– ప్రధానమంత్రి కార్యాలయం మాజీ అధికారి సుధీంద్ర కులకర్ణి
అమెరికా వంటి దేశాల దూకుడుకు వ్యతిరేకంగా భారత్, చైనా ఏకమైతే ప్రపంచ క్రమాన్ని మార్చి, సరికొత్త దిశను నిర్దేశించగలవని విదేశీ వ్యవహారాల నిపుణుడు, ప్రధానమంత్రి కార్యాలయం మాజీ అధికారి సుధీంద్ర కులకర్ణి అభిప్రాయపడ్డారు. భారత వస్తువులపై వాషింగ్టన్ 50 శాతం టారిఫ్‌లు విధించడాన్ని, చైనా రాయబారి జు ఫెయిహాంగ్ ఖండించడం సరైన చర్య అని కులకర్ణి అన్నారు.
ఒక రౌడీలా ప్రవర్తిస్తున్నప్పుడు మౌనంగా ఉండకూడదని రాయబారి స్పష్టంగా చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ తనను తాను ప్రపంచ పోలీస్‌గా భావిస్తూ అందరినీ బెదిరిస్తున్నారు. ఆ అధికారం ఆయనకు ఎవరూ ఇవ్వలేదు. భారత్, చైనా పొరుగు దేశాలని, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు ప్రాచీన నాగరికతలని అని కులకర్ణి తెలిపారు.
ఈ రెండు దేశాలు ఏకమైతే ప్రపంచ రూపురేఖలను మార్చేయవచ్చు. ప్రపంచ వ్యవస్థను మరింత ప్రజాస్వామ్యబద్ధంగా, సమానత్వంతో తీర్చిదిద్దవచ్చు” అని అన్నారు. భారత్, చైనా, పాకిస్థాన్ తమ మధ్య ఉన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుని, ఈ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు కోసం పాటుపడాలని, ‘కొత్త దక్షిణాసియా’కు ఆయన పిలుపునిచ్చారు.
చైనాను నమ్మవచ్చా అనే ప్రశ్నకు కులకర్ణి బదులిస్తూ.. నమ్మకాన్ని సంపూర్ణంగా చూడలేమన్నారు. మనం అమెరికాను విశ్వసించాం. ప్రధాని మోదీ అమెరికా గడ్డపైనే ట్రంప్ కోసం ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు అదే ట్రంప్ మన పట్ల అత్యంత స్నేహరహితంగా ప్రవర్తిస్తున్నారు. కాలం మారుతుంది. స్నేహితులను మార్చుకోవచ్చు కానీ, పొరుగువారిని మార్చుకోలేం అని మాజీ ప్రధాని వాజ్‌పేయి చెప్పిన మాటలను గుర్తుంచుకోవాలి అని విశ్లేషించారు.
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పర్యటనతో సరిహద్దు చర్చల్లో పురోగతి ఉంది. త్వరలోనే సానుకూల ఫలితాలు ఆశించవచ్చని తెలిపారు. పాకిస్థాన్‌తో చైనా సంబంధాల గురించి మాట్లాడుతూ, అమెరికా కూడా పాకిస్థాన్‌కు దగ్గరగా లేదా? అని కులకర్ణి ప్రశ్నించారు.