Suryaa.co.in

Features

గులామ్ అలీ … ఒక అద్భుత గాన రసం

గులామ్ అలీ ఉర్దూ గజల్‌ గాయకుడు. మెండైన, మేలైన‌ సృజనాత్మక‌తో, ప్రతిభతో, ప్రజ్ఞతో, సంగీతజ్ఞత (musicality)తో శ్రేష్ఠమైన ‌గజల్ గానం చేశారు గులామ్ అలీ.

గులామ్ అలీ గానం లేకపోయి ఉండుంటే గానం అన్నది ఇలా కూడా, ఇంతలా‌ కూడా ఉంటుందని తెలిసొచ్చేది కాదు. ‘పాడుతున్నప్పుడు గులామ్ అలీకి‌‌ చేతుల్లో ఒక‌ హామౌనిఅం (Harmonium) ఉంటుంది‌‌‌ మెదడులో ఇంకో హామౌనిఅం ఉంటుంది’.

స్వర విన్యాస వైశిష్ట్యం గులామ్ అలీ గానం. స్వరాల‌ వాన కురుస్తుంది గులామ్ అలీ పాడుతూంటే. గులామ్ అలీని “స్వర సరస్వతి” అన్నారు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు టీ.ఎన్. శేషగోపాలన్‌.

శ్రోతలకు ఉత్సుకత కలిగించే, శ్రోతలను ఉత్సాహపఱిచే గానం గులామ్ అలీది. గజల్‌ గానానికే కాదు అసలు‌ గానానికే కొత్త ఒరవడిని సృష్టించారు‌ గులామ్ అలీ‌. గానానికి మఱో ఒరవడి గులామ్ అలీ. మెహ్‌దీహసన్ తరువాత ఉర్దూ గజల్‌ గానానికి మఱో‌ పార్శ్వం‌ గులామ్ అలీ. ఉర్దూ గజల్ గానానికి మెహ్‌దీహసన్ ఒక ధ్రువం అయితే రెండో ధ్రువం గులామ్ అలీ.

మన తెలుగు గాయకుడు మనో, ఉర్దూ గజల్ గాయకుడు హరిహరన్ ఒకసారి గులామ్ అలీని కలిసి “మీరు రోజుకు ఎంతసేపు సాధన‌ చేస్తారు‌?” అని అడిగితే “ఇప్పుడు నేను ముసలాణ్ణయిపోయాను అందుకని రోజుకు 7 గంటలు మాత్రమే సాధన‌ చెయ్యగలుగుతున్నాను” అని చెప్పారట గులామ్ అలీ. సాధన, సాధన… సంగీతం… గొప్ప సంగీతం సాధనవల్ల సమాకూడుతుంది.

కల్పనా శక్తికి కావల్సినంత‌ సాధనతో ఎంతో గొప్ప గానాన్ని అభివ్యక్తీకరించారు గులామ్ అలీ. మహోన్నతమైన కల్పనా‌ శక్తి గులామ్ అలీది. ఎన్నో గజళ్లను అనితరసాధ్యమైన రీతిలో పాడారు గులామ్ అలీ. వైవిద్య భరితమైన, ఉత్సాభరితమైన (spirited) ఆకర్షణీయమైన (enthralling), ఉల్లాసభరితమైన (enchanting), మనోహరమైన (engrossing) గజల్ గానం చేశారు గులామ్ అలీ.

హిందూస్థానీ శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన పాటియాలా ఘరానా నుంచి వచ్చారు గులామ్ అలీ. హిందూస్థానీ సంగీత ధోరణులు (genres)
ఠుమ్రీ, దాద్రా, ఖయాల్. ఈ మూడిట్లోనూ నిష్ణాతుడు గులామ్ అలీ. తొలి దశలో లాహోర్ రేడియో గాయకుడై, ఆపై గజల్ గాయకుడుగా రాణించారు, రాజిల్లారు గులామ్ అలీ.

మామూలు గేయ రచనా విధానానికి గజల్ రచనా విధానానికి తేడా ఉంటుంది. అదే విధంగా మామూలు గేయాన్ని పాడడానికి (గేయం పాడబడ్డాక గీతం ఔతుంది) గజల్‌ను పాడడానికి తేడా ఉంటుంది. ఉర్దూ గజల్ సాహిత్యం సాంద్రతతోనూ, ఉదాత్తంగానూ, ప్రత్యేకంగానూ ఉంటుంది. (తెలుగులో ఉన్నట్టుగా చీర గజళ్లు, అమ్మ గజళ్లు, నాన్న గజళ్లు, గురువు గజళ్లు, ముగ్గు గజళ్లు, చారు గజళ్లు ఉర్దూలో ఉండవు. ఉర్దూలోనే కాదు ఏ ఇతర భాషలోనూ ఉండవు.)

ఒక గజల్‌లోని సాహిత్య సాంద్రతను, ప్రత్యేకతను సంగీతజ్ఞత (musicality)తో గానంలోకి తీసుకొచ్చి శ్రోతలను ఒప్పించడం, మెప్పించడం గజల్ గాయకుడి కర్తవ్యమూ, గొప్పతనమూ ఔతాయి. గులామ్ అలీకి ఈ జ్ఞానం మెండుగా ఉంది. ఈ జ్ఞానంతో గులామ్ అలీ గజల్ గానాన్ని అత్యున్నతంగా చేశారు.

గజల్‌లో ప్రత్యేకాంశాలు కాఫియా (rhyme), రదీఫ్ (పునారావృతం అవుతుండే పదం లేదా పదాలు). గజల్‌ను పాడుతున్నప్పుడు కాఫీయాను, రదీఫ్‌ను ప్రత్యేకంగా పాడడం గజల్ గాయకుడి ప్రధాన లక్షణం. గులామ్ అలీ తాను పాడుతున్న గజల్‌లోని కాఫియాను, రదీఫ్‌ను ప్రత్యేకంగా intone or intonate చేస్తారు. “బహారోన్ కో చమన్ యాద్ ఆగయా హై…” గజల్‌లోని ‘చమన్’, ‘యాద్ ఆగయా హై’ పదాలను ఆయన అన్న తీరును గమనిస్తే కాఫియాను, రదీఫ్‌ను ప్రత్యేకంగా intone చెయ్యడం అవగతమౌతుంది. “యే దిల్ యే పాగల్ దిల్ మేరా…” గజల్‌లో ‘ఆవార్‌గీ’ అన్నదాన్ని గులామ్ అలీ అన్న తీరును గమనించినా ఈ విషయం అవగతమౌతుంది.

ప్రజ్ఞ, ప్రతిభ, ప్రౌఢిమ, తెలివి, తెలివిడి, సృజనాత్మకత, ప్రయోగ శీలత్వం, సంగీతజ్ఞత, గాత్ర పుష్టి, timbre-density, rounded even voice, సాహిత్యజ్ఞత ఈ అన్నిటితోనూ గులామ్ అలీ ఒక ఉదాత్తమైన గజల్ గాయకుడు.

దుర్గా రాగంలో “లేచలా జాన్ మెరీ…”, విపరీతమైన జనాదరణ పొందిన “చుప్ కే చుప్ కే ఏ రాత్ దిన్…”, దర్బారీలో పాడిన “హంగా మెహక్యూన్…”, “రంజ్ కీ జబ్ గుఫ్త్ గూన్…”, “రాస్ తే యాద్ నహీన్ రాహ్ నూమా…”, “దిల్ కీ బాత్ లబో తక్ లాకర్…”, “దిల్ మె ఇక్ లెహర్ సీ…”, “ఇత్ నీ ముద్దత్ బాద్ మిలే…” వంటి ఎన్నో గజల్ గాన అద్భుతాలను ఆలపించి అందించారు గులామ్ అలీ. “దిల్ కీ బాత్ లబో తక్ లాకర్…” గజల్ మెహ్‌దీహసన్ పాడిన దానికన్నా గులామ్ అలీ పాడిందే గొప్పగా ఉంటుంది.

గులామ్ అలీ పాశ్చాత్య సంగీత ధోరణీలోనూ ఉర్దూ గజళ్లను పాడారు (ఆల్బం – మాహ్ తాబ్). గులామ్ ఆలీ ‘హీర్’లను కూడా‌ పాడారు. పంజాబీ జానపదాల్నీ పాడారు.

మనకు బాగా తెలిసిన మంచుపల్లకి సినిమాలోని “మేఘమా మేఘమా…” పాట గులామ్ అలీ గజల్ “దర్దె దిల్ దర్దె దిల్…” జన్యమే. ఈ గులామ్ అలీ గజల్‌ను గజల్ గాయకుడు జగ్‌జీత్ సింహ్ కూడా అనుకరించారు, అనుసరించారు. రామకృష్ణ కథానాయకుడుగా నటించిన మంచిరోజు చిత్రం లో ఎం.ఎస్. శ్రీరాం‌ స్వర కల్పనలో పీ.బీ. శ్రీనివాస్ పాడిన “చెప్పాలనుంది చెప్పేదెలా…”‌ పాటకు గులామ్ ఆలీ గజల్ “చుప్ కే చుప్ కే యే రాత్ దిన్…” ఆధారం. ఆ సినిమాలోని “నీ కోసమనే నే వేచినానే…” పాట పల్లవి యథాతథంగా గులామ్ అలీదే.

గులామ్ అలీ “యే దిల్ యే పాగల్ దిల్ మేరా…” ప్రేరణతో ఇళయరాజా తమిళ్ష్‌లో రెండు పాటలు చేశారు. కన్నడంలో సంగీత దర్శకుడు జీ.కె. వెంకటేష్ ఎరడు నక్షత్రగళు సినిమాలో “గెళతి బారదు ఇన్థ సమయ…” పాటను గులామ్ అలీ గజల్ “దిల్ మేన్ ఇక్ లెహర్ సీ ఉఠీ హై అభీ…”కు అనుకరణగా, అనుసరణగా చేసి రాజ్‌కుమార్ చేత పాడించారు.

సీ.నారాయణరెడ్డి గజళ్లు అని పాడిన వాటిపై గులామ్ అలీ గజల్ గాన ప్రభావం తెలిసిపోతూంటుంది. నిఖా హిందీ సినిమాలో గలామ్ అలీ గజల్ “చుప్ కే చుప్ కే …” చోటు చేసుకుంది.

మనదేశంలోని గజల్‌ గాయకులైన హరిహరన్, తలత్ అజీజ్ వంటి వారిపై గులామ్ అలీ ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తూంటుంది.
ఎమ్.ఎస్.‌ విశ్వనాదన్‌ సంగీతంలో పీ.బీ.శ్రీనివాస్ పాడిన‌ రాము చిత్రంలోని గజల్ వంటి “నిలవే‌ ఎన్నిడమ్ నెరుఙ్‌గాదే…” (తెలుగులో “మంటలు రేపే నెలరాజా…” ) తమిళ్ష్ పాటను గులామ్ అలీ ఒక సందర్భంలో పాడారు (ఈ విషయాన్ని నాకు ప్రముఖ సంతూర్ విద్వాంసుడు విశ్వేశ్వరన్ తెలియజేశారు).

పంజాబీ ముస్లీమ్ అయిన గులామ్ ఆలీ 5-12-1940లో పుట్టారు. లండన్ రొయల్ అల్బట్ హాల్(Royal Albert Hall) లో గజల్ గానాన్ని అందించారు గులామ్ అలీ. ఉర్దూ గజల్ గానాన్ని ఎంతో ఉన్నతంగా పండించి పంచారు గులామ్ అలీ.

ఆరోగ్యం బాగాలేనప్పుడు, మనసు బాగాలేనప్పుడు గులామ్ అలీ గానాన్ని వింటే గులామ్ అలీ ఎలాంటి గాయకుడో, ఎంతటి గాయకుడో ఎవరికైనా తెలిసి వస్తుంది. మెహ్‌దీహసన్ గానం ఆనంద రసం అయితే గులామ్ అలీ గానం అద్భుత రసం అయింది.
గులామ్ అలీ … ఒక అద్భుత గాన రసం!

– రోచిష్మాన్
9444012279

LEAVE A RESPONSE