చెంబై వైద్దియనాద బాగవదర్- ఏసుదాస్ బంధం, గురుశిష్య అనుబంధం గురించి లోగడ చెప్పాను. అదుగో అలాంటిదే వీ. దక్షిణామూర్తి – ఇళైయారాజా బంధం, అనుబంధం కూడా. (ఇళయరాజా అనడం సరైంది కాదు)
ఇళైయరాజాకు తొలిదశ కర్ణాటక సంగీతం గురువు వీ. దక్షిణామూర్తి. ఆయన బ్రాహ్మణ అని అనబడుతున్న వర్గానికి చెందిన తమిళ్ష్ వారు. ఇళైయరాజా మాల అని అనబడుతున్న తమిళ్ష్ వ్యక్తి. ఇళైయరాజా కులాన్ని దక్షిణామూర్తి పరిగణనలోకి తీసుకోలేదు! ఇళైయరాజాలోని విద్యార్థిని పరిగణనలోకి తీసుకున్నారు.
(దక్షిణామూర్తి ఇళైయరాజా కూతురుకు కూడా గురువే)
ఇళైయరాజాను తన మంచం మీద కూర్చోబెట్టుకున్న దక్షిణామూర్తి… ఆ దక్షిణామూర్తి దగ్గర విద్య నేర్చుకున్న ఇళైయరాజా సమాజంలోని కులవాద వికృత జీవులకు సరైన పాఠం.
దక్షిణామూర్తిని మలయాళ, తమిళ్ష సినిమా పరిశ్రమలు ‘సామి’ అని పిలుస్తాయి. ఇళైయరాజా కూడా సామి అనే పిలుస్తారు.
చెంబై వైద్దియనాద బాగవదర్, దక్షిణామూర్తి వంటి గురువులున్న ఏసుదాస్, ఇళైయరాజాలు తమ కులం, మతం రెండిటినీ విసర్జించి అంతర్జాతీయ వ్యక్తులయ్యారు. ఇద్దరూ బ్రాహ్మణ్యంతో జీవిస్తున్నారు!
బ్రాహ్మణ్యం, దళితత్వం పుట్టుకతో రావు. బ్రాహ్మణ డీ.ఎన్.ఎ. దళిత డీ.ఎన్.ఎ. అని విడివిడిగా లేవు. బ్రాహ్మణ్యం, దళితత్వం అన్నవి స్థితులు. కొందరు తమ మనస్తత్వ రీత్యా, తమ జీవన విధానంవల్లా ఆ స్థితుల వాళ్లయ్యారు.
ఇవాళ ఏసుదాస్ అన్నది ఒక గొప్ప చరిత్ర; ఇళైయరాజా అన్నది గొప్ప చరిత్ర. ఆ ఇద్దరివీ రిజర్వేషన్ బతుకులు కావు. అందువల్లే వాళ్లు చరిత్రలు అయ్యారు. ఏ రిజర్వేషన్ వ్యక్తైనా, కులం బతుకు బతికే ఏ వ్యక్తైనా ఏసుదాస్, ఇళైయరాజా అయిన దాఖలాలున్నాయా?
చెంబై వైద్దియనాద బాగవదర్- ఏసుదాస్; దక్షిణామూర్తి- ఇళైయరాజా వంటి చరిత్రలు మన సమాజంలోని కులం జీవులకు సరైన పాఠాలు.
కులం, రిజర్వేషన్ ఇవి మనిషిని ఉన్నతుణ్ణి చెయ్యవు. ఇవి దేశానికి, సమాజానికి, సగటు మనిషికి తీవ్రమైన హాని చేస్తున్నాయి అని కాలం మనకు తెలియజెబుతోంది.
కులంతో మన సమాజానికి తీవ్రమైన హాని చేస్తున్న ప్రతి వ్యక్తీ ‘చదువు’తో వాస్తవాలు తెలుసుకోవాలి.
కులం బతుకు, రిజర్వేషన్ బతుకు కాదు మనిషికి కావాల్సింది… విద్యతో, ప్రతిభతో, పనితనంతో సాగే మేలైన బతుకు మనిషికి కావాలి.

– రోచిష్మాన్
9444012279