– ఎవరు ఆపుతారో చూస్తాం
– గౌడ కులస్థులు ఆర్థికంగా ఎదగ కూడదనే కాంగ్రెస్ కుట్ర
– మాజీ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ రాహుల్ ,ప్రియాంక ,ఖర్గే లను తెలంగాణ కు తీసుకొచ్చి ఎన్నికల్లో అడ్డమైన హామీలు ఇచ్చింది. బీసీ లకు కాంగ్రెస్ మేనిఫెస్టో లో ఎన్నో హామీలిచ్చారు. జీవో ల ద్వారా అయ్యే పనులు కూడా రేవంత్ ప్రభుత్వం చేయడం లేదు. బీసీలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి లెక్క లేదు.
బీసీ ల్లో ఏ కులానికి ఇచ్చిన హామీలు కూడా ఇప్పటివరకు అమలు కాలేదు. 21 నెలల కాంగ్రెస్ పాలనలో గీత కార్మికులు చాలా మంది ప్రమాదశావత్తు మరణించారు .పన్నెండు కోట్ల రూపాయల మేర ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నా చెల్లించడం లేదు. కేసీఆర్ కట్టించిన భవనాలను ప్రారంభించే తీరిక కూడా ఈ ప్రభుత్వానికి లేదు.
గౌడ కులస్తులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు. వైన్ షాపుల్లో గౌడ కులస్తులకు 25 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు .15 శాతానికి పరిమితం చేశారు. కేసీఆర్ పాలనలో 15 శాతం రిజర్వేషన్లు అమలు చేశాం. 30 శాతానికి పెంచే ఆలోచన ఉన్న క్రమం లో ఎన్నికలు వచ్చి అమలు చేయలేక పోయాం.
కొత్త మద్యం షాపులకు గోప్యంగా నోటిఫికేషన్ ఇచ్చారు. 14 వ తేదీ నాడు జీవో విడుదల చేస్తే 20 న బయటకు వచ్చింది. సర్వాయి పాపన్న జయంతి కి ముందే జీవో వచ్చినా జయంతి రోజు ఎందుకు జీవో గురించి చెప్పలేదు? మోసపూరితంగా జీవో ను ప్రభుత్వం విడుదల చేసింది.
మద్యం షాపుల దరఖాస్తు ఫీజును 2 లక్షల రూపాయల నుంచి మూడు లక్షలకు పెంచారు. గౌడ కులస్తులకు మద్యం షాపుల్లో ఇస్తామన్న 25 శాతం రిజర్వేషన్లు జీవో లో ఎందుకు ప్రస్తావించలేదు? తక్షణమే జీవో ను రద్దు చేయాలి. గౌడ కులస్థులు ఆర్థికంగా ఎదక కూడదనే కుట్రను కాంగ్రెస్ అమలు చేస్తోంది.
రాష్ట్రం పరిధిలో ఉన్న నిర్ణయాలు తీసుకోకపోవడం బీసీ లకు మోసం కాదా ? జీవో రద్దు చేయకపోతే మద్యం షాపుల కేటాయింపు లాటరీ ప్రక్రియ ను అడ్డుకుంటాం. ఎవరు ఆపుతారో చూస్తాం. అవుటర్ రింగ్ రోడ్డు అవతలకు కల్లు దుకాణాలు తరలించే కుట్ర మా నిరసనలతో ఆగి పోయింది. సొసైటీ లకు మద్యం షాపులు కేటాయించాలి. కల్తీ కల్లు పేరిట కల్లు దుకాణాల పై దాడులు ఆపాలి.
పైసలు లేని పదవులు బీసీ లకు ఇస్తున్నారు. మద్యం షాపుల జీవో ల పై గౌడ సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. వచ్చే శనివారం గౌడ సంఘాలతో సమావేశమై కార్యాచరణ ఖరారు చేస్తాం. కల్తీ నాయకుల మామూళ్లతోనే అసలు సమస్య ఉంది. గౌడ కులస్తులకు వైన్ షాపుల్లో రిజర్వేషన్లు 25 శాతం పెంచేదాకా ఉద్యమిస్తాం.
సొసైటీల లైసెన్స్ లు రద్దు దుర్మార్గం : కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్
తెలంగాణ బీసీ సమాజాన్ని కాంగ్రెస్ నయవంచన చేస్తోంది. మంత్రివర్గ నిర్ణయాలతో అయ్యే పనులు కూడా బీసీ లకు చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే మోసం ,వంచనేనా ? మద్యం షాపుల్లో గౌడ కులస్తులకు 25 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఓట్లు దండుకుని ఇపుడు మాట తప్పారు
కల్తీ కల్లు పేరిట సొసైటీల లైసెన్స్ లు రద్దు చేయడం దుర్మార్గం. సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు కోసం కేసీఆర్ 2 వేల గజాలు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 700 గజాలకు కుదించింది. పాపన్న జయంతి ,వర్ధంతి లను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది కేసీఆర్ ప్రభుత్వమే
బీసీ లను కాంగ్రెస్ మాటలతో మభ్య పెడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి గౌడ కులస్తులకు ఏడాది క్రితం ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదు. జీవో 93 రద్దు చేసే దాకా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు .పోరాటం కొనసాగిస్తాం.
బీసీ లను వంచించిన కాంగ్రెస్: బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె .కిషోర్ గౌడ్
కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ అమలు లో దారుణంగా విఫలమైంది. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ల పై మాట తప్పినట్టే మద్యం షాపుల్లో రిజర్వేషన్ల పెంపు పై మాట తప్పారు. కేసీఆర్ ఎవరూ అడగక ముందే వైన్ షాపుల్లో గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించారు. 25 శాతానికి పెంచుతామని 15 శాతమే కొనసాగించారు. బీసీ డిక్లరేషన్ ను విడుదల చేసిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య ను కూడా మేము కర్ణాటక వెళ్లి హామీల వైఫల్యం పై నిలదీయాలనుకుంటున్నాం.
రాహుల్ ప్రధాని అయ్యేది ఎప్పుడు?: బీఆర్ ఎస్ నేత నాగేందర్ గౌడ్
మా చిన్న తనం లో మద్యం షాపులు అన్నీ గౌడ కులస్తులే నడిపే వారు. కాంగ్రెస్ హయం లో కుల వృత్తుల ధ్వంస రచన జరిగితే కేసీఆర్ హయంలో మద్యం షాపుల్లో గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించారు. రేవంత్ రెడ్డి 42 శాతం రిజర్వేషన్ల పై జంతర్ మంతర్ సాక్షిగా ఢిల్లీ లో డ్రామాలు ఆడారు.
ఇపుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ కల్లి బొల్లి మాటలు మాట్లాడుతున్నారు. రాహుల్ ప్రధాని అయ్యేది ఎప్పుడు? రిజర్వేషన్లు ఇచ్చేదెపుడు? జీవో ద్వారా 25 శాతం మద్యం షాపులు గౌడ కులస్తులకు కేటాయించని రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు సాధిస్తాడా ?