– అందరం కలిస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
– ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి
– రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలి
– రేవంత్ కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారు
– కాళేశ్వరం అవినీతిలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
– ప్రతిపక్ష నేత పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలి
– కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ వెనుకాల 20 మంది ఆంధ్రా పెట్టుబడిదారులు ఉన్నారు. వారంతా తెలంగాణ సంపద దోచుకుంటున్నారు. త్వరలోనే వారి బండారం బయటపెడతాననివెల్లడించారు.
రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలి. హావభావాలు మార్చుకోవాలని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గంటలు గంటలు మాట్లాడకుండా, ఆ శ్రద్ధ పని మీద చూపించాలి. ఆవేశం పనికిరాదు. కూల్ మైండ్‌తో పని చేయాలని సూచించారు. ఇంకో మూడున్నర ఏళ్లు ఆయనే సీఎం. ఆ తర్వాత ఎవరు అనేది అధిష్టానం, ప్రజలు నిర్ణయిస్తారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజగోపాల్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే.. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి. మంత్రి పదవిపై నాకు అధిష్టానం హామీ ఇచ్చింది. ఈ విషయం వెంకట్‌రెడ్డికి తెలియదు. అందరం కలిస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మంత్రి పదవి కావాలంటే అప్పుడే కేసీఆర్ ఇచ్చేవారు.
తెలంగాణను సీమాంధ్ర కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు.రేవంత్ కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారు. కాళేశ్వరం అవినీతిలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్లో బీఆర్ఎస్ ఉంది. ప్రతిపక్ష నేత పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలి.