– మంత్రులు టీజీ భరత్, పయ్యావుల కేశవ్
అనంతపురం: అనంతపురం జిల్లా అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ.భరత్, రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం సాయంత్రం జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ (డిఆర్సీ) సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి భరత్ మాట్లాడుతూ ప్రజెంటేషన్ మెథడాలజీ బాగుంటే రాష్ట్ర వ్యాప్తంగా దీనిని అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరతామన్నారు. సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల నుంచి తెలియజేసిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమలు రాష్ట్రమంతా రాబోతున్నాయన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సత్యసాయి జిల్లాకు ఎక్కువగా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని, ఎందుకంటే బెంగుళూరు సరిహద్దుగా ఉండడం సత్యసాయి జిల్లాకు కలిసివచ్చిందని, మౌలిక సదుపాయాలు మరింత పెరిగితే పెద్ద ఎత్తున పరిశ్రమలు అనంతపురంలో కూడా పరిశ్రమలు నెలకొల్పే అవకాశం ఉందన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ ఏ.మాలోల, సిపిఓ అశోక్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ, హార్టికల్చర్ డిడి ఉమాదేవి, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ రాజా స్వరూప్ కుమార్, డిఆర్డీఏ పీడి శైలజ, ఎపిఎస్పిడిసిఎల్ ఎస్ఈ శేషాద్రిశేఖర్, జడ్పి సిఈఓ వెంకటసుబ్బయ్య, హౌసింగ్ పిడి శైలజ, డ్వామా పిడి సలీమ్ భాష, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ విశ్వనాథరెడ్డి, బిసి వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి రామసుబ్బారెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ ఈబి.దేవి, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రతాపరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.