– ఫైర్‌సేఫ్టీ కుంభకోణంలో 1.19 కోట్ల అవినీతి
– సుప్రీంకోర్టు ఆదేశాలతో లొంగుబాటు
– నాడు బాబును వేధించిన సంజయ్
– రూల్సుకు విరుద్ధంగా ఢిల్లీలోనూ ప్రెస్మీట్లు
అమరావతి: జగన్ జమానాలో చెలరేగిన మరో ఐపిఎస్ కటకటాలపాలయ్యారు. ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సంజయ్ విజయవాడలోని ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన కోర్టు ముందు హాజరుకాగా, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం సంజయ్‌ను విజయవాడ జైలుకు తరలించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో సంజయ్ సీఐడీ చీఫ్‌గా .. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అవగాహన కల్పించే కార్యక్రమాల కోసం, ఫైర్ సేఫ్టీ పరికరాలు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో, ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కై రూ.1.19 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సంజయ్ తొలుత హైకోర్టును ఆశ్రయించారు.
ఈ ఏడాది జనవరి 30న హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేయగా, సుప్రీంకోర్టు వాటిని కొట్టివేసింది. మూడు వారాల్లోగా కోర్టులో లొంగిపోవాలని, ఆ తర్వాతే సాధారణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ విషయం తెలిసిందే.