– ఒప్పందంపై అమెరికాలో నమోదైన కేసుపై ప్రభుత్వం స్పందించాలి
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
కర్నూలు : రాష్ట్ర ప్రభుత్వం సెకీ విద్యుత్ ఒప్పందం, ప్రజలకు బారమైన యూజర్స్ చార్జీలు వెంటనే రద్దుచేయాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం నగర శివారుల్లో ఉన్న ఏపీఈఆర్సీ కార్యాలయంలో యాక్సస్ఎనర్జీ 400 మెగావాట్ల విద్యుత్ ఎస్సీడీపీఎల్ కొనుగోలు ఒప్పందంపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆయన చైర్మెన్ దృష్టికి తీసుకు వచ్చారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదానితో రాజస్తాన్ నుండి ఇక్కడకు విద్యుత్ సరఫరా చేయుటకు ఒప్పందం కుదుర్చుకోవడం దారుణమన్నారు. ఈ ఒప్పందం వలన రాష్ట్రప్రజలపై 25 సంవత్సరాల్లో లక్షా 20వేల కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు. విద్యుత్ యూనిట్ 25 సంవత్సరాల తరువాత రూ. 6.25 పైసలు పడుతుందన్నారు. ఏపీలో సోలార్ విద్యుత్ అవకాశం ఉంటే — ఆనాడు ప్రభుత్వం ఆదానితో ఎందుకు ఒప్పందం చేసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఈ ఒప్పందం కోసం ఆదానితో రూ. 1750కోట్ల లంచం తీసుకున్నట్లు అమెరికాలో కేసు నమోదు అయిందని, అదానికి అమెరికా కోర్టు నోటీసులు కూడా ఇచ్చిందన్నారు.
ఏపీలో ఇన్ని వసతులు ఉంటే రాజస్తాన్ నుండి విద్యుత్ తీసుకోవడమేమిటని ప్రశ్నించారు. 2021లో గుజరాత్ రాష్ట్రం యూనిట్ రూ. 1.99 పై ఇస్తుంటే రాజస్తాన్‌తో యూనిట్ రూ.2.49 పై ఎందుకు ఒప్పందం చేసుకోవాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. ఇది అతిపెద్దస్కాం అని వెంటనే దీనిని రద్దుచేయాలన్నారు. ఎన్నికల ముందు దీనిపై ఏపీ హైకోర్టులో ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావులకేశవ్ కోర్టులో కేసు వేశారని అధికారంవచ్చిన తరువాత పట్టించు కోకపోవడం దారుణమన్నారు.
సీపీఐ తరపున మేము కేసు వేశామన్నారు. ఏపీఈఆర్సీ పరువు కాపాడాలని, వెంటనే సెకి ఒప్పందం రద్దుచేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల ముందు అప్పటి ప్రభుత్వం ఇష్టాను సారంగా వేసిన యూజర్‌చార్జీలు తమ ప్రభుత్వం వస్తే విద్యుత్‌చార్జీలు పెంచమని,యూజర్స్ చార్జీలు తగ్గిస్తామన్న చంద్రబాబునాయుడు సెకి ఒప్పందం వెంటనే రద్దుచేయాలని, యూజర్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఏపీఈఆర్సీ చైర్మెన్ పీవీఆర్ రెడ్డికి సమస్యలు వివరించి వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీపీఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య, నగర కార్యదర్శి పీ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారుమహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షకార్యదర్శులు గిడ్డమ్మ, శ్రావణి, నగర కార్యదర్శి భారతి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సోమన్న, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు వెంకటేష్, అటోవర్కర్స్ యూనియన్ నాయకులు ఈశ్వర్, క్రిష్ణారెడ్డి, నల్లన్న రాముడు, కుమార్,, మల్లిఖార్జున ,రామాంజినేయులు, ప్రభాకర్ సీపీఐ,ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.