Suryaa.co.in

Andhra Pradesh

ఒకేసారి 100 మందిపై కేసు నమోదు

-దేశంలో ఎక్కడా లేదు.. ఏపీలో నియంతృత్వం
-దీనిపై న్యాయబద్ధంగా పోరాడుతాం
– వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (లీగల్‌ వ్యవహారాలు) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

తాడేపల్లి: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తుంగలోకి తొక్కి, రాజ్యాంగ హక్కులను, చట్టాలను ఖాతరు చేయకుండా అన్యాయంగా, అకారణంగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై నమోదు చేస్తున్న కేసులను న్యాయబద్దంగా ఎదుర్కొంటామని వైయస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (లీగల్‌ వ్యవహారాలు) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ప్రకటించారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసులు అధికారుల్లో ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమన్న వారు, ఖాకీ దుస్తులు వేసుకున్నంత మాత్రాన చట్టానికి అతీతులేం కాదని తేల్చి చెప్పారు.

కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం పరిటాలకు చెందిన ఒక వాట్సప్‌ గ్రూప్‌లో ఉన్న 100 మందిపై ఒకేసారి కేసు నమోదు చేశారని, దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రూప్‌ అడ్మిన్‌తో పాటు, నాలుగు మండలాలకు చెందిన వారిని దారుణంగా వేధిస్తున్నారని వైయస్సార్‌సీపీ నేతలు వెల్లడించారు. వాట్సప్‌గ్రూప్‌ సభ్యులను సోషల్‌ యాక్టివిస్టులుగా ముద్ర వేసి అర్థరాత్రి సమయాల్లో స్టేషన్లకు పిలుస్తున్న పోలీçసులు వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ ఆదేశాలతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు.

డీజీపీకి ఆ దమ్ముందా: అరుణ్‌కుమార్‌
తప్పు చేసిన వారిని కచ్చితంగా శిక్షిస్తామని చెబుతున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు.. మరి టీడీపీ వాట్సప్‌గ్రూప్స్‌లో మాజీ సీఎం జగన్‌ ఫోటోలు మార్ఫింగ్‌ చేసి ఫేక్‌పోస్టుల పెడుతున్న వారిని స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపే దమ్ముందా? అని ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ సవాల్‌ చేశారు. అక్రమంగా నిర్బంధించి కుటుంబీకులకు ఆచూకీ కూడా తెలియకుండా క్షోభకు గురి చేస్తున్న పోలీసులు, చివరకు తమ పార్టీ నేతలకు కూడా సమాధానం చెప్పడం లేదన్న ఆయన, వాటన్నింటిపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు.

రాష్ట్రంలో అరాచక, రాక్షస పాలన:పొన్నవోలు
రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక, రాక్షస పాలన సాగుతోందని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. పాలనలో ఎక్కడా రూల్‌ ఆఫ్‌ లా కనిపించడం లేదని ఆరోపించిన ఆయన, తమ పార్టీ కార్యకర్తలను టార్గెట్‌ చేసి, అకారణంగా అన్యాయంగా పోలీస్‌ స్టేషన్లకు పిలిపించి చిత్రహింసలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏ కార్యకర్తను ఇబ్బది పెట్టినా, చట్టవిరుద్ధంగా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లినా, హింస పెట్టినా.. సహించేది లేదని, చట్టానికి వ్యతిరేకంగా పని చేసిన ప్రతి పోలీసు అధికారిపై చర్యలు తప్పవని పొన్నవోలు స్పష్టం చేశారు. తప్పు చేసిన పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని తేల్చి చెప్పారు. ఏ వ్యక్తి పైనా థర్డ్‌ డిగ్రీ ఉపయోగించే హక్కు పోలీసులకు లేదని, దాన్ని కాలరాసేలా ముందుకు వెళితే తాము తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

అన్యాయంగా కేసులు పెడితే బాధితులకు పార్టీ అండగా ఉంటుందని, లీగల్‌ టీమ్‌ సమర్థవంతంగా పని చేసి న్యాయం సమకూర్చుతుందని పొన్నవోలు భరోసా ఇచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికైనా సరే ఇబ్బంది కలిగితే పార్టీ ఆఫీసుకు సమాచారం అందించాలని కోరిన ఆయన, రాజ్యాంగ రక్షణ అన్ని పార్టీలకు ఉంటుందని, అధికార, విపక్ష పార్టీలకు హక్కులు, చట్టాలు సమానంగా పని చేస్తాయని గుర్తు చేశారు.

రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చిన పొన్నవోలు, రాజ్యాంగ పరమైన హక్కులు అందరికీ సమానంగా వర్తించేలా పార్టీ నిరంతరం పని చేస్తోందని అభయమిచ్చారు. సంఘటితంగా పోరాడి పార్టీని కార్యకర్తలు రక్షిస్తే, కార్యకర్తలను పార్టీ రక్షిస్తుందని చెప్పారు

LEAVE A RESPONSE