– స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్
మంగళగిరి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత 14 నెలల కాలంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతోందని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్ అన్నారు. యువతకు ఇచ్చిన మాట ప్రకారం 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్డీఏ కూటమి ఇచ్చిన ప్రధాన హామీలలో ఒకటైన ఉద్యోగ కల్పనను నెరవేర్చేందుకు ప్రభుత్వం రూ. లక్ష కోట్లు పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా, మెగా డీఎస్సీకి శ్రీకారం చుట్టిందని అన్నారు. నారా లోకేష్ గారు చూపించిన చొరవతో మెగా డీఎస్సీని నిర్వహించి దాదాపు 16,347 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నామని తెలిపారు. ఈ పరీక్షలకు 3,36,307 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 92.9 శాతం మంది హాజరయ్యారన్నారు. గతంలో రెండు నెలల్లో ఎన్నికలు అనగా మోసపూరితమైన డీఎస్సీ ప్రకటన చేసి నిరుద్యోగ యువతను దగా చేసిన జగన్మోహన్ రెడ్డికి భిన్నంగా అధికారంలోకి రాగానే తమ హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు వయసు సంబంధించి మినహాయింపులు ఇచ్చి నారా లోకేష్ గారు వారికి అండగా నిలబడ్డారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక సమగ్ర శిక్ష సొసైటీ ఆధ్వర్యంలో కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 729 నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేసిందని, 90 మంది ఎస్టీ యువతను కొత్తగా ఉపాధ్యాయులుగా నియమించిందని, 700 కోయభారతి టీచర్ పోస్టులను కూడా భర్తీ చేసిందని వివరించారు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల ముఖ్యమంత్రి హోదాలో 13 డీఎస్సీలు నిర్వహించి 1,80,208 పోస్టులు భర్తీ చేశారని ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల్లో అధిక భాగం ఆయన హయాంలో ఉద్యోగాలు పొందిన వారేనని గుర్తు చేశారు.
యువత బాగుపడటం ఇష్టంలేని జగన్మోహన్ రెడ్డి అనేక తప్పుడు ప్రచారాలు చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదని ‘నాడు-నేడు’ పేరుతో రంగులు వేసి తన బొమ్మలు పెట్టుకుని కోట్ల రూపాయలు తగలేశారన్నారు. పీఆర్సీ కోసం చలో విజయవాడ అని ఉపాధ్యాయులు వస్తే బీఆర్టీఎస్ రోడ్డులో పాఠాలు చెప్పే టీచర్లను లాఠీలతో కొట్టించావు, ఉపాధ్యాయుల బదిలీల్లో అవినీతి అక్రమాలు చేశారని అన్నారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం నాణ్యమైన విద్యలో రాష్ట్రం 3వ స్థానం నుంచి 19వ స్థానానికి దిగజారడానికి జగన్ ప్రభుత్వమే కారణమని అన్నారు.
తల్లిదండ్రులతో సమానంగా చూసుకునే ఉపాధ్యాయులను గత ప్రభుత్వంలో కత్తిపెట్టి మరుగుదొడ్లు కడిగించారని, మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టించారన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ తల్లికి వందనం ఇస్తామని చెప్పిన మాట ప్రకారం అందరికి తల్లికి వందనం ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. విద్యార్థి మిత్ర పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన కిట్లు, జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, పదవ తరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులపై పని ఒత్తిడి తగ్గించడానికి, అనేక యాప్ల స్థానంలో ఒకే ఒక్క యాప్ను తెచ్చామని, వారికి సకాలంలో జీతాలు ఇస్తున్నామని చెప్పారు. నారా లోకేష్ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టి విద్యార్థులు, ఉపాధ్యాయుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలిపారు