వరుణ్‌తేజ్ మట్కా సినిమా వస్తోంది. రతన్‌లాల్ ఖత్రీ జీవితం ఆధారంగా తీశారు. ఆ సినిమాలో ఏముందో నాకు తెలియదు. ఖత్రీ గురించి బాగా తెలుసు. ఎందుకంటే రాయలసీమ ప్రజల జీవితాల్లోకి సునామీలా వచ్చాడు. కొన్ని వందల ఆత్మహత్యలు, కొన్ని వేల మంది నేరస్తులు అయ్యారు. ఎవరీ ఖత్రీ?
1947, దేశంలోంచి ఒక ముక్కను బ్రిటీష్ వాడు కోసేశాడు. రక్తం కారుతున్న నేల నుంచి 13 ఏళ్ల కుర్రాడు బొంబాయికి వచ్చాడు. ఆకలి, పేదరికం, నేరం, దౌర్జన్యం కలిసిపోయిన నేల. బతకాలి, బతకాలంటే బలం వుండాలి. రకరకాల పనులు చేసాడు. కళ్యాణ్ అనే వాడి దగ్గర పనికి కుదురుకున్నాడు.
1962, బొంబాయిలో రెండు సముద్రాలున్నాయి. ఉప్పునీటి సముద్రం, కన్నీటి సముద్రం. బొంబాయి పొట్ట నిండా లక్షల మంది నూలు మిల్లుల కార్మికులు. ప్రపంచానికే వస్త్రాన్ని అందిస్తున్న బొంబాయిలో ఒంటిమీద బట్ట లేని వాళ్లు ఎందరో. ఏమున్నా, లేకపోయినా మనిషికి ఆశ వుంటుంది. ఆశ మీద జూదం ఆడేవాడే గొప్ప ఆటగాడు. వాడే గెలుస్తాడు. కళ్యాణ్‌కి ఆ రహస్యం తెలుసు.
అంతకు ముందు అతను కాటన్ మార్కెట్ రేట్ల మీద జూదం ఆడించేవాడు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచి కాటన్ ఓపెన్, క్లోజింగ్ రేట్లు వచ్చేవి. ఆ ధరల్ని కరెక్ట్‌గా ఊహించినవాడు విజేత. అయితే న్యూయార్క్ నుంచి ధరలు రావడం ఆగిపోయాయి. కొత్తది ఏదో కావాలి. ఒక మట్టి కుండ తర్వాతి రోజుల్లో వేలకోట్ల జూదానికి చిహ్నంగా మారుతుందని కళ్యాణ్‌కి తెలియదు.
వొర్లి ప్రాంతంలో కళ్యాణ్ మట్కా (మట్టి కుండ) ప్రారంభమైంది. ఒక కుండలో 0 నుంచి 9 వరకూ చీటీలు వుంటాయి. అందులోంచి రాత్రి 8 గంటలకి ఒక నంబర్ తీస్తారు అది ఓపెనింగ్. రాత్రి 11 గంటలకి ఇంకొక నంబర్ తీస్తారు క్లోజింగ్. రెండూ కలిస్తే బ్రాకెట్. ఓపెనింగ్‌కి , క్లోజింగ్‌కి రూపాయికి ఏడు రూపాయిలు. డబుల్ డిజిట్ తగిలితే రూపాయికి 70 రూపాయిలు. ఉదాహరణకి 1 ఓపెన్, 6 క్లోజ్ అయితే డబుల్ డిజిట్ 16.
కొత్త జూదం, తగిలితే 70 రెట్లు. వెర్రి మొదలైంది. కళ్యాణ్ దగ్గర పని చేస్తున్న రతన్ వయసు 28 ఏళ్లు. జీవితం అర్థమైంది. ఇంకా చాలా వుంది. గురువుకి మించిన శిష్యుడు కావాలంటే, గురువుకి నామం పెట్టాలి. కొత్త మట్కా మొదలైంది.
రూపాయికి 80 రూపాయిలు. కుండలో చీటీలు తీయరు. ప్లేయింగ్ కార్డ్స్‌తో ప్రజల సమక్షంలో తీస్తారు. తీసేది హిందీ సినిమా నటులు. ఆట మొదలైంది. ఆడడమే కష్టం. ఆడాలంటే ఆలోచన సరిపోదు. ఆయుధం కావాలి. మన గన్ గురి తప్పినా, ఎదుటి వాడికి గురి కుదిరినా ఆట అయిపోతుంది. అయితే ఖత్రీ గొప్ప ఆటగాడు.
1973, నేను సెవెన్త్ క్లాస్. అన్ని వూళ్లలో మట్కా విష జ్వరంలా వ్యాపించింది. ఊళ్లలో అరుగుల మీద మట్కా బీటర్లు. పట్టీలు రాసినందుకు 10 శాతం కమీషన్. రాయదుర్గంలో మట్కా కంపెనీలు ప్రారంభమయ్యాయి. పోలీసులకి ఇది కొత్త ఆదాయం. మట్కా నెంబర్ టైమ్‌కి రిసీవింగ్ చేసుకుని చెప్పినందుకు టెలీఫోన్ ఎక్స్ఛేంజ్ వాళ్లకి కూడా మామూళ్లు. లోడ్ ఎక్కువైతే బళ్లారికి నెంబర్ ట్రాన్స్ఫర్ చేస్తారు.
ఉదాహరణకి ఊరంతా కలిసి 27 అనే నెంబర్ మీద 2 వేలు ఆడితే , తగిలితే రూ.1.60 లక్షలు ఇవ్వాలి. అంత భారాన్ని చిన్న కంపెనీ మోయలేదు. అందుకని బళ్లారి పెద్ద కంపెనీకి ఫోన్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. అంతా నోటి మాట. మరుసటి రోజు ఆ నెంబర్ వస్తే మనిషిని పెట్టి బస్సులో డబ్బు పంపిస్తారు. రాకపోతే రూ.2 వేలు మనిషితో పంపాలి. మనీ ట్రాన్స్ఫర్ల కాలం కాదు. 75 పైసలకి ప్లేట్ భోజనం పెట్టే కాలం.
ప్రతి 100 మందిలో 98 మంది ఓడిపోయేవాళ్లు. ఇద్దరికి తగిలేది. ఊరంతా వాళ్ల గురించే. ఆ ఇద్దరే ఆదర్శం. ఒకసారి మునిప్రసాద్ అనే వాడికి రూ.80 వేలు తగిలింది. ఇది అత్యధిక మొత్తం. ఒకే నెంబర్ మీద వెయ్యి రూపాయిలు కాసాడు. వాడో హీరో. అతని దర్శనం కోసం తరలివచ్చారు. అదృష్ట దేవత గురించి ఒకటే కథలు.
మట్కా పిచ్చిలో మంచీచెడు లేకుండా పోయింది. అయ్యవార్లంతా చదువులు మానేసి నెంబర్ల వేటలో పడ్డారు. గ్రూపులుగా ఏర్పడి ఆడసాగారు. పిల్లలు కూడా ఇంట్లో ఇచ్చిన పది పైసలు చాక్లెట్ తినకుండా నంబర్ కట్టి స్లిప్ నిక్కర్లో దాచుకున్నారు.
రాత్రి 9 అయితే ఒకటే సందడి. టెలీఫోన్ ఎక్స్ఛేంజ్ దగ్గర కేకలు, అరుపులు. పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నా అడిగే వాళ్లు లేరు. వాళ్లు కూడా ఆడేవాళ్లు. కొంత మంది పోలీసులే మట్కా బీటర్ల అవతారం ఎత్తారు.
ఓపెనింగ్ నెంబర్ రాగానే క్లోజింగ్ హడావుడి. రాత్రి 11 గంటలకి నెంబర్ రాక కోసం సెకెండ్ షో థియేటర్లు కిటకిట. సినిమా నడుస్తూ వుండగానే నెంబర్ తెలిసిది. గెలిచిన వాళ్లు కేకలు, ఈలలు. ఓడిన వాళ్లు ఉసూరుమని ఇంటికి.
ఇప్పటి సాప్ట్వేర్లా మట్కా కూడా వెరీ మోడ్రన్. శని, ఆదివారాల్లో సెలవు. మట్కాకి పెద్ద సాహిత్యం వుండేది. ఆదివారం పొద్దున్నే బండిళ్ల కొద్ది చార్టులు దిగేవి. చిన్నచిన్న పుస్తకాలు వచ్చేవి. ఇదంతా బొంబాయి సరుకే. శాస్త్రజ్ఞులంతా చార్టులు ముందేసుకుని రన్నింగులు తీసేవాళ్లు. ఎవడి లెక్కలు వాళ్లవి. గతంలో వచ్చిన నెంబర్లకి రూట్ మ్యాప్ కనుక్కుని ఈ వారం వచ్చే నెంబర్లు చెప్పేవాళ్లు. కరెక్ట్‌గా చెప్పినోడు కింగ్. డబ్బులు, నగలు, భూములు మెల్లిగా మాయమవుతున్నాయి.
బొంబాయిలో పండిట్ అని ఒకడుండే వాడు. వాడు అతిపెద్ద జ్యోతిష్య శాస్త్రవేత్త. ప్రతివారం అదృష్ట సంఖ్యలతో ఒక బుక్లెట్ వేసేవాడు. దేశమంతా లక్షల్లో అమ్మేవాళ్లు. వెల రూపాయి. మా వూళ్లో బ్లాక్‌లో రెండు రూపాయిలు.
ఆంధ్రప్రభలో వచ్చే కార్టూన్లలో ఆ రోజు వచ్చే నెంబర్లు దాగుంటాయని ఎవరో కనిపెట్టారు. దాంతో జనం భూతద్దాలతో నెంబర్లు వెతికేవాళ్లు. సహజంగా ముక్కు 3 లాగా , చెవి 8 లేదా రెండులాగా వుండేవని అవి నమ్మి కట్టేవాళ్లు. చిలుక జ్యోతిష్కులు , చేతి సాముద్రికలు , చిన్న సైజు స్వాములు అందర్నీ నెంబర్ అడిగేవాళ్లు. కరెక్టయిన జ్యోతిష్యుడికి వీరతాడు.
సంవత్సర కాలంలో జనం దివాళా తీసారు. నాకు తెలిసిన వాళ్లే ఐదురుగురు ఆత్మహత్య చేసుకున్నారు. జైళ్లపాలయ్యారు. పల్లెల్లో భూములమ్ముకున్నారు. ఈ వ్యసనం ఎవర్ని వదల్లేదు. చివరికి గుడి పూజారులు కూడా పళ్లెంలోని చిల్లరతో నెంబర్లు ఆడేవాళ్లు.
ఆశ పతనం చేసింది. ఆశ పెట్టిన వాళ్లు లక్షాధికారులయ్యారు. మట్కా కంపెనీ యజమానులంతా తరువాతి రోజుల్లో రాజకీయ నాయకులయ్యారు. వాళ్ల వారసులు అనేక మందిని ఇప్పటికీ అసెంబ్లీలో చూడొచ్చు.
సినిమాల్లో తప్ప నేరుగా టెలిఫోన్ చూడని అజ్ఞాన కాలంలో దేశమంతటా సరైన టైమ్‌కి నెంబర్ని పంపించిన రతన్ ఖత్రీ నెట్వర్క్ ఏంటి? చిన్న స్లిప్ ఆధారంతో ఇంత పెద్ద జూదం ఎలా జరిగింది? ఖత్రీ పేరు నోరు తిరగక గ్రామీణ జనం కత్తెర అనేవాళ్లు. బొంబాయి మాఫియాలో ఈ కత్తెరకి పెద్ద కథే వుంది.
* * *
1964, కళ్యాణ్‌కి పోటీగా రతన్ మట్కా పెట్టిన తర్వాత జూదరులంతా ఇటువైపు వచ్చారు. అప్పటి వరకు జూదమంటే పేకాట క్లబ్స్, గుర్రపు పందేలు. 10 పైసలతో పిల్లలు, ఆడవాళ్లు, ముసలివాళ్లు ఎవరైనా ఆడే తొలి జూదం మట్కా మాత్రమే.
వొర్లితో ఆగకుండా బొంబాయి అంతా పాకుతున్న మట్కాను చూసి అందరూ ఉలిక్కి పడ్డారు.
మనం ఒక చట్ట వ్యతిరేక చర్య చేయాలంటే, చట్టాలు చేసేవాళ్లని, అమలు చేసేవాళ్లని జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయ నాయకులు, పోలీసులు ఖత్రీ పంపే డబ్బు మూటలకి కిక్కురుమనలేదు. మాఫియాలో నిచ్చెన మెట్లు వుండవు. శవాల మీద ఎక్కుతూ వెళ్లాలి. నోటి మాట మీద , చిన్న చీటీ ఆధారంగా జరిగే కోట్ల జూదంలో నమ్మక ద్రోహం జరగకూడదు. కానీ జరుగుతుంది. బొంబాయి సముద్ర జలాల మీద శవాలు కొట్టుకు వచ్చేవి.
అంతా తనదే అనుకున్న వాడు , ఒక రోజు ఏమీ లేకుండా పోస్టుమార్టం టేబుల్ మీద నిద్రపోతాడు. ఇది అండర్ గ్రౌండ్ నియమం. కరీంలాలా హోటల్లో సమావేశం (జంజీర్లో ప్రాణ్ పఠాన్ క్యారెక్టర్‌కి ఇతనే మూలం). హజీ మస్తాన్ , వరదరాజ్ మొదలియార్, బడా రాజన్‌తో పాటు డాన్‌లంతా వచ్చారు. కుదిరితే రాజీ, లేదంటే నుదుటి మీద బుల్లెట్. అయినా రతన్ వెళ్లాడు.
తాను గోల్డ్ , జూదం, స్మగ్లింగ్ ఎక్కడా జోక్యం చేసుకోనని చెప్పాడు. వొర్లి తనకి వదిలేసి ఎవరైనా ఎక్కడైనా మట్కా కంపెనీలు పెట్టుకోవచ్చు. అయితే మట్కా నిర్వహించేది మాత్రం తానే. ఎక్కడా ఎవడూ జనం డబ్బు ఎగ్గొట్టకూడదు.
వొర్లి తర్వాత బాంగ్రా, మాహిమ్, దారవీ , కుర్లా, చివరికి బాంబే అక్కడి నుంచి భారతదేశం. రతన్ ఒక్కడే మట్కా కింగ్. మిల్లు కార్మికుల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. తర్వాతి రోజుల్లో దత్తాసామంత్ నాయకత్వంలో జరిగిన సంపూర్ణ సమ్మె , నూనె మిల్లుల మూసివేత వీటికి మూలాలన్నీ మట్కాలో ఉన్నాయి. ఈ సంక్షోభం నుంచి ఎదిగిన వాడే దావుద్ ఇబ్రహీం.
74 తర్వాత ఇంకో దశాబ్దం అదే రేంజ్లో మట్కా కొనసాగి వుంటే ఏం జరిగేదో తెలియదు కానీ, ఎమర్జెన్సీలో రతన్‌ని మూసేశారు. ఆగిపోయింది. జనతా గవర్నమెంట్ ఉక్కుపాదం మోపింది. 80ల్లో కూడా కొనసాగింది కానీ, మునుపటి విచ్చలవిడితనం లేదు. దొంగతనంగా సాగింది.
కొన్ని వేల మంది ఆత్మహత్యలు, లక్షల కుటుంబాలు పతనం. భూముల్ని అమ్ముకుని కూలీలుగా మారిన రైతుల దుక్కం. ఇవేమీ కర్మ రూపంలో రతన్‌ని తాకలేదు. పాక్షిక పక్షవాతంతో కొంత కాలం బాధపడ్డాడు. ఒంటరిగా సముద్రాన్ని చూస్తూ గడిపాడు. చివరి రోజుల్లో గుర్రపు పందేలు ఆడేవాడు. అంత పెద్ద జూదగాడు, నిరంతరం ఓడిపోయేవాడు.
86 ఏళ్ల వయసులో ప్రశాంతంగా చనిపోయాడు.
కర్మ , ప్రాప్తం ఇవన్నీ పరాజితుల పదజాలం.
* * *
సుబ్బరత్నకి ఇప్పుడు 80 ఏళ్ల వయసు. మట్కా కోసం అప్పులు చేసి ముగ్గురు పిల్లల్ని ఆమెకి వదిలి భర్త పారిపోయాడు. కూలి పనులు చేసి పిల్లల్ని సాకింది. తన మొగుడు ఇంకా తిరిగొస్తాడని పిచ్చి ముసలమ్మ ఎదురు చూస్తూనే వుంది.
సంజీవికి చిన్నప్పుడే కన్ను పోయింది. అయినా ధైర్యం కోల్పోలేదు. కష్టపడి బతికాడు. మట్కా అతన్ని తినేసింది. ఉరితాడుకి వేలాడాడు.
తండ్రికి తెలియకుండా మట్కా ఆడి మా దూరపు బంధువు భూమిని బేరం పెట్టాడు. భూమి రిజిస్ట్రేషన్ రోజు తండ్రి విషం తాగాడు.
మట్కా వ్యసనంతో మా నాన్న చేసిన ఆర్థిక విధ్వంసంతో నా చదువు దెబ్బతినింది. నేనూ బాధితుడినే.