– రాహుల్ ది ఏ కులమో దమ్ముంటే చెప్పండి
– రాహుల్ ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి?
– బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా ఇచ్చింది బీజేపీనే
– ముస్లింలకు రాజ్యంగ విరుద్ధంగా 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రేవంత్ , రాహుల్ ప్రయత్నాలు
– ఇప్పుడు 42 శాతం బీసీ రిజర్వేషన్ల పేరిట మళ్లీ ముస్లింలకే లబ్ధి చేకూర్చేలా ప్రయత్నాలు
– వంద మంది రాహుల్ గాంధీలు కాదు.. వెయ్యి మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా కాంగ్రెస్ ఆ రాష్ట్రాల్లో ఓడిపోవడం ఖాయం
– కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
ఢిల్లీ: వేరే వారికి నీతులు చెప్పే ముందు రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసి, బీసీని ముఖ్యమంత్రిని చేయండి. మీ రాహుల్ గాంధీ ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. దేశ ప్రధానమంత్రిపై దిగజారిన వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. ఆయన నామినేటెడ్ ప్రధాని కాదు. మూడుసార్లు ఆయనపై నమ్మకంతో ప్రజలు అధికారాన్ని అందించిన విషయం గుర్తుంచుకోవాలి.
1994లో గుజరాత్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మండల్ కమిషన్ నివేదిక ప్రకారం.. మోదీ కులాన్ని బీసీ జాబితాలో చేర్చింది. ఆ సమయంలో కనీసం మోదీ ఎమ్మెల్యేగా కూడా లేరు. కేంద్రంలో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ కులాన్ని జాతీయ స్థాయిలో ఓబీసీ జాబితాలో చేర్చింది.
అత్యధిక మంది ఎంపీలు బీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచే గెలిపించుకున్నాం. కన్వర్టెడ్ బీసీ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ని రేవంత్ రెడ్డి హేళన చేస్తున్నారు. మిడిమిడి జ్ఞానంతో ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. 1972లో లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చారు. అంటే వారు కూడా కన్వర్టెడ్ ఎస్టీలా?
అదే సమయంలో విశ్వ బ్రాహ్మణులతో పాటు మరికొన్ని కులాలను కూడా బీసీల్లో చేర్చారు. మరి విశ్వ బ్రాహ్మణులను కూడా కన్వర్టెడ్ బీసీలని అంటారా? ఆ తర్వాత కూడా చాలా కులాలను ఎస్సీ, ఎస్టీల జాబితాలో చేర్చారు. మరి వారందరినీ కూడా కన్వర్టెడ్ కులాలకు చెందిన వారని చెబుతారా? నరేంద్ర మోదీ ని, ఆయన కులాన్ని కాంగ్రెస్ నాయకులు రాజకీయంగా మైలేజీ పొందేందుకు ఎన్నో సార్లు కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న కాంగ్రెస్ హామీతో బీసీలను మోసం చేయాలని చూస్తోంది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలకు బీసీ-ఈ పేరుతో 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు. రిజర్వేషన్లు రాజ్యంగవిరుద్ధమని, ఇలాంటి రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టు రెండుసార్లు తీర్పునిచ్చింది.
అయినా సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ స్టే తెచ్చుకుని అమలు చేస్తున్నారు. ఇప్పుడు ముస్లింలకు 4 నుంచి 10 శాతానికి పెంచి.. బీసీలకు అన్యాయం జరిగేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. కులగణన పేరుతో బీసీ జనాభాను భారీగా తగ్గించే ప్రయత్నం చేసింది. 56 శాతం బీసీలని చెబుతూ.. వారిలో ముస్లింలను 10 శాతం చూపించింది. నిజమైన బీసీలు 46 శాతం మాత్రమే ఉన్నారని చెబుతూ బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తోంది.
స్థానిక సంస్థల్లో ఇస్తామన్న 42 శాతం రిజర్వేషన్లు ఎవరికి లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటోందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో చేతి వృత్తులపై ఆధారపడి పనిచేసే కులాలకు మాత్రమే రిజర్వేషన్లు అందించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లలో కూడా ముస్లిం వర్గాలు కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది. మళ్లీ బీసీ రిజర్వేషన్లతో కలిపి ముస్లింలకు రాజ్యంగ విరుద్ధంగా 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు ప్రయత్నాలు చేస్తున్నారు.
గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల పేరిట కుట్ర పన్నిన విషయం తెలిసిందే. 150 మున్సిపల్ డివిజన్లు ఉంటే.. 50 సీట్లు బీసీలకు రిజర్వ్ చేశారు. ఆ 50 బీసీ సీట్లలో బీసీయేతరులైన మజ్లిస్ పార్టీకి చెందిన వారే గెలిచారు.
ఇప్పుడు 42 శాతం బీసీ రిజర్వేషన్ల పేరిట మళ్లీ ముస్లింలకే లబ్ధి చేకూర్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీసీలను ఏదో ఉద్ధరించామన్నట్టు ఢిల్లీలో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ భుజాలు చరుచుకుంటున్నారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెబుతున్నప్పటికీ.. అందులో 10 శాతం ముస్లింలకు పోగా… గతంలో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను 32 శాతానికి తగ్గిస్తున్నారు.
ఒవైసీ పార్టీకి లబ్ధి చేకూర్చడమే తప్ప బీసీలకు ఒనగూరే ప్రయోజనమే లేదు. వేల కోట్లకు పడగలెత్తిన ఒవైసీ లాంటి వ్యక్తులతో మధ్యతరగతి బీసీ పేద కులాల నాయకులు ఎన్నికల్లో పోటీపడి గెలిచే అవకాశం ఉందా? ఎన్నో ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడూ బీసీ జనగణనకు సంబంధించి అంగీకరించలేదు. పార్లమెంటులో చర్చ చేయాలని అడిగినా బీసీల గోడు వినిపించుకున్న పాపాన పోలేదు.
మీలా బీసీలకు అన్యాయం చేసేలా తూతూమంత్రపు సర్వేలు చేయబోం. మేం చేసే కుల గణన రాజ్యాంగ బద్ధం చేసి, భవిష్యత్తులో బీసీలకు న్యాయం చేస్తాం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఒక్క బీసీ వ్యక్తిని కూడా సీఎంను చేయలేదు. ఒక్క బీసీ వ్యక్తి కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానిని చేసిన పాపాన పోలేదు. కేంద్ర మంత్రి వర్గంలో అనేక మంది బీసీలను బీజేపీ నియమించింది. బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా ఇచ్చింది బీజేపీనే.
దేశంలోని అనేక రాష్ట్రాల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీ అధికారం కొల్పోతోంది. వరుసగా మూడోసారి కూడా రాహుల్ గాంధీని దేశ ప్రజలు తిరస్కరించి, నరేంద్ర మోదీ ని ప్రధానిని చేశారు. ఈ ఫ్రస్టేషన్‌తోనే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డితో ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఓడిపోవడం ఖాయం. వంద మంది రాహుల్ గాంధీలు కాదు.. వెయ్యి మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా కాంగ్రెస్ ఆ రాష్ట్రాల్లో ఓడిపోవడం ఖాయం. ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నిల్లో కాంగ్రెస్ కు గుండు సున్నా సీట్లు వచ్చాయన్న నిరాశతో వ్యక్తిగతంగా, రాజ్యాంగ బద్ధ సంస్థలపై దాడులు చేస్తున్నారు.
తెలంగాణ హైకోర్టు ఆదేశాల ప్రకారం పెంచిన రిజర్వేషన్లతోనే స్పష్టంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. 42 శాతం రిజర్వేషన్లు అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఒవైసీ, అజారుద్దీన్, షబ్బీర్ అలీ లాంటి ముస్లింలకు కాకుండా పూర్తిగా బీసీలకే అందేలా.. వారికే న్యాయం జరిగేలా రిజర్వేషన్లు కల్పించాలి.