– కాళేశ్వరం ఎవరిది తప్పయితే రైతు చేతిలో చెంప దెబ్బ తిందాం.
– రేవంత్ లాగా గురు దక్షిణ కింద క్రిష్ణా ,గోదావరి జలాలను కిందకు తరలించలేదు
– కాంగ్రెస్ ఎమ్మెల్యేల రూపం లో నల్లగొండ జిల్లా లో లొట్టపీసు చెట్లు
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి .జగదీశ్ రెడ్డి
హైదరాబాద్: నిన్న రేషన్ కార్డుల పంపిణీ పేరు మీద తుంగతుర్తి లో సీఎం లేని గొప్పలు చెప్పుకోవడం సిగ్గు మాలిన చర్య. బూతులు తిడితేనైనా స్పందిస్తారని సీఎం బూతులకు తెగ బడ్డారు. సీఎం కు సంస్కారం, బుద్ధి పెరగలేదు. సీఎం మాట్లాడిన మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారు.
కేసీఆర్ హయం లో రేషన్ కార్డులు ఇవ్వలేదని సీఎం అబద్దాలు మాట్లాడారు. జూలై 2021 లో ప్రతి పక్ష నేతగా భట్టి విక్రమార్క తన నియోజకవర్గం లో రేషన్ కార్డులు పంచినట్టు అప్పట్లో ట్వీట్ చేశారు. ఇప్పటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీ గా బీ ఆర్ ఎస్ లో ఉన్నపుడు రేషన్ కార్డుల పంపిణీ గురించి ప్రత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు.
చౌటుప్పల్ లో అప్పటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమక్షం లో నేను రేషన్ కార్డులు పంచాను. 6 .47 లక్షల రేషన్ కార్డులను కేసీఆర్ హయాంలో పంచాం.నా వాదన ను తప్పని నిరూపిస్తే చెంప దెబ్బ కొట్టించుకోవడానికి సిద్ధం. కాంగ్రెస్ నేతలు చెంప దెబ్బలు తినడానికి సిద్ధం కావాలి.దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్ని యేండ్లు అవుతున్నా రేషన్ కార్డుల కోసం.ప్రజలు ఎదురుచూడటం ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ వైఫల్యం వల్ల కాదా?
గతం లో కేసీఆర్ జిల్లా పర్యటనలకు వచ్చినపుడు కొత్త కార్యక్రమాలు ప్రకటించే వారు. నిన్న సీఎం తుంగతుర్తి లో తిట్లు తప్ప ఏమీ ఇవ్వలేదు. కాంగ్రెస్ -టీడీపీ పాలన వల్లే నల్లగొండ లో ఫ్లోరోసిస్ మహమ్మారి 2 లక్షల మందిని కబళించింది. నీళ్ల విషయం లో అన్యాయం చేసి మళ్ళీ ఏవో చెబుతున్నారు. మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే నల్లగొండ ను 40 లక్షల మెట్రిక్ టన్నుల స్థాయికి తీసుకెళ్లింది కేసీఆర్ కాదా ? వ్యవసాయాన్ని నల్లగొండ జిల్లా లో కేసీఆర్ పండగ లా మార్చాం.
కాంగ్రెస్ పాలన వచ్చాక ఒక్క ఎకరాకు అయినా అదనం గా నీరొచ్చిందా ? ఎన్నికల కోసం వేసిన రైతు భరోసా పాతది .యాసంగి ది వానా కాలం ది వేయాలి. రైతాంగానికి ఇంకా 27 వేల కోట్ల రూపాయలు రేవంత్ ప్రభుత్వం బాకీ ఉంది. నిన్న కూడా తుంగతుర్తి లో సీఎం వచ్చే కన్నా ముందు కూడా కాంగ్రెస్ నేతలు తన్నుకున్నారు.
కార్యక్రమం ఏది అని చూడకుండా రేవంత్ అన్ని పాత్రలు తానే వేస్తున్నాడు. రేవంత్ చర్యలు వీధి బాగోతాలను మించి పోయాయి. కాళేశ్వరం సాక్షిగా నేను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నా. కేసీఆర్ కు మూడు రోజులు టైమ్ ఇస్తే కన్నెపల్లి పంప్ హౌజ్ మోటార్లు ఆన్ చేసి చూపిస్తాం. ఏ పంప్ హౌజ్ ల దగ్గరైనా చర్చ పెడదాం. కాళేశ్వరం లో అన్నీ బాగానే ఉన్నాయి .
గోదావరి ని కావాలనే ఎండబెడుతున్నారు. సీఎం వచ్చినా సరే ,మంత్రి వచ్చినా సరే రైతు సమక్షంలో చర్చకు సిద్ధం. కాళేశ్వరం ఎవరిది తప్పయితే రైతు చేతిలో చెంప దెబ్బ తిందాం. మహిళలకు వడ్డీ లేని రుణాలు ,ఉద్యోగాల భర్తీ విషయం లో రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలే.
రేవంత్ స్థాయికి దిగజారి నేను మాట్లాడాలని కొందరు కోరుకుంటున్నారు .నేను అలా చేయను. రేవంత్ మాట్లాడింది ప్రతిదీ అబద్దమని సాక్ష్యాలతో నిరూపించా. నేను సోడా కలిపానో ,నీళ్లు కలిపానో పక్కన బెట్టు. రేవంత్ లాగా గురు దక్షిణ కింద క్రిష్ణా ,గోదావరి జలాలను కిందకు తరలించలేదు.
బనక చర్ల పై చంద్రబాబు రాసిచ్చిన వాక్యాలనే రేవంత్ చదువుతున్నారు. తాను ఏదీ మాట్లాడినా రాసే ,చూపే భాజా బజంత్రీ మీడియా ఉందనే అహంకారం తో రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.
నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ మహామహులనే మట్టికరిపించా .భవిష్యత్ లో కూడా నేనేంటో నిరూపిస్తా. నల్లగొండ జిల్లా లో రేవంత్ తెలంగాణ సాయుధ పోరాట వీరుల పేర్లు తీసుకున్నారు. వారంతా పోరాడింది కాంగ్రెస్ జమీందార్ల మీదే. ఒక్కో సారి మనం ఎంత మంచిగా పంట సాగు చేసినా పంట కంటే లొట్ట పీసు చెట్లే ఎక్కువ గా మొలుస్తాయి. ఇపుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రూపం లో నల్లగొండ జిల్లా లో లొట్ట పీసు చెట్లు మొలిచాయి. నా ఆస్తులు రేవంత్ ఆస్తుల గురించి మీడియా నే నా గ్రామం , రేవంత్ గ్రామం వెళ్లి విచారణ చేయాలి.
ప్రెస్ మీట్ లో మాజీ ఎంపీ లింగయ్య యాదవ్ మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత , ఎన్ .భాస్కర్ రావు ,రవీంద్ర కుమార్ ,కె .ప్రభాకర్ రెడ్డి ,బీ ఆర్ ఎస్ నేత ఒంటెద్దు నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.