్టి, కిలారి జంప్
-
జనసేనలో క్యూలు కడుతున్న వైసీపీ అగ్రనేతలు
-
జిల్లాల్లో ఖాళీ అవుతున్న వైసీపీ
-
జిల్లాల్లో ఊపిరాడని ఫ్యాను
( మార్తి సుబ్రహ్మణ్యం)
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఇది జగన్ మాజీ సీఎంగా మారినప్పటి నుంచి ఆయన నోటి నుంచి కొత్తగా వస్తున్న పదాలు. ఆ తత్వం తెలుసుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు.. అధికారంలో ఉన్న కూటమిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కూటమిలోని జనసేనలో చేరేందుకు వరస కడుతున్నారు.
టీడీపీలో చేరే అవకాశం లేని నేపథ్యంలో, ప్రత్యామ్నాయంగా జనసేనను ఎంపిక చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్ధుల చేతిలో ఓడిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు జనసేనలో చేరేందుకు క్యూలు కడుతున్నారు. చిరంజీవి, నాగబాబులతో మాట్లాడుకుని, తర్వాత జనసేన చీఫ్, ఉప ముఖ్యమంత్రి పవన్‌తో భేటీలవుతున్నారు. ఈ వరసలో మాజీ మంత్రులు కూడా ఉండటం విశేషం. దీనితో ఇక జిల్లాల్లో వైసీపీ ఖాళీ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది.
విశ్వసనీయసమాచారం ప్రకారం మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి వంటి కీలకనేతలు కూడా జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వీరంతా బాలినేని వెంట జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే చంద్రశేఖర్ కూడా జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆయన తన పదవికి రాజీనామా చేయకపోవచ్చంటున్నారు. బాలినేని వెంట ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు చేసే అవకాశాలున్నాయి.
‘గుడ్‌మార్నింగ్ ధవర్మవరం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పేర తెచ్చుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా జనసేనలో చేరనున్నారు. అధికారం పోయిన తర్వాత జగన్ తప్పులను ఎత్తిచూపిన ఇద్దరు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలలో ఆయనొకరు. కాపు సామాజికవర్గానికి చెందిన మాజీ విప్, వైసీపీ అధినేత జగన్‌కు సన్నిహితుడైన జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, తాజాగా పవన్‌తో భేటీ అయ్యారు. భానుకు కృష్ణా , ఉమ్మడి గోదావరి జిల్లా జనసేన బాధ్యతలు ఇచ్చే అవకాశాలున్నాయి.
కాగా ఆయన తర్వాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పవన్‌తో భేటీ అయ్యారు. ఉదయభానుకు కృష్ణాజిల్లా కాపుల్లో పట్టు ఉండగా, బాలినేనికి ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లా రెడ్లపై పట్టు, ఇమేజ్ ఉన్న విషయం తెలిసిందే. త్వరలో ఆయనకు పార్టీలో కీలకపదవి కూడా దక్కే అవకాశం లేకపోలేదు. వేలాదిమంది అనుచరులతో బాలినేని ఒంగోలు వేదికగా పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు.
ఇక పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, దర్శి మాజీ ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కిలారి రోశయ్య చేరితే, ఆయన మామ, వైసీపీ సీనియర్ నేత-కేంద్రమాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైసీపీలో కొనసాగుతారో, లేదో చూడాలి.
దీనితో ఆయా జిల్లాల్లో వైసీపీ ఖాళీ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఫలితంగా మళ్లీ కొత్త నాయకత్వం ఎంపికకు మరికొంత కాలం పడుతుంది. అధికారం కోల్పోయిన నేపథ్యంలో, కొత్తగా నియోజకవర్గ బాధ్యతలు తీసుకునే సాహసం ఎంతమంది చేస్తారన్నదే సందేహం. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా సరిగ్గా ఇదే పరిస్థితి కనిపించిన విషయం తెలిసిందే.