• నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు
• ఆరు నుండి తొమ్మిది మాసాల పాటు రాష్ట్రంలో నిర్వహించనున్న క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్
• రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా త్వరలోనే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ అధికారికంగా ప్రారంభం
• ముందస్తు జాగ్రత్తలు, పరీక్షల ద్వారా క్యాన్సర్ ను నివారించేందుకు అందరూ సహకరించాలి
• రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి: క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆరు నుండి తొమ్మిది మాసాల పాటు రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ ను నిర్వహించే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు.
గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న క్యాన్సర్ రోగులను దృష్టిలో పెట్టుకుని క్యాన్సర్ పై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో 2014 నుండి నవంబరు 7 న క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుచున్నదన్నారు. ముందస్తు జాగ్రత్తలు, పరీక్షల ద్వారా ఈ క్యాన్సర్ ను నివారించవచ్చన్నారు.
2022 లో గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ తన నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2 కోట్ల మంది క్యాన్సర్ మహమ్మారి భారిన పడుతున్నట్లు తెలిపిందన్నారు. క్యాన్సర్ క్రమంగా విస్తరించే దేశాల్లో చైనా ప్రథమ స్థానంలో, అమెరికా ద్వితీయ స్థానంలో మరియు భారత్ తృతీయ స్థానంలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
భారత దేశంలో కూడా ప్రతి ఏటా 14.10 లక్షల మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్నట్లు, వారిలో 9.10 లక్షల మంది మరణించడం జరుగుచునదన్నారు. అదే విధంగా మన రాష్ట్రానికి సంబందించి ఏటా 74 వేల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, వారిలో 40 వేల వరకు మరణించినట్లు ఈ నివేదికలో తెల్పడం జరిగిందన్నారు. దేశంలో సంభవించే క్యాన్సర్ వ్యాధుల్లో దాదాపు 70 శాతం వ్యాదులను తగు ముందుస్తు పరీక్షలు, జాగ్రత్తలతో నివారించ వచ్చన్నారు.
నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వారం ద్వారా సంభవించే ఈ క్యాన్సర్లలో దాదాపు 40 శాతం క్యాన్సర్ కేసులు పొగాకు, కైనీ లు నమలడం వల్ల, 20 శాతం కేసులు ఇన్పెక్షన్ వల్ల మరియు 10 శాతం కేసుల ఇతరత్రా కారణాల వల్ల సంభవిస్తున్నాయన్నారు. మహిళ్లలో రొమ్ము క్యాన్సర్ బారిన 27 శాతం మంది, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన 18 శాతం పడుతున్నాయని, ఈ క్యాన్సర్ పై సరైన అవగాహనతో ముందస్తు పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చన్నారు.
రాష్ట్రం నుండి ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు నుండి తొమ్మిది మాసాల పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన 3.94 కోట్ల మందికి నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలను వారి ఇళ్ల వద్దే ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు పైబడిన దాదాపు 2 కోట్ల మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్, 30 ఏళ్లు పైబడిన 1.63 కోట్లు మంది మహిళలకు వారికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ డ్రైవ్ లో ఆరోగ్య సిబ్బంది పూర్తి అవగాహనతో పనిచేయాలనే ఉద్దేశ్యంతో హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో వారికి ఇప్పటికే శిక్షణను ఇవ్వడం జరిగిందన్నారు. దాదాపు 18 వేల మంది ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నట్లు ఆయన తెలిపారు. వీరిలో 15 వేల మంది ఏఎన్ఎంలు, 3 వేల మంది కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్లు మరియు 125 మంది ఆంకాలజీ స్పెషలిస్టులు ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఈ డ్రైవ్ లో గుర్తించిన క్యాన్సర్ రోగులను రిఫరల్ ఆసుపత్రులకు పంపించి తగు వైద్య సేవలను అందజేయడం జరుగుతుందన్నారు. సమగ్ర ఆరోగ్య సర్వేలో భాగంగా ఈ డ్రైవ్ లో సుగర్, బి.పి., హీమోగ్లోబిన్ వంటి పరీక్షలను కూడా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో క్యాన్సర్ నివారణకై ఏడాదికి దాదాపు రూ.700 కోట్లను వెచ్చించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
ప్రభుత్వం నిర్వహించే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ ను రాష్ట్ర ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకుని క్యాన్సర్ రహిత రాష్ట్రాంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిదేందుకు సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్బంగా క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ కు సంబందించిన పోస్టర్లను, కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ సి.ఎస్. ఎం.టి.కృష్ణబాబు, కమిషనర్ వాకాటి కరుణ, వైద్య విద్య సంచాలకులు డా.నరసింహం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.