– పోలవరం, బనకచర్ల సంగతి తేలుస్తాం
– బీఆర్ఎస్ టీడీపీ కుమ్మక్కై తెలంగాణపై కుట్రలు
– బీఆర్ఎస్ – బీజేపీ కూడబలుక్కొని ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపేందుకు ఆర్డినెస్ తెచ్చారు
– పదేళ్లు టిఆర్ఎస్ మౌనంతోనే బనకచర్ల తెరపైకి వచ్చింది
– సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతోనే
బనకచర్ల ఆగింది
– కొల్లాపూర్ లోనే రాజకీయ ఓనమాలు దిద్దుకున్నాను
– కొల్లాపూర్ నియోజక వర్గంలో సబ్ స్టేషన్లకు శంకుస్థాపన, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
కొల్లాపూర్:బీఆర్ఎస్, బిజెపి, టిడిపి కుమ్మక్కై బనకచర్ల, పోలవరం పేరిట తెలంగాణ రాష్ట్రంపై చేస్తున్న కుట్రల సంగతి తేలుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హెచ్చరించారు. శనివారం ఆయన కొల్లాపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
వృధాగా పోయే నీళ్లతో మేము బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ అమాయకంగా మాట్లాడుతున్న మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. ఎగువన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతోనే కిందికి వృధాగా నీళ్లు పోతున్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు.
ఎగువన మా రాష్ట్రంలో ప్రాజెక్టులన్ని పూర్తిచేసుకుని, మిగిలిన అన్ని రాష్ట్రాలకు వాటా పోయిన తర్వాతే బనకచర్ల విషయం మాట్లాడాలని డిప్యూటీ సీఎం అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ 10 సంవత్సరాలు మొద్దు నిద్రపోయి గోదావరి నదిపై ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో బనకచర్ల జల వివాదం తెరపైకి వచ్చింది.
టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిందని డిప్యూటీ సీఎం ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిలు ఢిల్లీకి వెళ్లడంతోనే బనకచర్ల ఆగిందని డిప్యూటీ సీఎం తెలిపారు.
దొంగతనంగా కేటీఆర్ లోకేష్ ను ఎందుకు కలిశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు, బనకచర్ల కడతామని ఏపీ ప్రభుత్వం అంటే, దాన్ని కట్టనివ్వమని టిఆర్ఎస్ ప్రచారం మొదలుపెట్టాలని తెలంగాణ ప్రజల దృష్టిని మళ్లించాలని రాత్రిపూట కేటీఆర్, లోకేష్ మాట్లాడుకున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు. బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ టీడీపీ కూడా బలుక్కొని తెలంగాణ ప్రభుత్వం పై కుట్రలు చేస్తున్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు కడితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లోని రెండు లక్షల ఎకరాలు, లక్షలాదిమంది గిరిజనులు ముంపునకు గురి అవుతారని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం సోనియాగాంధీకి విన్నపం చేస్తే చట్టం లోంచి ఆ ఏడు మండలాలను తీసివేసి గిరిజనులకు సోనియాగాంధీ న్యాయం చేశారని వివరించారు.
రాష్ట్ర విభజన తర్వాత బిజెపి, బీఆర్ఎస్ కుమ్మక్కై ఏడు మండలాలు, రెండు లక్షల ఎకరాలకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకువచ్చారని డిప్యూటీ సీఎం వివరించారు. ఏడు మండలాలకు సంబంధించిన ఆర్డినెన్స్ ను ప్రశ్నిస్తాం. తెలంగాణ ప్రజలను గుండెలో పెట్టుకొని కాపాడుతాం అన్నారు.
నీళ్లు పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో అటు గోదావరి కానీ ఇటు కృష్ణా నదిపై ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని అన్నారు. కృష్ణా నదిపై నిర్మించిన జూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టి పూర్తి చేశాయి అన్నారు.
గోదావరి నదిపై ఎస్సారెస్పీ, శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల ఎత్తిపోతల, ఇందిరా, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలే ప్రారంభించారని తెలిపారు. కృష్ణా నదిపై నిర్మించాల్సిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో జారీ చేయగా 10 సంవత్సరాలు పరిపాలించిన టిఆర్ఎస్ ఒక ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయింది అన్నారు.
గోదావరి నదిపై 152 మీటర్ల ఎత్తులో ప్రాణహిత చేవెళ్ల నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించగా నాటి సీఎం కేసీఆర్ దానికంటే కింది భాగాన 100 మీటర్ల ఎత్తులో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు.
38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్లను వదిలిపెట్టి 1.20 లక్షల కోట్లతో కాలేశ్వరం నిర్మించగా అది కృంగి కూలిపోయిందని అన్నారు. ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో టిఆర్ఎస్ పెద్దలు రాష్ట్ర ఖజానాను దోచుకున్నారని, ఒక్క ఎకరాకు ఆధారంగా నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు.
10 సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో నీళ్లు రాలేదు, నిధుల దోపిడీ జరిగింది, ఎవరు ఎక్కడ ఏం మాట్లాడినా అరెస్టులకు దిగి రాష్ట్రం మొత్తం భయభ్రాంతుల వాతావరణాన్ని సృష్టించారనీ డిప్యూటీ సీఎం అన్నారు.
ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే అధికారాన్ని ప్రజలకు ఇచ్చాం ప్రజల ఆలోచనలే మా ఎజెండాగా పనిచేస్తున్నామని తెలిపారు.
రాయలసీమ ఎత్తిపోతల పై ప్రాంతంలో తెలంగాణ భూభాగంలో ఒక డ్యామ్ కడితే పెద్ద ఎత్తున కృష్ణ నీటిని తీసుకునే అవకాశం ఉన్న నాటి టిఆర్ఎస్ నేతలు ఎందుకు ఆలోచన చేయలేదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వేగవంతం చేశామని తెలిపారు.
పర్యాటక రంగంలో తెలంగాణ ప్రపంచాన్ని ఆకర్షించేలా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కృషి చేస్తున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అప్పుల భారం ఉన్నప్పటికీ వాటిని అధిగమించి గత ప్రభుత్వ పెద్దలు చేసిన అప్పులకు 6,500 కోట్లు ప్రతినెల వడ్డీ కడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల మొదటి తేదీనే జీతాలు ఇస్తున్నాం అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రజల సంక్షేమం కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు డిప్యూటీ సీఎం వివరించారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 10 లక్షలకు పెంచాం, ఇప్పటివరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు 200 కోట్ల సార్లు ఉచితంగా ప్రయాణం చేశారని ఈ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం 6680 కోట్లు మహిళల పక్షాన ఆర్టీసీకి చెల్లించిందని తెలిపారు.
దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా పేదలకు 5 లక్షలతో ఒక్కో ఇంటిని నిర్మిస్తున్నాం ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లు మొదటి దశలో నిర్మించేందుకు 22,500 కోట్లు ఖర్చు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వడివడిగా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నాం గత పది సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లు పేదలకు పంచలేదు అని డిప్యూటీ సీఎం వివరించారు.
కొల్లాపూర్ లోని రాజకీయ ఓనమాలు దిద్దుకున్నాను: భట్టి
మా సోదరుడు స్వర్గీయ మల్లు అనంత రాములు 1980లో నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేసిన సమయంలో తాను విద్యార్థిగా ఉన్నానని, ఆ సమయంలో తనను కొల్లాపూర్ ఇన్చార్జిగా నియమించారని ఆనాడే తాను రాజకీయ ఓనమాలు దిద్దుకున్నారని వివరించారు. నియోజకవర్గ ఇన్చార్జిగా ఊరూరా తిరిగి ప్రజలతో మమేకం కావడం కొల్లాపూర్ తోనే ప్రారంభమైందని, తనకు మధిర నియోజకవర్గ తో ఎంతటి అనుబంధం ఉందో కొల్లాపూర్ తోను అంతే అనుబంధం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు.
కొల్లాపూర్ ఎక్కడో దూరంగా ఉందని అంతా అనుకుంటారు కానీ ఈ నియోజకవర్గంలో అన్ని రకాల భావజాలాలు ఉన్నాయని తెలిపారు. పాలమూరు ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా కొల్లాపూర్ లో రాజకీయ జీవితం ప్రారంభించిన తాను డిప్యూటీ సీఎం గా ఉన్నానని తెలిపారు