“అమరావతి రాజధాని రెండవ విడత భూసమీకరణ”పై సిటిజన్స్ ఫర్ డెమోక్రసి సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు 20 న విజయవాడలో నిర్వహించిన చర్చా వేదికలో పాల్గొనమని రాష్ట్ర ఎన్నికల పూర్వ ప్రధానాధికారి డా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆహ్వానించారు. వెళ్ళాను, మాట్లాడాను. నా విద్యార్ధి ఉద్యమ సహచరుడు మోతుకూరి అరుణ్ కుమార్ వీడియో తీసి, ఫేస్ బుక్ లో షేర్ చేశారు.
దాన్ని నేను షేర్ చేశాను. దాన్ని వీక్షించిన పెద్దలు, అనంతపురం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ సీనియర్ నేత, అమరావతి రాజధాని పరిరక్షణ కోసం రైతులు సాగించిన అలుపెరగని పోరాటానికి మద్దతుగా నిలిచి లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన ఎన్. వెంకటపతిగారు ఫోన్ చేసి వాయిస్ స్పష్టంగా లేదని, నేను మాట్లాడిన సారాంశాన్ని అడిగి తెలుసుకున్నారు.
అలాగే, సీనియర్ పాత్రికేయులు సుబ్రహ్మణ్యంగారు ఫోన్ చేసి దినపత్రికల్లో వచ్చిన వార్తలు సంక్షిప్తంగా ఉన్నాయని, వక్తల ప్రసంగాల్లో ప్రస్తావనకు వచ్చిన అంశాలపై కాస్తా వివరాలు అడిగారు. ఇరవై ఐదు మందికిపైగా సభలో మాట్లాడారని, వారిలో అత్యధికులు అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులు, అమరావతి రాజధాని పరిరక్షణోద్యమంలో అగ్రభాగాన నిలిచిన రైతు నేతలు, మరీ ప్రత్యేకంగా ఆ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన మహిళా నేతలు మాట్లాడారని, వారి ప్రసంగాలను పొడిపొడి మాటల్లో చెప్పడం సముచితం కాదని, నేను మాట్లాడిన అంశాలకు మాత్రమే పరిమితమై సంక్షిప్తంగా తెలియచేశాను.
అటుపై కాస్త ఆలోచించి, నేను మాట్లాడిన అంశాలను నిక్షిప్తం చేసిన వీడియో ఆధారంగా యధాతధంగా అక్షర రూపంలో మిత్రులకు షేర్ చేస్తే, రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఉన్న ఒక ముఖ్యమైన అంశంపై నా అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేసిన వాడినవుతానని భావించాను.
“సమస్య చాలా సంక్లిష్టమైనదని నా అభిప్రాయం. 90 సంవత్సరాల సుదీర్ఘమైన తెలుగు జాతి చరిత్రలో ‘రాష్ట్రం – రాజధాని’ చుట్టూ చాలా సంక్లిష్టమైన పోరాటాల చరిత్ర మిళితమై ఉన్నది. ఆ చరిత్రను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, ప్రజలు గుణపాఠాలు నేర్చుకుని, రాజధాని అంశాన్ని ఆలోచించవలసిన విధిలేని పరిస్థితి రాష్ట్ర విభజనతో వచ్చింది. 2014 తర్వాత రాష్ట్ర రాజధాని ఎంపిక చేసుకోవడంలో శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.
జుట్లు పట్టుకునే పరిస్థితి లేకుండా విజ్ఞతతో చట్టసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ నేపథ్యంలోనే, భూ సేకరణ చట్టం – 2013 అమలులోకి వచ్చింది. అది పోరాటాలతో సాధించుకున్న చట్టం. ఆ చట్టాన్ని కూడా పక్కనపెట్టి అంత డబ్బు వెచ్చించి భూమిని సేకరించుకునే స్తోమత ఆంధ్రప్రదేశ్ కు లేదు కాబట్టి, భూ సమీకరణ చట్టాన్ని కొత్తగా తీసుకొచ్చి, రైతులను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తూ రాజధాని నిర్మాణం చేస్తామని ప్రభుత్వం చెప్పింది.
29 గ్రామాలకు చెందిన 30 వేల రైతు కుటుంబాలు, తమ కష్టార్జితమైన 34 వేల ఎకరాల భూమిని త్యాగం చేశారు. అమరావతి రాజధాని పరిరక్షణోద్యమం కాలంలో నేను దాదాపు ఆ 29 గ్రామాల ఉద్యమ కేంద్రాలైన శిబిరాల దగ్గరకు వెళ్ళాను. పిల్లలు బోర్డులు పట్టుకొని శిబిరాల్లో ముందువరుసలో కూర్చున్న దృశ్యాలు చూసి కన్నీరు తెప్పించాయి.
తమ పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం భూమిని ఇచ్చిన రైతులను రాజధాని నిర్మాణంలో మొదటి లబ్ధిదారులుగా పరిగణించాలి. భూములిచ్చిన రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం వినాలి. వారి కుటుంబాలకు, పిల్లల భవిష్యత్తు పట్ల భరోసా కల్పించాలి.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రామాణికంగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలి. అది ‘మాండమస్’ జడ్జిమెంట్. గత ప్రభుత్వం ఆ తీర్పును విస్మరించింది. ఈ ప్రభుత్వం విస్మరిస్తుందా? లేదా, తూచా తప్పకుండా అమలు చేస్తుందా? గన్నవరం ఎయిర్పోర్ట్ సరిపోతుందా? లేదా? అన్న అంశాన్ని అలా ఉంచితే, దాని విస్తరణ కోసం భూమి తీసుకున్నారు. వారికి అమరావతి రాజధాని పరిధిలో స్థలాలు సర్దుబాటు చేశారు.
నేను విద్యార్ధిగా ఉన్న కాలం నుంచి పలు దేశాలకు వెళ్లాను. మనకు కూడా లండన్ ఎయిర్పోర్ట్ లాంటిది కావాలి. బెంగుళూరు, హైదరాబాదు లాంటి మహానగరం కావాలి. అలాంటివి మనకు రేపటికే కావాలనే ఆకాంక్ష ఉన్నది. కానీ, సాధ్యం కాదు కదా! నగరాల నిర్మాణం అలా సాధ్యం కాదు. మన రాష్ట్రం యొక్క భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలి.
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు సమతుల్యమైన, సమగ్రాభివృద్ధిని కోరుకుంటున్నారు. కియా పరిశ్రమ వచ్చింది. దానికి హంద్రీ – నీవా ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. నేను ఈ మధ్య అనంతపురంకు వెళ్ళినప్పుడు ఒక మిత్రుడు చెప్పాడు, 40, 50 వేల మందికి (ప్రత్యక్ష మరియు పరోక్ష) ఉపాధి లభించిందని. ఎడారి కాబోతుందని ఆందోళన కలిగించిన అనంతపురం జిల్లాకు కాస్త ఊపిరి పీల్చుకునే పరిస్థితి. నీరే ప్రాణాధారం.
ఆలోచనారుల వేదిక ఆధ్వర్యంలో కృష్ణా, గోదావరి నదీ జలాలు, నీటిపారుదల ప్రాజెక్టులపై రాజకీయాలకతీతంగానే కృషి చేస్తున్నాము. అంటే రాజకీయాలను పక్కనబెట్టి కాదు. రాజకీయా లు మన జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. అందువల్ల వాటికి దూరంగా ఉండి ఆలోచించలేం. ఎవరు రాజధానిని వివాదాస్పదం చేశారు? మూడు రాజధానుల ముచ్చటను ముందుకు తీసుకొచ్చారు? తెలుగు ప్రజల ఐక్యతను విచ్చిన్నం చేయడానికి ప్రయత్నం చేసింది రాజకీయమే కదా!
అందువల్ల, సమస్య చాల సంక్లిష్టమైనది. దీనిపై మేధోమధనం జరగాలి. శాసన సభకు ప్రధాన ప్రతిపక్షం హాజరుకావడం లేదు. నిజమే. కానీ, అధికారంలో ఉన్న కూటమి పక్షాలు శాసనసభలో ఉన్నాయి కదా! ఈ అంశంపై చర్చించారా? వారి ఆలోచనలను తెలుసుకున్నారా? విధాన నిర్ణయం చేశారా? అదే జరిగి ఉంటే మనం చర్చించుకోవడానికి అదొక ప్రాతిపదికగా ఉండేది. అలాంటి అధికారిక పత్రమే లేకపోవడంతో చీకటిలో కూర్చుని, ఊహాగానాలు, అనుమానాల మధ్య మాట్లాడుకోవాల్సిన పరిస్థితుల్లోకి నెట్టబడ్డాం.
రాజకీయ పార్టీలు లేవా? ఈ సమస్యపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడచ్చు కదా? ప్రజాస్వామ్యంలో రాజకీయపార్టీల వాణి వినాలి. చట్ట సభలో చర్చించాలి. రాజధాని కొందరికి సంబంధించిన అంశం కాదు. విమర్శలు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఒక సమస్యపై అనుకూలమా, వ్యతిరేకమా, అని చెప్పడానికి చర్చ అవసరం లేదు కదా!
సమస్యపై లోతుగా ఆలోచన చేయడానికి, విమర్శనాత్మకంగా ఆలోచన చేయడానికి, సహేతుకమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడానికి బాటలు వేసే చర్చ అవసరమని బలంగా భావిస్తున్నా”.
– టి. లక్ష్మీనారాయణ