– సిజిహెచ్ఎస్, సి.ఎం.ఓ కోటేశ్వరరావు
గుంటూరు: సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సిజిహెచ్ఎస్) సీనియర్ మెడికల్ ఆఫీసర్ గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్ల కు విలువైన సేవలు అందించిన డాక్టర్ ధారవత్ తుకారాం నిబద్ధత, చిత్తశుద్ధి ప్రశంసనీయమని సిజిహెచ్ఎస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి.సిహెచ్.కోటేశ్వరరావు కొనియాడారు.
గుంటూరు సిజిహెచ్ఎస్ లో నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తూ, విజయవాడకు బదిలీపై వెళుతున్న డాక్టర్ డి.తుకారాం ను నగరంపాలెం లోని సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ లో బుధవారం ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి.సీహెచ్.కోటేశ్వరరావు మాట్లాడుతూ.. బదిలీలు సాధారణమే అయినప్పటికీ, గుంటూరులో తుకారాం అందించిన సేవలు మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. విధి నిర్వహణలో తుకారాం సేవాదృక్పథంతో రోగులకు సేవలందించటం అభినందనీయమన్నారు. అనారోగ్యపాలైన ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల ఆయన చేసిన నిస్వార్థ సేవ ప్రతి వైద్యునికి ఆదర్శమన్నారు.
సిజిహెచ్ఎస్ లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గుమ్మడి సీతారామయ్య చౌదరి మాట్లాడుతూ..డాక్టర్ తుకారాం రోగుల పట్ల వైద్యునిగానే కాకుండా, మంచి మార్గదర్శకుని గా, ఆత్మీయుడుగా మెలిగేవారన్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ పట్ల ఆయన చూపించిన ప్రేమాభిమానాలు అమూల్యమైనవని ప్రశంసించారు.
డాక్టర్ తుకారాం మాట్లాడుతూ. సిజిహెచ్ఎస్ వైద్యునిగా గుంటూరుతో వున్న అనుబంధం తన జీవితంలో మరచిపోలేనన్నారు. ఇక్కడి సిఎంఓ సహకారం, ఫార్మశిస్ట్లు, నర్సింగ్ సిబ్బంది తోడ్పాటు, పెన్షనర్ల సంఘాల స్నేహ పూరిత వాత్సల్యం చాలా గొప్పవన్నారు.
అనంతరం డాక్టర్ తుకారాం కు జ్ఞాపికలు ఇచ్చి వీడ్కోలు పలికారు. తొలుత ఫార్మశిస్ట్ అయోష బేగం వైద్యునిగా తుకారాం చేసిన సేవల విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో సిజిహెచ్ఎస్ ఉద్యోగులు సునీల్, మురళీ, రామారావు, రత్నరాజు, వెంకటేశ్వర్లు,నందమణి వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు.