– మేధావులు ఎందుకు గోప్యంగా ఉంటారు?
– మేధావులు మౌనం గా ఎందుకు ఉండకూడదు?
-మేధావుల మౌనం సంఘానికి చేటు
(సూర్యనారాయణ నేమాని)
“మేధావి” అంటే.. సమాజ హితాన్ని వాస్తవిక దృష్టితో పరిశీలన చేసి తన విమర్శనాత్మక ఆలోచన, పరిశోధన లతో – ఉద్ధరించడానికి ప్రయత్నించేవాడు. సాధారణ సమస్యలకు పరిష్కారాలను ప్రతిపాదించే వ్యక్తి. సంస్కృతి ప్రపంచం నుండి వచ్చిన, సృష్టికర్తగా లేదా మధ్యవర్తిగా, మేధావులు రాజకీయాల్లో పాల్గొంటారు.
ఒక నిర్దిష్ట ప్రతిపాదనను సమర్థించడం లేదా అన్యాయాన్ని ఖండించడం, సాధారణంగా ఒక భావజాలాన్ని తిరస్కరించడం, ఉత్పత్తి చేయడం లేదా విస్తరించడం ద్వారా, మరియు విలువల వ్యవస్థను రక్షించడం ద్వారా ప్రశ్నిస్తూ ఉంటారు.
కుహనా మేధావులు అంటే.. కుహనా అంటే కపటం. మేధావుల ముసుగులో లోకాన్ని వంచించే వాళ్ళను కుహనా (కపట) మేధావులు అంటారు. వీరు విషయం తెలియక పోయినా, లోకం దృష్టిలో మహా మేధావులుగా ప్రకటించుకోవాలనే తాపత్రయం తో దుష్ట చర్యలకు పాల్పడుతూ ఉంటారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. వీరు స్వయం ప్రకటిత మేధావులు. వారే అధ్యక్షులు, వారే సమాజ సేవకులు. ఇలాంటి వారిని ఎక్కువగా టీవీ ప్రసంగాలలో చూస్తూ ఉంటాము. వీరివి ఏక పక్షంగా సాగే ప్రసంగాలు.
కుహనా=కపటత; కృత్రిమబుద్ధి, నటన; టక్కు, నకిలీ (Pretense, Sanctimoniousness, fake).
“కుహనావటునిఁ గనుఁగొని సభాసదులు, కనుఁగవల్ చిరుతలు గవియఁగఁ దిరుగ” అని బ్రాహ్మణ వేషంలో వచ్చిన వామనావతారము గురించి భాగవతంలో ‘కుహనా’ అనే పదాన్ని వాడడం జరిగింది.
కుహనా మేధావులు = మిథ్యాచారాది దంభముతో కూడిన కపటచర్యలు చూపించేవారు.
కుహనా రాజకీయం = మోసపూరిత బూటకపు రాజకీయం.
కుహన = కపట, మోస.
కుహన అనేది ‘కుం + హంతి’ నుండి ఏర్పడిన సంస్కృత పదం. కుం = భూమిని; హంతి = త్రవ్వునది.
భూమిని త్రవ్వునది ఎలుక. ఆ బొరియలలో నివాసం వుండేది పాము. ఎలుకను, పామును కూడ కుహన అని అంటారు.
మేధావులు ఎందుకు గోప్యంగా ఉంటారు? మేధావులు మౌనం గా ఎందుకు ఉండకూడదు?
నీ ఎదురింటాయనను రహస్య పోలీసులు పట్టుకొని పోయారు. నువ్వు నోరెత్తలేదు. నీ పక్కింటాయనను పట్టుకొని పోయారు. నువ్వు పట్టించుకోకుండా ఉన్నావు. నీ వెనకింటాయనను నిర్బంధించి తీసుకెళ్ళారు. నీకు తీరిక లేదు. నీకు కుటుంబంతో తీర్థయాత్ర ఏర్పాట్లు వంటివి తప్ప, అతని గురించి పట్టించుకోనే సమయం లేదు. ఇప్పుడు నీకోసం పోలీసులు వచ్చారు. అప్పుడు అడగడానికి ఎవరూ లేరు. అంటే నీకు సమాజ బాధ్యత లేదన్న మాట.
చదువుకున్నవారే మౌనంగా ఉంటే, ఇక మన మీద జరిగే అన్యాయాలను ఎదుర్కొనేవారు ఉంటారు? కొన్ని కొన్ని సార్లు ప్రభుత్వాలు కూడా మొసలి కన్నీరు కారుస్తూ, మనలను దండయాత్ర చేసే అవకాశాలు ఉంటాయి. కనుక ఎప్పుడో ఒకసారి మనం నోరువిప్పి మాట్లాడక తప్పదు. అప్పుడే ఈ మేధావులు తమ గోప్యతను విడిచిపెట్టి, సమాజ హితం కోసం గొంతెత్తి మాట్లాడాలి.
మేధావుల మౌనం సంఘానికి పెద్ద చేటును తెచ్చిపెడుతుంది. కొన్ని సార్లు చాలా ప్రభుత్వాలు, ఈ మేధావుల సలహాలను తీసుకుంటాయి. అలా వచ్చినవాటినే సంస్కరణలు అంటారు. వాటి ద్వారా ప్రజలు ఉద్ధరింపబడతారు.
మేధావికి మేధకుడు కు తేడా ఏమిటి?:
మేధావి అంటే మేధస్సు కలిగిన వాడు. తెలివైన వాడు అని అర్థం. మేధకుడు అన్న మాటను అమాయకుడు, బుద్ధిమాంద్యం కలవాడు అన్న అర్థాల్లో కొందరు రచయితలు వాడారు. కానీ దానికి నిఘంటు ప్రామాణ్యం లేదు. ఈ మాట ఏ ప్రామాణిక తెలుగు / సంస్కృత నిఘంటువుల్లోను కనిపించలేదు.
మేధావి అంటే తెలివి తేటలు ఉన్నవాడు. ఏ పని ఎట్లా చేయాలో ఒకరికి చెప్పగలిగిన వాడు. చక్కటి శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వాడు. మేదకుడు అంటే వయసు పెరిగినా బుద్ధి మాత్రం ఎదగనివాడు.. వెర్రిబాగుల వాడు. అమాయకుడు.
మేదకుడు అనాలి (ధ కాదు). దీనికి 1. కపటము లేనివాడు, 2. సాధువు, 3. వెర్రి బాగుల వాడు — అని శబ్దార్థ చంద్రిక అర్థం చెప్పింది.