– పల్లెల్లో పడకేసిన పాలన
– ఎమ్మెల్సీ తక్కెళ్ల పల్లి రవీందర్ రావు
హైదరాబాద్: తెలంగాణ లో ఎక్కడా చూసినా పారిశుధ్య లోపం కనిపిస్తోంది. హైదరాబాద్ సహా పల్లెల దాకా ఎక్కడ చూసినా చెత్తనే కనిపిస్తోంది. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఇంతటి దుర్గంధభరిత పరిస్థితులు ఎవ్వరూ చూడలేదు.
పంచాయతీలకు చెత్త సేకరణకు ఇచ్చిన ట్రాక్టర్లకు డీజిల్ లేక సరెండర్ చేస్తున్నారు.పంచాయతీ కార్యదర్శులు అప్పుల పాలై సమ్మె బాట పడుతున్నారు. పల్లెల్లో ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ లేవు. స్థానిక ఎన్నికలు పెట్టలేదు కనుక కేంద్ర నిధులు గ్రామాలకు రావడం లేదు. కేంద్రం నిధులు రాకపోవడం వల్ల పల్లెలు మురికి కూపాలు గా మారాయి.
బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కేంద్రం పరిధిలో ఉన్నాయని తెలిసి కాంగ్రెస్ మోసపూరిత మాటలు చెప్పింది. సుప్రీం కోర్టు 50 శాతం రిజర్వేషన్ల పరిమితి విధించిందని తెలిసి కూడా కాంగ్రెస్ బీసీ లను మోసం చేసింది. సుప్రీం కోర్టు ,గవర్నర్ ,రాష్ట్రపతి ల మీద నెపం నెడుతూ స్థానిక ఎన్నికలను పెట్టకుండా కాలయాపన చేస్తున్నారు.
ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది .అందుకే ఎన్నికలు పెట్టడం లేదు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్థానిక ఎన్నికలు పెట్టడం ఇష్టం లేదు. రాజీవ్ గాంధీ తెచ్చిన 73 ,74 రాజ్యాంగ సవరణలను కాంగ్రెస్ ప్రభుత్వమే ఉల్లంఘించడం శోచనీయం. స్థానిక ఎన్నికలు ఐదేళ్ల కోసారి ఎన్నికలు నిర్వహించాలనే రాజ్యాంగ సవరణలకు కాంగ్రెస్ ఎపుడూ అధికారం లోకి వచ్చినా తూట్లు పొడుస్తోంది.
రాజీవ్ గాంధీ పేరు ను జపించే కాంగ్రెస్ నేతలకు ఆయన తెచ్చిన 73 , 74 రాజ్యాంగ సవరణలను అమలు చేయాలన్న సోయి లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా స్థానిక ఎన్నికలను నిర్వహించి పల్లెల్లో దుర్గంధాన్ని నివారించాలి.
పల్లెల్లో పాలన పడకేసింది. ప్రజలు అంటు వ్యాధులతో సతమతమవుతున్నారు. డెంగీ ,మలేరియా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. స్థానిక ఎన్నికలు జరగకపోతే పల్లెల్లో నిధులు రాక పరిస్థితులు గాడి తప్పుతాయి. రేవంత్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు.
నిమ్స్ నుంచి కింది ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులు దారుణం గా ఉన్నాయి. బీ ఆర్ ఎస్ పై కేసులు పెట్టడం తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదు. యూరియా లైన్లలో రైతులు కేసీఆర్ ను గుర్తు చేసుకుంటున్నారు. దద్దమ్మ చేతకాని ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు
42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కాంగ్రెస్ భాద్యత ..ఎలా ఇచ్చి ఎన్నికలు పెడతారో పెట్టాలి. పల్లెల్లో నెలకొన్న పారిశుధ్య లోపాలను సవరించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన నిధులు విడుదల చేయాలి. పల్లెల్లో దారుణమైన పరిస్థితులు చూసి మాకు కూడా ఓపిక నశిస్తోంది. పరిస్థితులు చక్కదిద్దకపోతే బీ ఆర్ ఎస్ ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటిస్తుంది.
ప్రెస్ మీట్ లో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వాసుదేవ రెడ్డి ,వెంకటేశ్వర్ రెడ్డి ,బీ ఆర్ ఎస్ నేత రాఘవ పాల్గొన్నారు.